దొంగలున్నారు.. జాగ్రత్త

దొంగలున్నారు.. జాగ్రత్త–  కాలనీలు, బస్తీలు, శివారు గ్రామాల వద్ద గస్తీని పెంచాలి : రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లకు డీజీపీ ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సంక్రాంతి పండుగను పురస్క రించుకొని పట్టణాల నుంచి వేలాది మంది గ్రామాలకు తరలుతున్న వేళ దొంగలు విజృంభించే అవకాశ మున్నదనీ, ఈ విష యంలో స్థానిక పోలీసులు అప్రమత్తంగా మెలగా లని రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ రవిగుప్తా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు రావటంతో హైదరాబాద్‌ మహాన గరమే గాక ఇతర పట్టణాల నుంచి వేలాది మంది గ్రామా లకు తరలి వెళ్తున్న విషయం తెలిసిందే. వారు దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు తమ ఇండ్లకు తాళాలు వేసి వెళ్తున్న అవకాశాన్ని అదునుగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశమున్నదని సీఐడీ విభాగం సైతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు హెచ్చరికలు జారీ చేసినట్టు సమా చారం. ఈ నేపథ్యంలో కాలనీలు, బస్తీలు, మారుమూల గ్రామాలలో చోరులకు అవకాశమి వ్వకుండా స్థానిక పోలీసులు ప్రతిరోజూ గస్తీని నిర్వహించాలని డీజీపీ కోరినట్టు తెలిసింది. ముఖ్యంగా, దూరంగా విసిరివేసినట్టు ఉన్న ఇండ్లను దొంగలు టార్గెట్‌ చేసుకునే అవకా శమున్నదని ఆయన హెచ్చరిం చినట్టు సమాచారం. అలాగే, గ్రామాలకు వెళ్తున్నవారు తమ పక్కవాళ్లకు చెప్పటమో, స్థానిక పోలీసులకు సమాచారమివ్వటమో చేయాలని ఆయన సూచించారు. గ్రామాలకు వెళ్లినవారు తిరిగి వచ్చేంత వరకు స్థానిక పోలీసులు అప్రమత్తంగా మెలగాలనీ, ముఖ్యంగా పేరు మోసిన దొంగల ముఠాల కదలికలపై కన్నేసి ఉంచాలని ఆయన అన్ని జిల్లాల ఎస్పీలు, నగర సీపీలను ఆదేశించారు.