భగత్‌సింగ్‌ ఆశయం సోషలిజం

bhagat-singhs-ambition-is-socialismషహీద్‌ భగత్‌సింగ్‌పై వచ్చిన రచనలు, సినిమాలు చాలావరకు ఆ త్యాగశీలి రాజకీయ సిద్ధాంతాలను పట్టించు కోవు. ఆయన కమ్యూనిస్టు అన్న వాస్తవాన్ని దాచేస్తాయి. దేశానికి స్వాతంత్య్రం వస్తే చాలని భగత్‌సింగ్‌ భావించలేదు. తెల్లదొరలు పోయి నల్ల దొరలు గద్దెలెక్కితే ప్రయోజనం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. రష్యాలో మాదిరిగా భారతదేశంలో కూడా సోషలిస్టు రాజ్యం, సమ సమాజం ఏర్పడాలని భావించారు. జైలుకు వెళ్లడానికి మందు, జైల్లో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తూ ఆయన విస్తృతంగా మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. మారుపేర్లతో పత్రికలకు రహస్యంగా వ్యాసాలు రాసి పంపారు. మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌, ట్రాట్క్సీల రచనలే కాదు. అనార్కిస్టుల, నిహిలిస్టుల రచనలను, యూరోపులోని ఉద్యమాలను అధ్యయనం చేశారు. రవీంద్ర నాథ్‌ టాగోర్‌, మాక్సింగోర్కీ, లియో టాల్‌స్టాయి, బెట్రండ్‌ రసెల్‌, థామస్‌ పెయిన్‌, బుఖారిన్‌ వంటి ప్రపంచస్థాయి చింతానాపరుల రచనల నుండి కూడా ఆయన ముఖ్యమైన అంశాలను తన జైలు నోటుబుక్‌లో రాసుకున్నారు. మిర్జా గాలిబ్‌ నుండి మొదలెట్టి విలయం వర్డ్స్‌ వర్త్‌ వరకు అంతర్జాతీయ స్థాయి కవుల కవిత్వాన్ని చదివి తన ముఖ్యమైన అంశాలను జైలునోటు బుక్‌లో రాసుకొన్నారు.
తన వ్యాసాల్లో ఆయన మతతత్వ ప్రమాదం గురించి దూరదృష్టితో ఖచ్చితమైన హెచ్చరిక చేశారు. మతవాదుల పట్ల ఉదాసీనత ప్రమాదకరమని బోధించారు. ఆ రోజు ఆ వాదన చేస్తున్న వారి వెనక యువకులు లేరు కదా అన్న ధీమాతో ఉండరాదని చెప్పారు. తనకు గురుతుల్యుడు, పితృసమానులైన లాలా లజపత్‌ రారు హిందూ మహాసభకు అనుకూలంగా మారినప్పుడు ఆయన ఘాటుగా విమర్శించారు. భగత్‌సింగ్‌ కార్యకలాపాల పై లాలా కూడా విరుచుకుపడ్డారు. ‘నన్ను లెనిన్‌లా మార్చడానికి భగత్‌సింగ్‌ ప్రయత్నిస్తున్నాడని, అతను రష్యన్‌ ఏజెంట్‌ అని’ నిందించారు. అయినప్పటికీ లాలాను బ్రిటిష్‌ పోలీసులు తీవ్రంగా కొట్టి ఆయన మృతికి కారకులైనవాడిని భగత్‌సింగ్‌ సహించలేదు. బ్రిటిష్‌ పోలీస్‌ అధికారిని కాల్చిచంపారు. మతతత్వం పట్ల కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానాల పట్ల అసమ్మతి వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మతం దోపిడీ దారుల చేతుల్లోని ఒక సాధనమన్నారు. మతం వల్ల ఆకలిమంట ఆగిపోదు అంటూ హూరెస్‌ హ్రీలీ చెప్పిన మాటలను భగత్‌సింగ్‌ తన జైలు నోటుబుక్‌లో రాసుకున్నాడు.
