దిగిపోయే ముందు కీలక నిర్ణయాలా? : ఉత్తమ్‌

దిగిపోయే ముందు కీలక నిర్ణయాలా? : ఉత్తమ్‌– సీఎం కేసీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగిపోయే ముందుకు సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకోవడం సరైందికాదని ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇదే అంశంపై శుక్రవారం ఆయనతో పాటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధుయాష్కీ, మహేష్‌కుమార్‌గౌడ్‌, జి. నిరంజన్‌, హర్కర వేణుగోపాల్‌, రోహిన్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్‌ నేతలు సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ రైతుబంధు నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించకుండా చూడాలని సీఈవోను కోరారు. ఆ పథకం కింద రూ. 6వేల కోట్లు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్‌లో అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. వాటిని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయకుండా చూడాలని కోరారు. అసైన్డ్‌ భూముల రికార్డులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని కోరారు. ఫలితాల సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. గెలుపు ధృవపత్రాలను తమ పార్టీ చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లు తీసుకుంటారనీ, అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సోమవారం కేసీఆర్‌ మంత్రివర్గ సమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారో తెలియదన్నారు. రాజీనామాలు సమర్పించేందుకే క్యాబినెట్‌ ఏర్పాటు చేసి ఉండొచ్చునన్నారు.
మా అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నం : డీకే
రాష్ట్రంలో కాంగ్రెస్‌ సునాయాసంగా అధికారంలోకి వస్త్తుందని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ”కాంగ్రెస్‌ అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఆయన స్వయంగా సంప్రదించినట్టు మా అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు మా పార్టీ అభ్యర్థులు చెప్పారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదు’ అని డీకే తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులందరూ అలెర్ట్‌గా ఉండాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సూచించారు. మరోవైపు ఫలితాల తర్వాత అవసరమనుకుంటే ఎమ్మెల్యేలను క్యాంప్‌కు పంపాలనే యోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరేంత వరకూ పూర్తి భాద్యతలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ డీకేకు అప్పగించింది. ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి రేవంత్‌ ముహూర్తం ఖరారు చేశారు. ఆయన ఇంటి వద్ద నేతల హడావిడి చేస్తున్నారు. మొన్నటి నుంచి రేవంత్‌ను కాంగ్రెస్‌ నేతలు, ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కలుస్తున్న విషయం తెలిసిందే.