భద్రాచలాన్ని ఒకటే పంచాయతీగా ఉంచాలి

Bhadrachalam should be kept as a single panchayat– మూడు పంచాయతీలుగా చేస్తే
– భద్రాచలం అస్తిత్వాన్ని కోల్పోతుంది
– ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
భద్రాచలాన్ని ఒకటే పంచాయతీగా కొనసాగించాలని, మూడు పంచాయతీలుగా విభజిస్తే భద్రాచలం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని, భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం గ్రామపంచాయతీని మూడు పంచాయతీలుగా విభజిస్తూ చేసిన జీవోను రాష్ట్ర గవర్నర్‌ ఆమోదించడాన్ని వారు తప్పుపట్టారు. దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాచలం మేజర్‌ గ్రామపంచాయతీని మూడు పంచాయతీలుగా విభజిస్తే తన అస్తిత్వాన్ని కోల్పోతుందని మచ్చా అన్నారు. రాష్ట్ర విభజనలో భద్రాచలంకు ఆనుకుని ఉన్న ప్రాంతమంతా ఆంధ్రాలో కలవడంతో భద్రాచలం తీవ్రంగా నష్టపోయిందని, పట్టణంలో సేకరించిన చెత్తను కూడా పారబోయడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని, స్మశాన వాటికకు కూడా స్థలము లేదని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భద్రాచలం మేజర్‌ గ్రామపంచాయతీని మూడు ముక్కలు చేస్తే పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని, అభివృద్ధికి దూరమవుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మూడు పంచాయతీల ప్రతిపాదనను ముందుకు తెచ్చిన సందర్భంలో సీపీఐ(ఎం) పార్టీ పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే అధికార ప్రతిపక్ష పార్టీలు అనివార్యంగా భద్రాచలం గ్రామపంచాయతీని ఒకే గ్రామ పంచాయతీగా కొనసాగిస్తామని హామీలు గుప్పించాయని అన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార సభల్లో భద్రాచలం ఒకే గ్రామపంచాయతీగా కొనసాగించేందుకు కృషి చేస్తామని ప్రకటించారని, నేడు మూడు గ్రామపంచాయతీలుగా చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలంను ఒకే గ్రామపంచాయతీగా కొనసాగించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. భద్రాచలం మేజర్‌ గ్రామపంచాయతీని మూడు పంచాయతీలుగా విభజించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు సున్నం గంగా, వై.వెంకట రామారావు, పట్టణ కమిటీ సభ్యులు కుంజా శ్రీనివాస్‌, నకిరికంటి నాగరాజు, భూపేంద్ర, జి.లక్ష్మీకాంత్‌, నాయకులు బి.జె.ఎల్‌ పి.దాసు, ఎంవిఎస్‌ నారాయణ, జి.నాగలక్ష్మి, అజరు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.