వాటికి మించి.. టాక్సిక్‌

వాటికి మించి.. టాక్సిక్‌హీరో యష్‌ నటించబోయే తన కొత్త సినిమాకి ‘టాక్సిక్‌ – ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్స్‌ అప్స్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న డైరెక్టర్‌ గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో చిత్రం రూపొందుతుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ కె.నారాయణ మాట్లాడుతూ, ‘యష్‌తో సినిమా చేయబోతుండటం ఎంతో ఆనందాన్నిచ్చే విషయం. ఇది మాకెంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. యష్‌, గీతు స్ట్రాంగ్‌ నెరేషన్‌తో మాస్‌, యాక్షన్‌ అంశాలను కలగలిపిన కథను తయారు చేయటానికి సమయం తీసుకున్నారు. ఈ అద్భుతాన్ని ప్రపంచానికి ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు. ‘కథను సరికొత్తగా చెప్పాలని నేనెప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. లైయర్స్‌, మూతోన్‌ వంటి సినిమాలను రూపొందించినప్పుడు వాటికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. నా దేశంలో నా ఆడియెన్స్‌ ఇలాంటి డిఫరెంట్‌ నెరేషన్‌ను ఎలా రిసీవ్‌ చేసుకుంటారనే విషయాన్ని తెలుసు కోవటానికి ఎప్పుడూ తహతహలాడుతుంటాను. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సినిమా. రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా కథ ఉంటుంది’ అని డైరెక్టర్‌ గీతూ మోహన్‌ దాస్‌ తెలిపారు. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై సినిమా రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 10, 2025న గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు.