ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌..!

– రూ.వేల నుంచి రూ. లక్షల్లో పందేలు
– 20 రోజులు ఉండడంతో పెరిగిన ఉత్కంఠ
నవతెలంగాణ-హాజీపూర్‌
పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తోడోనని ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా మరో వైపు ఫలితాలపై బెట్టింగ్‌లు సైతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాదంటే నాదే గెలుపు అంటూ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా వీరికి తోడు అభ్యర్థి గెలుపుపై సొంత పార్టీల్లోనే కాదు ఇతరులు సైతం బెట్టింగ్‌ లకు తెరలేపుతున్నారు. ఇంకా 20 రోజులు ఉండటంతో బెట్టింగ్‌ అంటే తెలియని వారు కూడా బెట్టింగ్‌ రాయుళ్లుగా మారుతుండటంతో పందేలు పెరుగుతున్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులుగా 42 మంది బరిలో ఉండగా ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. అయినప్పటికీ బీఎస్పీతో పాటు ఇతర స్వతంత్ర అభ్యర్థులు సైతం గెలుపు తమదేన0ని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులకే ప్రాధాన్యం
బీజేపీ ఎంపీ అభ్యర్ది గోమాసె శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకష్ణ గెలుపోటములపై బెట్టింగ్‌ మాత్రం జోరుగా సాగుతోంది. గ్రామాల్లో వెల్లువెత్తిన ఓటరు చైతన్యంతో పాటు పెరిగిన ఓటింగ్‌ శాతంతో గెలుపుపై ఈ బెట్టింగ్‌లు ఆగడం లేదు. ఏ నలుగురు కలిసినా, కూడళ్లలో, ఛారు హోటళ్లో చూసినా అభ్యర్థుల విజయావకాశాలపై ఆరా తీస్తూ ఉన్న సమాచారంతో జయాపజయాలపై పందేలు పెట్టేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్‌లు రూ.వేల నుంచి మొదలు రూ.లక్షల్లో సాగుతుండగా వీటిల్లో టూర్లు, దావత్లు ఇంకా ఎన్నో రకాలుగా కూడా ఉంటున్నాయి. ఇక బెట్టింగ్‌ ఇలా ఉంటే ఎవరు గెలుస్తారని ఇటు స్నేహితులే కాదు బంధువులు, ఇతర ప్రాంతాల్లోని వారు వివిధ స్థాయిల్లో ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఫలితాల నిరీక్షణకు 20 రోజులు ఉండగా అభ్యర్థుల గెలుపుపై ఇంకా బెట్టింగ్లు పెరిగే అవకాశంఉంది. ఈ బెట్టింగ్లు ఎవ్వరిని ఏ విధంగా నిలబెడుతాయో చూడాలంటే ఇరవై రోజులు వేచిచూడక తప్పదు.