భానుడి ప్రతాపం పెరుగుతోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏ కాలం ఎలా ఉన్నా ఈ వేసవిలో మాత్రం నీరు బాగా తాగితేనే శరీరం వాతావరణ ప్రభావాన్ని కాస్త తట్టుకోగలుగుతుంది. అలా చేయకపోతే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. అయితే సరిపోనూ నీరు తాగుతున్నామా లేదా అని శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాలు చెబుతాయి. అవేంటంటే…
శరీరం 75 శాతం నీటితో నిండి ఉంటుంది. కాలాలతో సంబంధం లేకుండా ఏ కాలంలో అయినా నీరు బాగా తాగాలి. లేదంటే శరీరంలో కొన్ని పనులు నియంత్రించబడతాయి. కొన్ని అనారోగ్య సమస్యలూ ఉత్పన్నమవుతాయి. అందులో యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం, అజీర్తి సమస్యలు ముఖ్యంగా చెప్పుకోదగినవి. ఇవి శరీరం లోపల ఏర్పడేవి. ఇక బయటికి కనిపించే వాటిలో ముఖంపై మొటిమలను చెప్పుకోవచ్చు. అంతేకాదు నీటి కొరత వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
డీ హైడ్రేషన్ లక్షణాలు
– శరీరంలో నీటి కొరత కారణంగా మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. దీనిని వెంటనే గుర్తించి నీటిని తాగాలి. లేదంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.
– శరీరంలో సరిపోను నీరు లేకపోవడం వల్ల విషపదార్థాలు పెరిగి ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. ఈ సమస్య ఏర్పడితే సరిపడా నీరు తాగడంలేదని అర్థం.
– ప్రైవేట్ పార్ట్స్‌లో దురద లేదా మంట వంటి సమస్యలు ఎదురవుతాయి.
– యూరిన్ ఇన్‌ఫెక్షన్ ప్రమాదమూ పెరుగుతుంది. దీని వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట మొదలవుతుంది.
– నీటి కొరత కారణంగా చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది.
– చిన్న వయసులోనే ముడతలు కనిపించి ఏజ్ బార్‌గా కనిపిస్తారు.
– కండ్ల కింద నల్లటి వలయాలు నిద్రలేమి వల్ల మాత్రమే కాకుండా శరీరంలో నీటి కొరత వల్ల కూడా ఏర్పడతాయి.
– తలనొప్పి సమస్య వేధిస్తుంది.
– శరీరంలోని కండరాలలో నొప్పి, తిమ్మిర్లు వంటి సమస్యలు మొదలవుతాయి.
– విపరీతమైన అలసట, ఒత్తిడి, గందరగోళం, ఏకాగ్రత లోపించడం వంటి మానసిక ఇబ్బందులు కూడా శరీరంలో నీటి కొరత వల్ల ఏర్పడతాయి.