స్వాతంత్య్ర పోరాటం కోసం తన జీవితాన్ని అర్పించిన మరో యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌. ఆయన 1924లో హిందుస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ను స్థాపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దేశం కోసం ప్రాణాలివ్వడానికి, తీసుకోవడానికి సిద్ధపడిన యువకులను సమీకరించారు. ఆ రోజుల్లో లాహోర్‌ కళాశాలలో ఒక అధ్యాపకుడు ఉండేవాడు. ఆయనే భగత్‌సింగ్‌కు మార్క్సిస్టు సాహిత్యాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత భగత్‌సింగ్‌ను ఆజాద్‌ దగ్గరికి పంపారు. ఆజాద్‌ ఆదేశాలపై భగత్‌సింగ్‌ కొన్ని ప్రత్యక్ష చర్యల్లో పాల్గొన్నారు. ఆజాద్‌ను ఇతర కామ్రేడ్స్‌ను ఒప్పించి 1928లో హిందుస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ పేరును హిందుస్తాన్‌ సోష లిస్టు రిపబ్లిక్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌ఎస్‌ఏ)గా మార్చారు. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో సోషలిస్టు సమాజ స్థాపన అసోషియేషన్‌ లక్ష్యంగా ప్రకటించారు.
అంటరానితనంపై కూడా ఘాటైన వ్యాసాలు రాశారు. మదన్‌ మోహన్‌ మాలవ్య లాలాలజపతి రారు అలాగే కొందరు నాయకులు మొల్లాలు దళితులతో పూలదండలు వేసుకోవాల్సి వస్తే ఇంటికెళ్లాక వేసుకొన్న బట్టలు విప్పకుండానే బిందెలతో నెత్తిమీద నీళ్లు గుమ్మరించుకోకుండా ఇంట్లోకి వెళ్లరని విమర్శించారు. ”మన వంటి దేశం మరెక్కడా లేదు. ఇక్కడ ఆరు కోట్ల మంది (ఆనాటి జనాభా లెక్కల ప్రకారం) ప్రజలు అంటరానివారట. వారిని ముట్టుకుంటే చాలు పైకులాలవారు మైలబడి పోతారాట. వారు గుడుల్లోకి వస్త్తే దేవుళ్లకు కోపం వస్తుందట. మనది ఆధ్యాత్మిక దేశమని గొప్పగా చెప్పుకుంటాం. కాని మనుషులంతా ఒక్కటే అని చెప్పలేం. విదేశాల్లో భారతీయుల పట్ల వివక్ష చూపుతారని బాధపడ్తుంటాం. కాని మన దేశంలో మాత్రం పౌరులందరికీ సమాన హక్కులివ్వం. అలాంటప్పుడు విదేశాల్లో మనల్ని తక్కువ చేసి చూస్తున్నారని ఎలా ఫిర్యాదు చేయగలం? అని ప్రశ్నించారు.
ఆయన నాస్తికుడు కూడా. నాస్తికత్వంపై కూడా వ్యాసాలు రాశారు. విస్తత అధ్యయనం, పరిశీలన ఆయనను నాస్తికుడిగా, కమ్యూనిస్టుగా భారతీయ సామాజిక వ్యవస్థపై పోరాడే యోధుడిగా మార్చాయి. పది హేడేండ్ల వయస్సు నుండే ఆయన వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. జైల్లో ఉరికంబానికి ఎక్కాల్సిన రోజు చేరువవుతున్నా ఆ విషయం లెక్కచేయకుండా చివరిక్షణం వరకు అధ్యయనం, రచన కొనసాగించారు. ఉరికంబం దగ్గరికి తీసుకేళ్లడానికి పోలీసు వచ్చినప్పుడు ఆయన లెనిన్‌ రచన స్టేట్‌ అండ్‌ రెవల్యూషన్‌ చదువుతున్నారు.
టెర్రరిజాన్ని ఆయన సమర్థించలేదు. ”విప్లవం అంటే బాంబులు, తుపాకుల సంస్కృతి కాదు. విప్లవం అంటే మా అర్థం పరిస్థితుల్లో మార్పు తేవడం. అది ఒక న్యాయమైన ప్రణాళికపై ఆధారపడి జరగాలి” అంటూ భగత్‌సింగ్‌ వివరించారు. తన ప్రారంభదినాల్లో హింసపట్ల, టెర్రరిజం పట్ల విశ్వాసం ఉన్నా అధ్యయనం పరిశీలనల వల్ల శాస్త్రీయ అలోచన వైపు వచ్చారు. ”బహుశా విప్లవకారునిగా జీవి తం ప్రారంభించిన తొలిరోజులను మినహాయిస్తే ఎన్నడూ నేను టెర్రరి స్టును కాను. టెర్రరిస్టు చర్యల వల్ల మనం ఏది సాధించలేమని నాకు దఢమైన నమ్మకం ఏర్పడింది’ అని పేర్కొన్నారు. యువతను, కార్మికు లను రైతులను పెద్ద ఎత్తున సమీకరించి పోరాడటం ఎంత ముఖ్యమో అర్థం చేసుకొన్నారు. కార్మికులను స్వాతంత్య్రోద్యమంలోకి సమీకరిం చరాదన్న గాంధీజీ ఆలోచనను భగత్‌సింగ్‌ తూర్పార బట్టారు.
విశ్వమానవ సౌభ్రాతృత్వం ఏర్పడాలని కోరుకుంటూ 1924లోనే ఆయన ఒక ప్రామాణిక వ్యాసం ప్రచురించారు. అప్పటికి ఆయన వయస్సు 17ఏళ్లు మాత్రమే. ఆ వ్యాసంలో మానవులందరూ ఒకటే. మనుషుల్లో పరాయివాడు అనే మాట ఉండని సమాజం కావాలన్నాడు. ఆ భావనలోనే భగత్‌సింగ్‌ గొప్పతనమేమిటో తెలుస్తుంది. ఇరుగు పొరుగును కూడా పరాయివారిగా చూపెట్టే పనిలో నిమగమై ఉన్న నేటి రాజకీయ వాదులు భగత్‌ ఆశయాలకు పూర్తిగా వ్యతిరేకులు నలుపు – తెలుపు, నాగరికులు – అనాగరికులు, పాలకులు – పాలితులు, ధనిక – పేద, సవర్ణుడు – అంటరాని వాడు వంటి పదాలు ఉనికిలో ఉండరాదన్నారు భగత్‌సింగ్‌. ”సమానత్వం సమానవాటా కోసం మనం ఆందోళన చేయాలి. అలాంటి ప్రపంచ ఏర్పాటును వ్యతిరేకించే వారిని శిక్షించాలి.” అని ఘంటాపధంగా చెప్పారు.
లాహోర్‌లో 1926లో నౌజవాన్‌ భారత సభ స్థాపన ద్వారా భగత్‌సింగ్‌ తన ఆలోచనలకు నిర్మాణ రూపం ఇచ్చారు. రహస్య విప్లవకారులకు ఆనాడు అదొక బహిరంగ వేదిక. సంకుచిత మతరాజకీయాల ప్రభావం సభ పై పడకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడింది. ముస్లిం మతతత్వం కూడా ఆ సమయంలో విస్తరిస్తోంది. బ్రిటిష్‌ ఎత్తుగడల వల్ల ఆనాడు ప్రజల్లో మత ప్రాతిపదికన లోతైన చీలిక ఏర్పడుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌, ముస్లిం సంస్థల ధోరణి ఆ పరిస్థితికి అనుకూలంగా ఉండింది. ఆ నేపథ్యంలో నౌజవాన్‌ భారత్‌ సభ ప్రణాళికలో భగత్‌ సింగ్‌ ‘మతపర మూఢాచారాలు, మతోన్మాదం మనకు అడ్డు గోడలుగా నిరూపణ అయ్యాయి. కనుక మనం ఆ మత భావనలను వదిలిపెట్టాలి. స్వేచ్ఛాయుత ఆలోచనలకు అడ్డుపడేదల్లా నశించాల్సిందే’ అని పేర్కొన్నారు. ఆనాటి పత్రికల పాత్రను కూడా భగత్‌సింగ్‌ దుయ్యబట్టారు. జర్నలిస్టులు ఆ కర్తవ్యాలను ఎలా ఉల్లంఘిస్తున్నారో ఎత్తి చూపారు. ”పత్రికల నిజమైన కర్తవ్యం ప్రజలను చైతన్య పరచడం వారి ఆలోచనలను పరిశుభ్రం చేయడం. ప్రజలను, దేశాన్నీ సంకుచిత వాదనల నుండి పత్రికలు కాపాడాలి. ఉమ్మడి జాతీయతను సష్టించాలి. కాని దానికి బదులు అవి అజ్ఞానంతో ఒంటెత్తువాదాన్ని, దురభిమానాలను బోధించడమే తమ కర్తవ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రజల మెదళ్లను మతతత్వంతో నింపుతూ అవి మన సమ్మిళిత సంస్కతిని, ఉమ్మడి వారసత్వాన్ని విధ్వంసం చేస్తున్నాయి” అని మండిపడ్డారు.
