‘ఏమండీ శ్రీవారు! చాయి తీసుకోండి!” అంటూ టీకప్పు అందించింది వనజ.
ఫోనులోనుండి తలపైకెత్తి టీ తీసుకుని మళ్లీ ఫోనులో మునిగిపోయాడు కుమార్.
”ఏమిటండి అంతగా ఏముంది మీ ఫోనులో! పొద్దటి నుండి చూస్తూనే ఉన్నారు! చూడకుడనిది ఏమైనా చూస్తున్నారా?” అడిగింది వనజ.
”దేశానికి స్పూర్తినందించేది చూస్తున్నాను! ఇది చూస్తుంటే నా జన్మకిది చాలు అన్పిస్తోంది!” అన్నాడు కుమార్ తన్మయత్వంతో.
”ఓహో అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తునారా?” అన్నది వనజ.
”అబ్బే కాదు! పెద్దాయన చేసిన ట్వీట్లు చూస్తున్నాను.ఆడపిల్లలు అంటే పెద్దాయనకు ఎంత ప్రేమ! నిరంతరం ఆడపిల్లల గురించి తపన పడుతూనే ఉంటారు. ఈ దేశంలో పెద్దాయన కాలంలో ఆడపిల్లగా పుట్టాలంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి!” అన్నాడు కుమార్ ట్రాన్స్‌లో ఉండి.
”ఓహో మీరేం పాపాలు చేశారో! మగాడిగా పుట్టారు!” అన్నది వనజ.
”పతియే ప్రత్యక్ష దైవం! మొగుడిని అలాంటి మాటలు అనరాదు! అసలు మగాడులో గాడ్ అనబడే దేవుడు ఉన్నాడు తెలుసా?” అన్నాడు కుమార్.
”మీరు ఫోను ఎందుకు చూస్తునారంటే, ఏదేదో చెబుతారేంటి” అన్నది వనజ విసుగ్గా.
”అట్లా అడుగు చెబుతాను! ఇందుకే అన్నాను కదా! పెద్దాయన చేసిన ట్విట్స్‌లో మహిళల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది! మను బాకర్‌కు పతకం రాగానే ఫోన్ చేసి, అభి నందనలు తెలుపుతూ మాట్లాడారు!” వినేశ్ కి ఏ పతకం రాలేదని తెలిసినా వినేశ్ వీరవనిత” అంటూ ట్విట్ చేశారు! అంతెందుకు ఒలింపిక్ సంఘానికి ఒక మహిళను అధ్యక్షురాలిగా నియమించారు! ఇది చాలదా?” అన్నాడు కుమార్.
”ట్వీట్ చేయటం, ఫోన్ చేయటం కూడా గొప్పేనా?” అంది ఆశ్చర్యంగా వనజ.
”ట్వీట్ చేయటం, ఫోన్ చేయటమే కాదు వినేశ్ కోసం రూ.డెబ్బయి లక్షలు కేటాయించారు. ఖర్చు కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఇంతఖర్చు పెట్టిందా?” ప్రశ్నించాడు కుమార్.
”ఇంతకూ మీరు ఏమంటారు?” ప్రశ్నించింది వనజ.
”పెద్దాయన బేటీల కోసం చేస్తున్న ఖర్చు, త్యాగాలు తెలుసుకోమంటున్నాను” అన్నాడు కుమార్.
”మీరు చెప్పింది అర్థమయ్యింది. అయితే పోటీల్లో పతకాలు గెలిచిన తర్వాత ఫోన్లు చేసి అభినందించే బదులు, పోటీలకు సిద్ధమయ్యే టైములో, అందరు ఆటగాళ్లకు సరైన క్రీడావసతులు ఏర్పాటు చేసి, మీరు గెలవండి! అందుకు మేమేం చేయాలో మాకు చెప్పండి. అది పెద్దాయన ఎప్పుడైనా అడిగారా? లేదు కద!” అన్నది వనజ.
”దానికేం, కాని ఇప్పటికే ఎన్నో స్టేడియాలు కట్టించీ, క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు పెద్డాయన! ఆహ్మాదాబాద్‌లో నరేంద్రమోడీ స్టేడియం కూడా కట్టించాడు తెలుసా!” అన్నాడు కుమార్ గొప్పగా.
”అది..క్రికెట్ స్టేడియం!” అన్నది వనజ నవ్వుతూ.
కుమార్ గందరగోళపడ్డాడు.
”మీరిందాక, ఈ దేశంలో మహిళలుగా పట్టడం గొప్పవిషయం అన్నారు! కాని ఈ దేశంలో మహిళలకు ఏ మాత్ర, గౌరవ మర్యాదలు లేవు! అసలు మహిళలను మనుషులుగా చూడటం లేదు! పెద్దాయన ఫోను చేసి మాట్లాడటం, మహిళల కోసం ట్వీట్స్ చేయటం గొప్ప అన్నట్లు చెబుతున్నారు! నిజంగానే మహిళల పట్ల అంత బాధ్యత ఉంటే ఈ రోజు వరకు మణిపూర్‌కి ఎందుకు వెళ్లలేదు! అక్కడ అవమానాలకు గురైన మహిళలను ఎందుకు ఆదుకోలేదు!” నిలదీసింది! వనజ.
”ఎప్పుడూ మణిపూర్ మీద పడి ఏడుస్తారేం?” చిరాగ్గా అన్నాడు కుమార్.
”ఎందుకంటే మణిపూర్ మహిళల మానమర్యాదలు మంటగలిశాయి కనక! అక్కడ డబులింజన్ సర్కార్ రాజ్యమేలుతున్నది కనక! సరే మీరన్నట్లు మణిపూర్‌ని పక్కనపెడితే ఏమున్నది గర్వకారణం? మహిళా రెజ్లర్లు రోడ్డుమీద న్యాయంకావాలి మొర్రో! అని రోదిస్తుంటే వారి బాధ పట్టించుకోలేదు! పట్టు దలగా జగజ్జెట్టీలను ఓడించి, ఫైనల్‌కి వచ్చిన వినేశ్‌ని దొంగదెబ్బ తీశారు! ఆ తర్వాత తీరిగ్గా వినేశ్ వీరవనిత అని ట్వీట్ చేస్తే ఏమి ఉపయోగం?” ప్రశ్నించింది! వనజ.
కుమార్ గొంతు పెగలలేదు.
‘మొన్న కొల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌పై పశువుల్లా అత్యాచారం చేశారు. గత పదేండ్లలో లైంగికదాడులు, హత్యలు బాగా పెరిగిపోయాయి. ఎందుకో తెలుసా? మగాళ్లలో గాడ్ ఉన్నాడన్న అహంకారం, మహిళలు పురుషులకు బానిసలన్న భావజాలం, ఇందుకు కారణాలు! గత పదేండ్లుగా మీ భావజాలం విస్తరించి, మహిళలకు రక్షణ లేకుండా చేసింది. స్త్రీలకు మనస్సు ఉంటుందని, వారికి ఇష్టా యిష్టాలుంటాయని మీ భావజాలానికి తెలియదు. మీ భావజాలానికి తెలిసినవి రెండే రెండు. అందులో ఒకటి ద్వేషం, మరొకటి ఆధిపత్యం. అందుకే దేశంలో అత్యాచాలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి” అంటూ ముగించింది వనజ.
– ఉషాకిరణ్