మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటించి, 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన చిత్రం ‘లూసిఫర్’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎల్ 2ఇ ఎంపురాన్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. పథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘లూసిఫర్, బ్రో డాడీ’ చిత్రాల తర్వాత మోహన్ లాల్, పథ్వీరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. అలాగే ‘లూసిఫర్’ బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈచిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ మూవీతో జి.కె.ఎం.తమిళ్ కుమరన్ నేతత్వంలో లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మలయాళ సినీ ఇండిస్టీలోకి అడుగు పెట్టారు. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. దర్శకుడు పథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ, ‘మోహన్ లాల్ లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఈ ప్రయాణంలో ఆయన నాకెంతో సపోర్ట్ ఇచ్చారు’ అని తెలిపారు. ‘పథ్వీరాజ్ భారతదేశపు ఉత్తమ దర్శకుల్లో ఒకరు అవుతారని నేను ఆశిస్తున్నాను. ఈ మూవీని నేను ఆల్రెడీ చూశాను. దర్శకుడిగా పథ్వీరాజ్ తన 100 పర్సెంట్ ఇచ్చారు. ఈ చిత్రం మలయాళ సినిమాకు ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంది’ అని మోహన్ లాల్ చెప్పారు.