వానాకాలం.. జబ్బులతో జాగ్రత్త..!

Rainy season.. beware of diseases..!మొన్నటి దాకా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసి ఉడికించిన వేసవి కాలాన్ని తరిమేస్తూ చల్లటి చిరుజల్లులతో పలకరించే వానాకాలం ఉరుములు, మెరుపులతో వస్తుంటే! ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు. అయితే మనకే కాదు ఇది జబ్బులకూ ఆహ్లాదకరమైన కాలమే. కానీ ఈ కాలంలో డెంగ్యూ, న్యుమోనియా, మలేరియా, వాంతులు, విరోచనాలు, కామెర్లు వంటి ఎన్నో జబ్బులు విజృంభిస్తుంటాయి. చాలావరకు ఇవి మామూలుగా తగ్గిపోయే సీజనల్‌ వ్యాధులే. అయినా కొందరికి ప్రమాదకరంగానూ మారొచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడే వారికి, వఅద్ధులకు, పిల్లలకు, గర్భిణులకు కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. కాబట్టి వానాకాలంలో దోమలు విజృంభన, బెడద నుంచి బయట పడటానికి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం. కనీస జాగ్రత్తలు తప్పనిసరి అవసరం. వ్యాధుల బారిన పడ్డాక భాదపడే కంటే సత్వరం స్పందిస్తే తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో రెండు రెట్లు ఎక్కువగా జబ్బుల బారిన పడుతుంటారు జనం. వయసుతో నిమిత్తం లేకుండా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరటం చూస్తుంటాం. ఈ కాలంలో వాతావరణం మారటమే కాదు కలుషితమయ్యే నీరు, ముసురుకొచ్చే దోమల దండుతో వచ్చే జబ్బులు చాలా ఎక్కువ. అంతేనా! అప్పటికే ఉన్న కొన్ని జబ్బులు తీవ్రం కావచ్చు.
ఎందుకంటే వర్షాకాలంలో వాతావరణం మారటం శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాసమార్గాలు సంకోచించడం వల్ల అలర్జీలు, ఆస్తమా, సైనసైటిస్‌, సీవోపీడీ వంటి సమస్యలు ఉధృతం అవుతాయి. అలాంటి సమస్యలతో బాధపడేవారు ముందే డాక్టర్‌ ను సంప్రదించి మందులు మోతాదులను సరిచేసుకోవాలి. మరో ముఖ్య విషయం ఆస్తమా, సైనసైటిస్‌ వంటి సమస్యలు ఉధఅతమై చాలా మందికి జలుబు వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లు రావటం జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే, సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రమయ్యే ప్రమాదం ఉందని గమనించాలి. కాబట్టి ఈ వానాకాలంలో అకాల వర్షాలతో బయటికి వెళ్లి తడిసి రావడం మూలంగా, రోజుల తరబడి విరామం లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వరద నీటి ద్వారా నీటి వనరులు కలుషితమౌతాయి. డ్రయినేజీ వ్యవస్థ స్తంభించడంతో మురుగు నీటిలో దోమలు పెరుగుతాయి. తాగునీరు కలుషితమవుతుంది. వర్షాకాలం ప్రవేశిస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు పరిపాటే?. అయినా ప్రభుత్వాలు, స్థానిక, పురపాలక, నగర(మహా)నగరపాలక సంస్థలు డ్రెయినేజీ వ్యవస్థల్లో పూడికతీత(బ్లాకు)లు లేకుండా చేస్తూ, వర్షపు నీటి వరద సాఫీగా వెళ్లేలా (మురుగునీరు నిల్వకుండా) చూడవలసిన అవసరం ఉంది. తాగునీరు కలుషితం కాకుండా చూడవలసిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య శాఖలు దోమల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంది. అలాగే మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్త పర్చాల్సి ఉంది. ఎందుకంటే ఆ కలుషితమైన నీరు తాగడం, దోమల విజఅంభించిన వాతావరణ పరిస్థితుల మూలంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కొక్కసారి గూడాలకు గూడాలే డెంగ్యూ ఫీవర్‌, గ్రామాలకు గ్రామాలే వ్యాధులతో మంచం పట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఇవి జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండటంతో నాణ్యమైన వైద్య సేవలు సత్వరమే అందించడం కష్టం. ముందస్తు జాగ్రత్త చర్యలే తక్షణ రక్షణ. గత అనుభవాల దృష్ట్యా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదని గమనించండి.
