‘యాభై ఏండ్ల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి దళిత చిత్రం ‘కాలం మారింది’. చరిత్రకు భిన్నంగా, ఆనవాయితీకి అతీతంగా, పండితపామరులు సైతం ముక్కున వేలేసుకున్న సందేశాత్మక చిత్రంగానూ ‘కాలం మారింది’ నిలిచింది’ అని చిత్ర నిర్మాత వాశిరాజు ప్రకాశం అన్నారు. శోభన్‌బాబు, శారదా జంటగా కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలం మారింది’. ఈ సినిమా గురించి నిర్మాత వాశిరాజు ప్రకాశం మాట్లాడుతూ, ‘1972వ సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో ఒక మరపురాని ఘట్టం. సంవత్సరానికి దాదాపు నలభై నుండి యాభై చిత్రాలు తయారవుతున్న రోజులవి. సగటు నిర్మాత లక్షల కొద్దీ పెట్టుబడి పెడతారు. కాబట్టి వాళ్ళ మనసంతా వ్యాపారం, విజయావకాశాల మీదనే కేంద్రీకతం కావడం సహజమే. దర్శకులు కూడా బాక్సాఫీస్‌ను సంచలనం చేయగల చిత్రాలనే ఆశిస్తారు. అందుకు తగిన కథలనే ఎంచుకుంటారు. మొత్తంగా వ్యాపార ప్రధాన రోజులుగా సాగుతున్న అటువంటి తరుణంలో కమర్షియల్ ట్రెండ్‌కి భిన్నంగా ‘కాలం మారింది’ సినిమా తయారైంది. దళిత సంక్షేమమే ప్రధాన ఆశయంగా ఉన్న ఈకథని విన్న గంటలోనే దర్శకుడు కె.విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు అంగీకరించారు. ఇక ఈ సినిమా విషయంలో కథానాయకుడు శోభన్‌బాబు, కథానాయిక శారదా ఎంతో సహకారాన్ని అందించారు. గుమ్మడి, అంజలీదేవి, చంద్రమోహన్, గీతాంజలి, సాక్షి రంగారావు, అల్లు రామలింగయ్య వంటి తదితర హేమాహేమీ నటీనటులు ఈ కథలోని ఆశయాన్ని గుర్తించి తమ, తమ పాత్రలకు ప్రాణం పోశారు. సమాజాన్ని ప్రభావితం చేసిన చిత్రంగా అటు ప్రేక్షకుల ఆదరణను, ఇటు ప్రభుత్వ పరంగా ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారాన్ని అందుకోవడం ఓ నిర్మాతగా ఎంతో గర్వపడుతున్నా. యాభై ఏండ్ల తర్వాత నేటి సామాజిక పరిణామాలతో మరోమారు ఈ తరహా చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నానని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది’ అని తెలిపారు.