తరగతి గది దాటి

మరి ఏ పుస్తకాలు చదవాలి అని అడిగితే ఎవరికి నచ్చిన అంశానికి వారు ఎంచుకోచ్చు. పుస్తకం మంచిదైతే చాలదు.. అందులోని విషయంపై మనకు ఆసక్తి ఉండాలి. అప్పుడే ఆసాంతం పూర్తిచేయగలం. పిల్లలు ఆసక్తిని కలిగించే అంశం ఏదై ఉంటుందో అవే పుస్తకాలను చదవడానికి ఎంచుకుంటే త్వరగా చదవడానికి ఆసక్తిని చూపుతారు.వారు క్రీడలను ఇష్టపడితే, వారికి ఇష్టమైన క్రీడ లేదా అథ్లెట్‌ గురించి పుస్తకాలను కొని వారికి బహుమతిగా ఇవ్వాలి. దీని ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందారో గుర్తించండి. అప్పుడు చదవకుండా ఉండలేరు. అయితే ఉపయోగకరమైనవే ఎంచుకోవాలి సుమా!

తరగతి పుస్తకాలు ఎటూ చదువుతాం. అక్షరాలతో పోటీ పడుతూ ఆన్సర్లతో కుస్తీ పడుతూ జవాబులు కంఠతా పట్టేస్తాం. సబ్జెక్టు నచ్చినా నచ్చకపోయినా మార్కుల కోసం, గ్రేడ్ల కోసం ఏడాదంతా ఇది తప్పదు. అలాంటప్పుడు పుస్తకాలంటే ఎంతోకొంత బోర్‌ కొట్టకమానదు. ఈ వేసవిలో తరగతి గది దాటి, ఆ భాషా ప్రపంచంలోకి, ఆ ఊహాలోకంలోకి.. పయనిద్దాం. మరి అస్సలు బోర్‌ కొట్టకుండా ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గా అనిపించే పుస్తకాల గురించి తెలుసుకొని చదువుదాం. అప్పుడే వికాసమైన వ్యక్తిత్వం.. సంపూర్ణ జ్ఞానం సాధ్యమవుతుంది.
పుస్తకాలు చదవడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు. ఇది ఆత్మ విశ్వాసాన్ని పెంచి, జ్ఞానాన్ని నింపుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో చదువును అలవర్చాలి. మంచి పుస్తకాలు చదవినప్పుడు విద్యార్థుల్లో సజనాత్మక శక్తి పెరుగుతుంది. భాషా జ్ఞానం అలవడుతుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా మెదడును పెంచుతుంది. పిల్లల వయస్సు, పఠన స్థాయికి తగిన పుస్తకాలను ఎంచుకోవాలి. మొదటగా చిన్న పిల్లల కోసం బొమ్మల పుస్తకాలతో ప్రారంభించవచ్చు. వాళ్ళ ఆసక్తికి తగిన విధంగా పుస్తకాలను కొని ఇవ్వడం వల్ల రోజు రోజుకీ వాళ్ళల్లో చదవాలనే ఆసక్తి కలుగుతుంది. ఒక విధంగా రెట్టింపు అవుతుంది.
మరి ఏ పుస్తకాలు చదవాలి అని అడిగితే ఎవరికి నచ్చిన అంశానికి వారు ఎంచుకోచ్చు. పుస్తకం మంచిదైతే చాలదు.. అందులోని విషయంపై మనకు ఆసక్తి ఉండాలి. అప్పుడే ఆసాంతం పూర్తిచేయగలం. పిల్లలు ఆసక్తిని కలిగించే అంశం ఏదై ఉంటుందో అవే పుస్తకాలను చదవడానికి ఎంచుకుంటే త్వరగా చదవడానికి ఆసక్తిని చూపుతారు.వారు క్రీడలను ఇష్టపడితే, వారికి ఇష్టమైన క్రీడ లేదా అథ్లెట్‌ గురించి పుస్తకాలను కొని వారికి బహుమతిగా ఇవ్వాలి. దీని ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందారో గుర్తించండి. అప్పుడు చదవకుండా ఉండలేరు. అయితే ఉపయోగకరమైనవే ఎంచుకోవాలి సుమా!
ఒక వేళ అంతా కలిసి చదివే వీలున్న రోజుల్లో కుటుంబంతో కలిసి చదవడానికి సమయాన్ని వెచ్చించండి. కథను బిగ్గరగా చదవడం, చర్చించడం వంటివి పిల్లలు ఇష్టపడే విషయాలు. ఇవి పుస్తకాలను చదివే ఆసక్తిని, నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా పెద్దలకు, పిల్లలకు మధ్య స్నేహ బంధాన్ని ఏర్పరుస్తుంది. వాళ్లకు నచ్చే పుస్తకాలే కాదు, పెన్నులు, చిన్న చిన్న డైరీలను కూడా తెచ్చి ఇవ్వడం వల్ల పిల్లలకు చదివిన పుస్తకాల గురించి పుస్తకంలో లేదా డైరీలో రాసుకునే అలవాటు దానంతట అదే అలవడుతుంది.
గ్రాఫిక్‌ నవలలు, కామిక్స్‌, స్ఫూర్తిగాథలు, ఫిక్షనల్‌ స్టోరీస్‌.. ఇలా చదవాలంటే చాలా రకాలే ఉన్నాయి. ఇరవైఏండ్లలోపు వారిని ఆకట్టుకునేలా గత కొంతకాలంగా కొత్త తరహా పుస్తకాలు, సాహితీ ప్రక్రియలు వచ్చాయి. విజువల్‌ రిప్రజెంటేషన్‌ ఉండేవి చిన్నవాళ్లను ఉద్దేశించినవే అయినా… పెద్దవారినీ ఆకట్టుకుంటాయి. చరిత్రను తెలుసుకోవడం, సైన్స్‌ను అర్థం చేసుకోవడం, రోజువారీ విషయాలపై అవగాహన పెంచుకోవడం, ప్రాక్టికల్‌ సమస్యలను పరిష్కరించడం, ఇలా ఏది తెలుసుకోవాలన్నా.. పుస్తక పఠనం పనికొస్తుంది. పుస్తకాలు మంచి కాలక్షేపం మాత్రమే కాదు, చక్కని జ్ఞానమార్గం కూడా. మరి.. ఈ సెలవుల్లో మీరేం చదువుతున్నారు?