భార్యాభర్తల మధ్య..?

Between husband and wife..?ఈ మధ్య కాలంలో పెట్స్‌ (పెంపుడు జంతువులు) పెంచుకోవడం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. కుక్కలు, పిల్లులు, చిలకలు, పక్షులు వంటి వాటిని చాలా మంది ఇష్టంగా పెంచుకుంటున్నారు. మనసు బాగోలేక పోయినా, ఏమీ తోచకపోయినా, బోర్‌ కొట్టినా పెట్స్‌తో కాసేపు ఆడుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. వాటితో సమయం గడుపుతుంటే కాస్త సేదతీరినట్టు, మన ఆప్తులతో గడుపుతున్నట్టు ఉంటుంది. కొంత మంది వాటిని ఇంట్లో సభ్యులుగా చూసుకుం టారు. అయితే ఇంట్లో ఉన్న సభ్యులందరికీ నచ్చితేనే ఆ ఆనందాన్ని పొందగలరు. లేదంటే వాటి వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయని ఈ వారం ఐద్వా అదాలత్‌ చదివితే అర్థమవుతుంది.
32 ఏండ్ల స్వరూప్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. ఇంట్లో 70 ఏండ్ల అమ్మ ఉంటుంది. ఆమెకు బి.పి, షుగర్‌, సమస్యలతో పాటుగా ఈ మధ్య కాలంలో గుండెకు సంబంధించిన సర్జరీ కూడా చేయించారు. భార్య స్వప్నకు 30 ఏండ్లు ఉంటాయి. వాళ్ళకు పెండ్లయి ఐదేండ్లు అవుతుంది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. పిల్లల కోసం ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటున్నారు. కానీ వారి మధ్య అంత అన్యోన్యత లేదు. దానికి కారణం స్వప్న ఇష్టంగా పెంచుకునే కుక్కపిల్ల(మిక్సి).
మిక్సి అంటే స్వప్నకు చాలా ఇష్టం. అది పెండ్లి కాకముందు నుండి ఆమెతోనే ఉండేది. పెండ్లి తర్వాత రెండు మూడు రోజులు తన వద్ద ఉంచుకొని పంపించేది. రెండేండ్లకు స్వప్న దాన్ని తనతో పాటు తీసుకొచ్చుకుంది. ‘ఎందుకు దాన్ని ఇక్కడ పెట్టుకోవడం, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసెరు’ అని భర్త అంటే ‘ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే బోర్‌గా అనిపిస్తుంది. మనకు పిల్లలు కూడా లేరు కదా! అందుకే నేను మిక్సిని ఇక్కడే పెట్టుకుంటాను. మీకెవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను’ అంది.
స్వరూప్‌కు పెట్స్‌ అంటే అంతగా ఇష్టం లేదు. పైగా వాటిని పెంచుకుంటే కొన్ని రకాల వ్యాధులు వస్తాయని, వాటి గురించి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలని, ఇల్లు మొత్తం పాడు చేస్తాయని అతను వాటికి దూరంగా ఉంటాడు. వాటి దగ్గర ఒకరకమైన వాసన వస్తుంది. అది అతనికి అసలే నచ్చదు. అయినా స్వప్న కోసం ఒప్పుకున్నాడు. కానీ మిక్సికి కొన్ని పద్ధతులు నేర్పించలేదు. అది వచ్చి వీళ్ల బెడ్‌పైనే పడుకుంటుంది. స్వరూప్‌ను స్వప్న పక్కన పడుకోనీయదు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ 1,2 చేస్తుంది. దాంతో ఇల్లంతా ఒకటే వాసన. సోఫాపైన కూడా అలాగే చేస్తుంది.
‘మిక్సి వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానన్నావు. ఇప్పుడు చూడు అది ఇల్లు మొత్తం పాడు చేస్తుంది. మన ఇంటికి రావడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అమ్మకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఈ మధ్యనే సర్జరీ అయ్యింది. దీని వల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మిక్సిని కొద్ది రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలి పెట్టిరా, లేకపోతే దాని కోసం బయట ఒక చిన్న పెట్‌ హౌస్‌ కట్టిస్తాను. దాన్ని అందులో పడుకోబెట్టు. లేదంటే నేను నీకు కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది. అందరూ పిల్లలు ఎందుకు కలగడం లేదూ అంటున్నారు. ఆస్పత్రికి వెళ్ళి మందులు వాడుతున్నా ఉపయోగం లేదేంటి అని బంధువులంతా అడుగుతున్నారు. ఎన్ని మందులు తిన్నా మన మధ్య సంబంధం లేనప్పుడు పిల్లలు ఎలా పుడతారు? ఇప్పటికే నా వయసు 32. ఇంకా లేట్‌ చేస్తే పిల్లలు పుట్టడమే కష్టంగా మారుతుంది. నీకైనా నాకైనా చాలా సమస్యలు వస్తాయి. అర్థం చేసుకో’ అని స్వరూప్‌ ఎంత చెప్పినా స్వప్న అతని మాటలు పట్టించుకోవడం లేదు.
