2018 కి మించి..

2018 కి మించి..– భారీగా నగదు, మాదకద్రవ్యాల స్వాధీనం
–  గత ఎన్నికలతో పోలిస్తే ఇపుడు మూడు రెట్లు అధికం
–  తెలంగాణలో అత్యధికంగా 439 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి భారీగా నగదు, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువుల విలువతో పోలిస్తే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న వాటి విలువ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన అక్టోబర్‌ 9వ తేదీ నుండి ఇప్పటి వరకూ రూ.953.34 కోట్ల నగదుతో పాటు నగలు, బంగారం, వెండి, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ రాష్ట్రాల్లో 2018 ఎన్నికల ప్రచారం సందర్భంగా కేవలం రూ.288.58 కోట్ల విలువైన వస్తువులు, నగదును మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈసారి గతంతో పోలిస్తే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువుల విలువ రూ.660 కోట్లు పెరిగింది. చాలా ప్రాంతాల్లో పోలింగ్‌కు ఇంకా ఇరవై ఐదు రోజుల సమయం ఉంది. అప్పటికి స్వాధీనం చేసుకునే నగదు, ఇతర వస్తువుల విలువ భారీగా పెరగవచ్చునని భావిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో గత నెల 31వ తేదీ నాటికి రూ.38.34 కోట్లు, మధ్యప్రదేశ్‌లో ఈ నెల 1వ తేదీ నాటికి రూ.226 కోట్లు, మిజోరంలో గత నెల 25వ తేదీ నాటికి రూ.36 కోట్లు, రాజస్థాన్‌లో గత నెల 24వ తేదీ నాటికి రూ.214 కోట్ల విలువైన వస్తువులు, నగదు స్వాధీనం చేసుకోగా తెలంగాణలో ఈ నెల 2వ తేదీ నాటికి అత్యధికంగా రూ.439 కోట్ల నగదు, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.156 కోట్ల నగదు ఉండగా రూ. 165.2 కోట్ల విలువైన 1,300 కిలోల బంగారం, వెండి, ఇతర లోహాలు, రూ.49.4 కోట్ల విలువైన మద్యం, రూ.24.7 కోట్ల విలువైన గంజాయి ఉంది. ఆదాయపన్ను శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ బృందాలను నియమించి, విస్తృతంగా తనిఖీలు జరుపుతోంది. విమానాశ్రయాల వద్ద ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్లు పనిచేస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పట్టుబడిన నగదు, ఇతర వస్తువుల విలువ కేవలం రూ.137 కోట్లు మాత్రమే. ఇందులో రూ.125 కోట్ల నగదు ఉంది. మిజోరం శాసనసభలోని 40 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని 20 నియోజకవర్గాలకు రేపు పోలింగ్‌ జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలోని మిగిలిన 70 స్థానాలతో పాటు మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఈ నెల 17న ఎన్నికలు జరుగుతాయి. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 25న, తెలంగాణలోని 119 స్థానాలకు ఈ నెల 30న పోలింగ్‌ జరుగుతుంది.