పలాసకి మించి..

హీరో రక్షిత్‌ అట్లూరి కొత్త చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. సుధాస్‌ మీడియా బ్యానర్‌పై ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ న్యూ ఏజ్‌ యాక్షన్‌-సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో రక్షిత్‌ సరసన సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌గా నటించారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ‘ఫస్ట్‌ థ్రిల్‌’ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మారుతి, కళ్యాణ్‌ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్‌ సత్య మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం రాధికగారు. ఎన్నో సినిమాలు చేసి, ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేసిన ఆమె ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని తెలిపారు. రాధిక మాట్లాడుతూ, ‘నాకు ఈ కథ చెప్పినప్పుడు హీరో ఎవరూ అంటే రక్షిత్‌ అన్నారు. అతనెవరు అంటే ‘పలాస’ సినిమా చూడండి అన్నారు. నేను ‘పలాస’ చూశాను, బాగా నచ్చింది. ఈ మూవీ డైరెక్టర్‌ అవుట్‌ పుట్‌ విషయంలో కాంప్రమైజ్‌ కాలేదు. నేను ఎప్పుడూ డిఫరెంట్‌ రోల్స్‌ చేయాలనే కోరుకుంటాను’ అని అన్నారు.
హీరో రక్షిత్‌ మాట్లాడుతూ, ‘మా సినిమా ఫస్ట్‌ సక్సెస్‌ రాధిక గారు ఒప్పుకున్నప్పుడే జరిగింది. వెంకట సత్య వర ప్రసాద్‌ .. మా నాన్నగారు.. నా ప్రాణం.. ఈ చిత్రానికి దర్శకుడు. 1995లో స్వీట్‌ మ్యాజిక్‌ స్థాపించారు. అప్పుడు ఏం లేదు. కానీ ఇప్పుడు కొన్ని వేలమందికి ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు ‘ఆపరేషన్‌ రావణ్‌’ తీశారు. ఈ మూవీ దేశం అంతా తెలుస్తుందనుకుంటున్నా. సినిమా చాలా బాగా వచ్చింది. ‘పలాస’కి మించి నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంటుందీ సినిమా’ అని చెప్పారు.