భద్రాచలం వరదకు కరకట్టలు అసాధ్యం

Bhadrachalam flood is impossible to curb– భూసేకరణతోపాటు భారీ వ్యయం
– నిర్వాసితుల తరలింపుకే ప్రాధాన్యం
– సాంకేతిక అంశాలపై ప్రత్యేకంగా మరో కమిటీ :నీటిపారుదల శాఖ సమీక్షలో రజత్‌కుమార్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
భద్రాచలంలో వరదలతో కరకట్టలుకట్టడం అసాధ్యమని కమిటీ తేల్చిచెప్పింది. భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయం అధికమవుతుందని అభిప్రా యపడింది. రెండేండ్ల కింద వరదలతో కమిటీ వేసిన విషయం అందరికీ తెలిసిందేనని గుర్తు చేసింది. ఈ సంవత్సరం కూడా వరద ప్రభావం కొంతమేర పడింది. దీంతో దీనిపై శాశ్వత పరిష్కారానికి ఎలాం టి చర్యలు తీసుకోవాలనే విషయమై మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరి గింది. దీనికి ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌లు సి.మురళీధర్‌, జి.అనిల్‌కుమార్‌, బి.హరిరామ్‌, నాగేంద్రరావుతో పాటు సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఆయా టెరిటోరియల్‌ చీఫ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం వరదపై నాగేంద్రరావు నేతృత్వంలోని సబ్‌కమిటీ నివేదికపై చర్చ జరిగింది. భద్రాచలం వరద నివారణకు కరకట్టలు కట్టేకన్నా, నివాస ప్రాంతాలు, నిర్వాసితులను తర చోట్లకు తరలించడమే మేలని కమిటీ సిఫారసు చేసింది. దీనిపై మరింత లోతుగా అధ్యయనం కోసం ఒక సాంకేతిక కమిటీని వేయాలనీ, ఈకమిటీ నెలరోజుల్లోపు నివేదిక అందించాలని రజత్‌కుమార్‌ ఆదేశించారు. తెలుగు రాష్ట్రాతోపాటు బ్రహ్మపుత్ర, గంగానది బేసిన్‌లోని ప్రాంతాలను కూడా కమిటీ పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసి తగిన నివేదికను అందించాలని నిర్దేశించారు.
కడెం ప్రాజెక్టుకు అదనపు స్పిల్‌వే
కడెం ప్రాజెక్టు స్పిల్‌వే సామర్థ్యం ఐదు లక్షల క్యూసెక్కులను చేర్చడానికి వీలుగా అదనపు స్పిల్‌వే నిర్మాణంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని రజత్‌కుమార్‌ అన్నారు. ప్రస్తుతం 3.82 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా స్పిల్‌వే ఉందనీ, వరద అంతకంటే ఎక్కువగా రావడంమూలంగా సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగి 65 ఏండ్లు పూర్తయినా, కొన్ని సమస్యలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. డ్యామ్‌ సేఫ్టీ రివ్య్యూ ప్యానెల్‌(డీఎస్‌ఆర్‌పీ) సిఫారసులకు అనుగు ణంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు కడెం ప్రాజెక్టుపై మాజ ఈఎన్సీ, నిపుణుడు రామ రాజు సిఫారసులపై కూడా చర్చించారు. ప్రాజెక్టు గేట్లన్నీ పాతవనీ, వాటిని మార్చాలన్నారు. దీంతో పాటు కడెం క్యాచ్‌మెంట్‌ ఏరియాలో ఆటోమేటిక్‌ రెయిన్‌గేజ్‌ స్టేషన్లు పెట్టి, వరద సమాచారాన్ని ముందు పసిగట్టి, గేట్లు ఎత్తివేయాలని సూచించారు. ఆకస్మిక వరదల మూలంగానే కడెం ప్రాజెక్టుకు సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ముందు వరదలను అంచనా వేసి గేట్లు ఎత్తి ఉంచితే, సమస్యలు రావని అభిప్రాయపడ్డారు. అలాగే నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా డెసిషన్‌ సపోర్టు సిస్టమ్‌ను కడెం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు.
రూ.30 కోట్లతో తాత్కాళిక మరమ్మతులు
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో 590కి పైగా చెరువులకు గండ్లు పడ్డాయనీ, వీటికి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి రూ.294 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. అయితే తాత్కాళిక ప్రాతిపదికన మరమ్మతులకు రూ. 30 కోట్లు వ్యయం చేయనున్నట్టు చెప్పారు. రెవెన్యూ శాఖ నుంచి 5073 మంది రెవెన్యూ సహాయకులను లష్కర్లుగా నియమించనున్నుట్టు తెలిపారు. వీరేకాక మరో 877 మంది పనిచేస్తున్నారనీ, వారి విద్యార్హతలన్నీ పరిశీలన అనంతరం తగిన నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు.