బాల్యం నుంచే కష్టాలతో కాపురం చేస్తూ… వివాహమైన భర్త భరోసా కరువై, అత్త ఆడబిడ్డల అరాచకాలకు గురై వివాహ బంధానికి శాశ్వతంగా దూరమైన, పుట్టింటి వారి ఆదరణతో అంకుఠిత దీక్ష అక్షర కృషితో తెలుగు పద్య రచనలో ప్రావీణ్యత చెంది పద్య ధారణతో పరిఢమిల్లిన భద్రాద్రి కవయిత్రి ‘చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ’ నేటితరం తరుణులందరికీ తలమానికంగా నిలుస్తారు.
దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలంలో పొడిచేటి వీర రాఘవచార్యులు నరసమాంబ దంపతులకు 03 జనవరి 1939న లక్ష్మి నరసమ్మ జన్మించారు, వీరి తండ్రి భద్రాద్రి రాముని ప్రధాన అర్చకునిగా 60 వసంతాల పాటు సేవలందించిన ధన్యజీవి. శ్రీరామచంద్రుడే కులదైవంగా ఆరాధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక సంప్రదాయ కుటుంబం వారిది. తనదైన ఆచార సంప్రదాయాలు పాటిస్తూనే స్వయంకృషితో కష్టపడి ఇష్టంగా చదివి మెట్రిక్ పాస్ అయి, అనంతరం ఎస్.జి.బి.టి శిక్షణ పూర్తి చేసుకుని భద్రాచలం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయనిగా ఉద్యోగ ప్రస్థానం చేపట్టిన సాద్వీమణి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ. తెలుగు అధ్యాపకురాలుగా అధ్యాపకం చేస్తూనే అంశకాలిక విధానంలో పి.యు.సి, బి.ఎ, యం.ఎ. వంటి ఉన్నత చదువులు పూర్తిచేసి ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన అక్షర శిరోమణి ఆమె.
ఇంట్లోనే అక్షర వాతావరణం, నిత్య పారాయణ ప్రేరణలతో తనలోని భావాలకు కవన సొగబులు పులిమి, పద్య రచనలో సాధన చేసి తెలుగు సాహితీ క్షేత్రంలో ఆత్మీయ పద్య కవయిత్రిగా అందరి మన్ననలు పొందడమే కాక, భద్రాద్రి పద్య కవితా క్షేత్రానికే చిరునామాగా నిలిచింది.
తొమ్మిదేళ్ల పసిప్రాయంలో తనకు ఇష్టమైన గాంధీ తాత మరణించిన సందర్భంగా తనలోని ఆవేదనకు అక్షరూపం అందిస్తూ ”భారత జనకుడు ఇక లేడు/ గాంధీ తాత ఇకలేడు”.. అంటూ తన తొలి కవితను రాసింది లక్ష్మీనరసమ్మ, తరవాత విధి బలీయం, పంట కళ్లం, ఒయాసీస్సులు అనే కథలు కూడా రాశారు. అనంతర కాలంలో కేవలం పద్య రచనకే ప్రాధాన్యత ఇస్తూ కడదాకా అందులోనే కృషిచేసిన ఆమె పద్యంలో నడక, ధారణ, భావ సరళత, ఆదర్శనీయంగా ఉంటాయి.
అపర రామభక్తులైన కుటుంబ సభ్యుల ద్వారా అంది వచ్చిన ఆధ్యాత్మిక భావన ఆమె కవితా వస్తువు అయినా, సమకాలిక సామాజిక చైతన్యం వంటి అంశాలు అంతర్భాగంగా ఆమె పద్యంలో వెన్నంటి నిలుస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీనరసమ్మ పద్య కవిత్వం నిండా ఆధ్యాత్మిక అభ్యుదయ భావాలు వెల్లి విరుస్తాయి.
తనదైన ఆధ్యాత్మిక భావనలతో 1964లో ‘భద్రగిరి’ అనే నవల రాశారు. దానికి మహాకవి దాశరథి ఆప్త వాక్యం అందించారు.
నాటి గోల్కొండ, కృష్ణా పత్రిక, ప్రజా మాత, మన దేశం, తెలుగు తేజం, మొదలు నేటితరం ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, పత్రికలు ఆమె రచనలను విరివిగా ప్రచురిస్తూ అందించిన ప్రోత్సహంతో అనేక పద్యాలు, కావ్యాల రూపంలో రాాశారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కోసం అనేక రూపకాలు, పద్యాలు రాయడంతో పాటు ఆంధ్రదేశ వ్యాప్తంగా గల పండిత సోపతులతో అనేక అవధానాల్లో పాల్గొని తనదైన పద్య ప్రావీణ్యత ప్రతిభను చాటి అనేకమంది పండితోత్తముల అభినందలు అందుకున్నారు.
వీరి సాహసోపేతమైన సాహిత్య కృషిని మెచ్చిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈమెకు ‘అభినవమొల్ల’ బిరుదు ప్రకటించగా దానిని మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి బలపరిచారు. బిరుదు ఆదరణతో మరింత ఉత్సాహంతో తన పద్య కావ్య రచన వేగవంతం చేసి సుమారు 22 పద్య, గద్య కావ్యాలు అందించారు. నిత్యం పద్య రచనలతో సాహితీ సేద్యం చేసే ఈమె, నానీల నాన్న డాక్టర్ ఎన్. గోపి నానీలకు ప్రేరణ పొంది నానీలు సైతం రాసి ‘భద్రగిరినానీలు’ పేరున ప్రచురించారు.
1981లో ఆమె రాసిన ‘రామదాసు’ పద్య కావ్యం బహుళ ప్రజాదరణ పొందింది. గౌతమ బుద్ధుని గాథల ఆధారంగా ‘శాంతి బిక్ష’ ఖండకావ్యం, ద్రవిడ ప్రబంధాల అనువాద పద్య కావ్యం అయిన ‘శ్రీపదం’, అక్షర తర్పణం ష్మృతి కావ్యం, నీరాజనం, మాతృభూమి, దివ్య గీతాంజలి మొదలైన కావ్యాలను రాశారు. వీటికి చక్కటి ఆదరణ లభించింది.
ఈమె రాసిన భద్రాచల క్షేత్ర చరిత్ర, తానిషా, శ్రవ్య నాటకాలు ఆకాశవాణి శ్రోతలను అలరించి చారిత్రక విజ్ఞానాన్ని పంచాయి.
వందలాది సమస్యపూరణాలు, అనేక సుప్రభాతాలు, శతకాలు, సైతం రాసిన అభినవ మొల్ల సాహిత్యంపై మధురై కామరాజ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.
ఆమె అవిరళ అక్షర కృషికి అనేక సంస్థల సన్మానాలు సత్కారాలు అందుకున్నారు. ఖమ్మం జిల్లాస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారం (2004)తో పాటు, 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ‘రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం’ అందుకున్న ఈ మన్నెసీమ మహిళా కవితామణి అనారోగ్యంతో డిసెంబర్ 7న ఆఖరి శ్వాస విడిచారు, అఖిలాంధ్ర సాహితీవేత్తల పక్షాన అక్షర నివాళులు అర్పిద్దాం.
– డా||అమ్మిన శ్రీనివాసరాజు, 7729883223