– రోజురోజకు పెరుగుతున్న ఉప్ణోగ్రతలు
– మండుతున్న ఎండలు వడగాలులు
– తల్లడిల్లుతున్న ప్రజలు
– తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
నవతెలంగాణ – పెబ్బేరు
రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల ఎండలు మండిపోతున్నాయి వాటికి తోడు వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఏడాది ఆశించిన వర్షాలు పడకపోవడంతో ప్రస్తుతం ఎక్కడ కూడా నీటి నిల్వలు లేకపోవడం భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఎండలు నిప్పుల కొలిమిలా ఉన్నాయి. మార్చి నెల నుండి ఎండలు తీవ్ర రూపం దాల్చారు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో బయట తిరగాల్సిన పరిస్థితి. ఉదయం 8 గంటల నుండి ఎండల తీవ్రత ప్రారంభమై సాయంత్రం ఆరు దాటినా కూడా వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటికి వెళ్లాలంటేనే వామ్మో ఎండలు అంటూ భయపడిపోతున్నారు. చల్లని పానీయాల వైపు ఆసక్తి చూపుతో కొబ్బరి బొండాలు కూల్ డ్రింక్స్ జ్యూస్ షాపుల వద్ద దప్పిక తీర్చుకుంటున్నారు. చల్లటి ఆరోగ్యకరమైన నీటిని తాగడానికి ఈఏడాది మట్టి కుండలు సైతం ప్రజలు ఎక్కువగా వినియోగించుకున్నారు. ఉపాధి హామీ కూలీలు పూట గడవడం కోసం మండుటలో సైతం పనులకు వెళ్ళక తప్పడం లేదు. ఎండ తీవ్రత వల్ల జాతీయ రహదారి నిర్మానుషంగా మారింది. గహ వినియో గదారులు కరెంటు కోతలు లేకపోవడంతో ఫ్యాన్లు కూలర్లతో సేద తీరుతున్నారు దీంతో కొంత ఉపశమనం పొందుతున్నారు.
రోడ్డుపై సెగ పుడుతుంది
అవసరాల నిమిత్తం రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు సెగ పుడుతుంది. మండుటెంతోపాటు వడగాలుల సైతం ఇబ్బందులు పెడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయి.
– ద్విచక్ర వాహనదారుడు రాముడు
తగిన జాగ్రత్తలు తప్పనిసరి
ఎండల తీవ్రత అధికంగా ఉండటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం వేయక పోయినా వీలైనప్పుడల్లా నీటిని తాగాలి. తప్పని సరి ప్రయాణాల్లో తాగు నీటిని వెంట పెట్టుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలను తినాలి. సన్నటి వదులుగా ఉండే లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. ఎండలో బయటికెళ్తే గొడుగు, టవల్, టోపీ ఉపయోగించుకోవాలి. ఆల్కహాల్ కాఫీ టీ తాగకపోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాలి. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– శ్రీ సరోజినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు
ఆర్థోపెటిక్ వైద్యులు డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి