భద్రాద్రి రామయ్యకు భారీగా ఆదాయం

– 40 రోజుల్లో కోటికిపైగా నగదు, బంగారం, వెండి అదనం
– హుండీలో విదేశీ డాలర్లు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి 40 రోజుల్లో హుండీ ఆదాయం భారీగా చేకూరింది. గత నెల 12న రామయ్య హుండీని లెక్కించగా 40 రోజులనంతరం సోమవారం దేవస్థానం అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపట్టారు. 40 రోజులకు గాను రూ.1,21,44,579 భక్తులు సమర్పించారు. బంగారం 104 గ్రాములు, వెండి 805 గ్రాములు ముడుపుల రూపంలో చెల్లించారు. అంతేకాకుండా విదేశీ నగదు సైతం రామయ్యకు భారీగా చేరింది. యూఎస్‌ డాలర్లు 183, మైమార్క్‌ కటాస్‌ 1000, కెనడా డాలర్స్‌ 50, నేపాల్‌ రుపీస్‌ 10, అరబ్‌ డాలర్స్‌ 20 హుండీలో వచ్చాయి. వచ్చిన నగదును మొత్తం భద్రాచలం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆలయ ఈవో రమాదేవి జమ చేశారు. లెక్కింపులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించామని ఆమె తెలిపారు.