మిక్సి అయితే స్వరూప్‌ను అసలు స్వప్న పక్కన కూర్చోనీయదు, తాకనీయదు. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న స్వరూప్‌ ఐద్వా అదాలత్‌ వద్దకు వచ్చి ‘మీరే ఎలాగైనా స్వప్నకు అర్థమయ్యేలా చెప్పాలి. మిక్సి కోసం ప్రత్యేకంగా పెట్‌ హౌస్‌ కట్టిస్తాను’ అన్నాడు.
స్వప్నను పిలిచి మాట్లాడితే ‘నా జీవితంలో స్వరూప్‌ కంటే ముందు నుండే మిక్సి ఉంది. ఆయనకు మిక్సి నాతో ఉండటం ఇష్టం లేకపోతే నన్ను వదిలేయమనండి. విడాకులు ఇవ్వమని చెప్పండి. అంతేగానీ నేను మాత్రం మిక్సిని వదిలి ఉండలేను. అదంటే నాకు ప్రాణం. దాని కోసం నేనేమైనా చేస్తాను. నా జీవితంలో మిక్సి ఉంటే చాలు. ఇక నాకు ఎవ్వరూ అవసరం లేదు. నాకు మా అమ్మానాన్నలకంటే కూడా మిక్సి అంటేనే ఎక్కువ ఇష్టం. దాన్ని వదిలి ఉండటం అనేది జరిగే పని కాదు. అందుకే నాతో పాటే తెచ్చుకున్నాను. పెండ్లికి ముందే నేను స్వరూప్‌ను అడిగాను. అప్పుడు ‘సరే తెచ్చుకో నాకెలాంటి ఇబ్బంది లేదు’ అని చెప్పి ఇప్పుడు నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు’ అంటూ బాధపడింది.
ఇద్దరి మాటలు విన్న తర్వాత స్వరూప్‌తో ‘మీరు కూడా మిక్సిని అలవాటు చేసుకోండి. దాన్ని అప్పుడప్పుడు వాకింగ్‌కి తీసుకెళ్ళడం, స్నానం చేయించడం లాంటివి చేయండి. ఇలా చేస్తే మిక్సి మీకు దగ్గరవుతుంది’ అని చెప్పాము. అలాగే స్వప్నతో ‘పెట్స్‌ను పెంచుకోవడం తప్పేం కాదు. కానీ అది మీ ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. వాటిని నువ్వు పట్టించుకోవడం లేదు. పైగా దానికి నువ్వు కొన్ని పద్ధతులు నేర్పలేదు.
1,2 కోసం బయటకు వెళ్ళేటట్టు ట్రైనింగ్‌ ఇవ్వాలి. అలా చేయకపోవడం వల్లనే ఈ సమస్యలన్నీ. లేదంటే కచ్చితంగా మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్వరూప్‌ దీని కోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేస్తానంటున్నాడు. రాత్రి పూట దాన్ని అక్కడే పడుకోబెట్టు. అది స్వరూప్‌ను నీ దగ్గరకు రానీయడం లేదు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తున్నా నువ్వు దానికే ప్రాధాన్యం ఇస్తున్నావు. ఇది కరెక్ట్‌ కాదు. మిక్సి నీతో ఎన్ని రోజులు ఉంటుంది. నీకు జీవితాంత తోడుండేది నీ భర్త, పిల్లలు. మరి పిల్లల కోసం మీరు ప్రయత్నించాలంటే మిక్సి దానికి అడ్డుగా ఉంది. మేము చెబుతున్నది నీ సంతోషం కోసమే కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో’ అని చెప్పాము.
దానికి స్వప్న ‘మీరు చెప్పింది నిజమే మేడమ్‌. స్వరూప్‌ దాని కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేస్తాననే అంటున్నాడు. ఇకపై దాన్ని ఆ గదిలోనే ఉంచుతాను’ అని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చి ‘మేడమ్‌ ఇప్పుడు నాకు రెండో నెల’ అని సంతోషంగా చెప్పింది. వాళ్ళతో పాటు మిక్సిని కూడా తీసుకొచ్చారు. స్వరూప్‌ కూడా దాన్ని అలవాటు చేసుకొని ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారు.
– వై వరలక్ష్మి, 9948794051
Be careful with mobile phones..!