నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటికే పంపేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఇతర డైరెక్టర్లతో కలిసి బస్‌భవన్‌లో ఆవిష్కరించారు. టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, వివరాలు నమోదు చేసుకుంటే గోటి తలంబ్రాలను ఇంటికే వచ్చి అందచేస్తారు. రెండేండ్లుగా ఆర్టీసీ ఈ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులు తలంబ్రాలు బుక్ చేసుకున్నారు. గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులు గోటి తలంబ్రాలను బుక్ చేసుకున్నారని ఈ సందర్భంగా ఎమ్‌డీ సజ్జనార్ తెలిపారు. భద్రాద్రిలో ఈ నెల 17న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణం జరగనున్న విషయం తెలిసిందే. ఇతర వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వీ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కష్ణకాంత్, సీటీఎం(మార్కెటింగ్ అండ్ కమర్షియల్) శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.