ప్రపంచవ్యాప్తంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు 85 దేశాలను పీడిస్తూ ఉన్నాయి. ఏటా 70 కోట్ల మంది వీటి బారిన పడుతున్నారు. అందులో 7.25 లక్షల మంది చనిపోతున్నారు. భారత దేశంలో దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ ,గున్యా, జికా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మన దేశంలో ఏటా నాలుగు కోట్ల మంది దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడుతున్నారు. నాలుగు లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని అంచనా. ఇది వానాకాలం కావడంతో వర్షాలు మొదలు కాగానే దోమల తాకిడి పెరుగుతుంది. వీటి బెడదను వదిలించేందుకు రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఒక అంకుర సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. నీటిలో దాగున్న దోమల లార్వాలను పసిగట్టేందుకు అధునాతన గూఢచర్య, నిఘా ఉపగ్రహ పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. ఈ జీవులకు చౌకలో సమర్థంగా చెక్కు పెట్టడానికి ఇది ఉపయోగపడుతుందని, నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమలను లార్వా దశలోనే గుర్తించి మట్టు పెట్టడానికి ఇది ఉపయోగ పడుతుందని చెపుతున్నారు. ఎక్కడికక్కడ నిలిచి ఉండే నీటిలో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచి మానవుల్లోకి అనేక వ్యాధులను వ్యాప్తిచేస్తాయో, ఆ ప్రదేశాలను కాలువలు, చెరువులు, ట్యాంక్‌లు మురుగు నీటి ప్రాంతాలను గుర్తించి కీటక నాశనాలను ప్రయోగిస్తే లార్వా దశలోనే దోమల వ్యాప్తి అరికట్టవచ్చు అంటున్నారు. ఇలా కోల్‌కతాకి చెందిన శశిధర్‌ రాడార్‌ అనే అంకుర సంస్థ అధునాతన హైపర్‌ స్పేక్ట్రల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ ఉపయోగ పడుతుందని చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ మాజీ డైరెక్టర్‌ తపన్‌ మిశ్రా దీనిని స్థాపించారు. ఆయనకు భారత నిఘా ఉపగ్రహ పితామహుడుగా పేరుంది. దోమల లార్వాలు నిర్దిష్టంగా ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి విస్తరణకు విరుగుడు చేయవచ్చు. తద్వారా మలేరియా, డెంగ్యూ మరణాలను తగ్గించుకోవచ్చు. దీనివల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.
మరోవైపు ప్రస్తుతం దోమల నివారణకు మందులను విచక్షణా రహితంగా ఎక్కడపడితే అక్కడ పిచికారి చేస్తున్నారు. ఫలితంగా సంబంధిత నీటి వనరులు విషతుల్యమవుతున్నాయి. అందులోని జల చరాలు, పర్యావరణ వ్యవస్థలకు ఈ విధానం హానికరంగా మారింది. ఈ పోకడలకు చెక్‌ పెట్టడానికి తాజా పరిశోధన తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రభుత్వాలు ఇలా అధునాతనంగా కనిపెట్టిన అంకుర సంస్థల పరిశోధనా విధానాలను సద్వినియోగపరచుకొని నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమలను వేటాడుతూ లార్వా దశలోనే మట్టు పెట్టగలిగితే మనం అనేక జబ్బులకు కారణమైన దోమలను నిర్మూలించుకొని సీజనల్‌ ,తీవ్రమైన జబ్బులకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోగలం.ఇది ఈ రాత్రికి రాత్రే జరిగే పని కాకపోయినప్పటికీ వర్షాకాలం ముంచుకొస్తున్న వేళ తగు జాగ్రత్తలతో అటు వైద్య ఆరోగ్య, పారిశుధ్య శాఖలను ఇటు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, పట్టణ, నగర, మహానగర, పంచాయతీలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మురుగు నీరు నిల్వలేని, దోమల జాడే లేని సమాజాన్ని ఏర్పరచుటకు చిత్త శుద్ధితో కృషి చేయాలి. వ్యక్తి, కుటుంబం, సమాజం చైతన్యవంతులై అవగాహనతో వ్యవహరిస్తేనే సీజనల్‌(దీర్ఘకాలిక)వ్యాధులకు దూరం ఉండే అవకాశం మెండుగా ఉంది. ఆ వైపుగా సమాజం, పాలకులు ఉమ్మడిగా ప్రయత్నించాల్సి ఉంది..
– మేకిరి దామోదర్‌
9573666650