– సాధారణ ప్రసవాలను పెంచాలి
– నులి పురుగుల నివారణతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు
– సిబ్బంది నియామకానికి ప్రపోజల్స్ తయారు చేయాలి
– జిల్లా కలెక్టర్ రాజర్షి షా
నవతెలంగాణ-మెదక్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ సేవలు, సిబ్బంది, డెలివరీల గురించి చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్స్ సేవలు, సాధారణ ప్రసవాలను పెంచాలని తెలిపారు. ఫిబ్రవరి 12న నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పిల్లలందరికీ ఫిబ్రవరి 12న నులిపురుగుల నివారణ కోసం నివారణ టాబ్లెట్స్ వేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్ ఆదేశానుసారము, ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం కింద జిల్లాలో ఎనీమియా ముక్త్ తెలంగాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కిశోర వయసు బాలికల్లో రక్తహీనత నివారించి వారిని ఆరోగ్యవంతులుగా చేయటం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 24 జనవరి 2024 నుంచి 10 ఏప్రిల్ 2024 వరకు రాష్ట్రీయ బాల్య సురక్ష కార్యక్రమం, మొత్తం 6 టీంల ద్వారా జిల్లాలో ఉన్న 32,850 మంది పిల్లలకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో 8 నుంచి 12 తరగతుల బాలికలకు యాక్షన్ ప్లాన్ ప్రకారం రక్త పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న పిల్లలందరినీ గుర్తించి వారికి మూడు నెలలపాటు బ్లూ (నీలం) కలర్ ఐరన్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీంతో పాటు ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారమైన ఆకుకూరలు, పప్పుధాన్యాలు, బెల్లం, ఖర్జూర పండ్లు, లివర్, దానిమ్మ పండ్లు, గుడ్లు మొదలగు ఆహారాలు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలన్నారు. స్కూలుకు వెళ్ళని పిల్లలను గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకొని వారికి ఐరన్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఐరన్ పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ చందూ నాయక్, విజయ నిర్మల, మాధురి, అలిలా, అరునశ్రీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.