
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
భగత్ సింగ్, రాజ్ గురు, సుకదేవ్ ల ఆశయాలను కొనసాగించాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకుడు సారా సురేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్ గురు, సుక్కుదేవ్ ల 93వ వర్ధంతిని పురస్కరించుకొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల లేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకుడు సారా సురేష్ మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారిని ఎదురిస్తూ మా దేశానికి స్వాతంత్రం కావాలని, బ్రిటిష్ తెల్లదొరలు మా దేశాన్ని విడిచి వెళ్లాలని తెల్ల దొరలకు వ్యతిరేకంగా నునుగు మీసాల 23 ఏళ్ల ప్రాయంలోనే భగత్ సింగ్, రాజ్ గురు, సుకుదేవ్ తమ విలువైన ప్రాణాలను లెక్కచేయకుండా బ్రిటిష్ వారిపై యుద్ధం చేశారని అన్నారు. నాటి తెల్ల దొరల పాలనకు వ్యతిరేకంగా భగత్ సింగ్ రాజు గురు సుక్కు దేవుళ్ళు చేసిన వీరోచిత పోరాటాన్ని వారసత్వంగా తీసుకొని నేటి నల్లదొరలు సాగిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా నేటి యువతరం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో, రాష్ట్రంలో యువతరం ప్రశ్నించకుండా మత్తులో ఉంచుతున్నారన్నారు.2019వ సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం తమ ఎన్నికల వాగ్దానంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు గడిచి మరోసారి ఎన్నికలకు సంసిద్ధమవుతున్న ఉద్యోగల భర్తీ పై మాత్రం శ్రద్ధ కనబరచలేదన్నారు. బీజేపీ యువకులను విస్మరించి వారి ఆలోచనలు మొత్తం మతం వైపు మళ్ళించి హిందుత్వ ఎజెండాతో మరొకసారి గద్దెనెక్కాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇలాంటి ఆశలెన్నో పెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం యువతరాన్ని గంజాయి, మద్యం, డ్రగ్స్ మత్తులో ముంచేత్తుతున్నారని ధ్వజమెత్తారు. జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం, మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పు రవ్వల మీద నిద్రిస్తామన్న కామ్రేడ్స్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ ల బాటలో నేటి యువతరం పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బి.అశోక్, తదితరులు పాల్గొన్నారు.