బ్రిటిష్‌ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రజావ్యతిరేక బిల్లులను ప్రవేశపెట్టే రోజును ఎంచుకొని 1929 ఏప్రిల్‌ 8న పార్లమెంట్లోకి భగత్‌సింగ్‌ పొగ బాంబులు విసిరారు. ఆ రోజును ఎంచుకోవడంలోనూ హెచ్‌ఆర్‌ఎస్‌ఎ సైద్ధాంతిక నిబద్ధత మనకు కనిపిస్తుంది. వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలను అణచడానికే బ్రిటిష్‌ ప్రభుత్వం వాణిజ్య వివాదాల బిల్లును, ప్రజా భద్రత పేర మరి కొన్ని బిల్లులను తీసుకొచ్చింది. వాటిని ప్రవేశ పెడుతుండగా భటుకేశ్వర్‌ దత్‌తో కలిసి భగత్‌సింగ్‌ పార్లమెంట్‌లోకి పొగబాంబులు విసిరారు.ఆ చర్య పై భగత్‌ సింగ్‌ ఇలా చెప్పారు. ”బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంలో న్యాయానికి చోటు లేదు. బానిసలకు ఊపిరి తీసు కొనే స్వేచ్ఛను కూడా వారివ్వరు. ప్రజలను అణిచేయాలని, దోచుకోవాలని, హతమార్చాలని చూస్తుంటారు. అంతకంతకు అణిచివేత చట్టాలను తెస్తారు. ప్రజల అసమ్మతి గళాలను విన్పించనివ్వరు. ఈ స్థితిలో త్యాగం మాత్రమే మనల్ని ఈ అణచివేత నుండి రక్షించగలదు. మనం మన అసెంబ్లీలోని భారతీయ, విదేశీ సభ్యుల కళ్లు తెరిపిద్దాం.” అని అన్నారు.
”వేళ్లమీద లెక్కబెట్టగల కొందరు దోపిడీదార్లు తమ స్వార్థం కోసం ఇక్కడి ప్రజలను దోచుకుంటున్నారు. ఆ దోపిడీ ముగిసే దాకా భారత దేశంలో పోరాటం దీర్ఘకాలం సాగాలి. వారు బ్రిటిష్‌ పెట్టుబడిదారులా? లేక భారతీయులు కూడా వారితో షరీకై ఉన్నారా? లేక దోపిడీ దార్లంతా భారతీయులేనా? అన్న ప్రశ్నలతో మనకు సంబంధం లేదు. దోపిడీ ఎక్కుడున్నా పోరాడాల్సిందే అంటూ ఆనాటి భారతీయ పెట్టుబడిదార్ల దోపిడీకి వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
భగత్‌సింగ్‌ 1907 సెప్టెంబర్‌ 28న నేడు పాక్తిస్తాన్‌లో ఉన్న లాహోర్‌ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించారు. 1930 మార్చి 23న భగత్‌సింగ్‌ను ఆయన సహచరులు సుఖదేవ్‌, రాజ్‌గురులతో పాటు బ్రిటిష్‌ వలస ప్రభుత్వం ఉరితీసి హత్య చేసింది. ఆయనను ఉరితీశారని తెలిసిన వెంటనే ఆ సేతు హిమాచలం అట్టుడికి పోయింది, ఎర్రబడింది. లాహోర్‌కు ఎంతో దూరంలో ఉన్న మద్రాసులోనూ ప్రజలు కోపావేశాలతో తమంతట తాముగా ఇళ్ల నుండి బయటకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ విప్లవకారుడు ఇరవైయేండ్లే బతికినా తన రచనలతో, తన ఆచరణతో త్యాగంతో ఎంతో వారసత్వ సంపదను భావితరాలకు వదలి వెళ్లారు.
(నేడు భగత్‌సింగ్‌ 117వ జయంతి)
– ఎస్‌.వినయకుమార్‌, 9989718311