‘మనుషులను చంప గలరేమో కానీ వారిలో ఉండే ఆశయాలను కాదు’ అని చాటిచెప్పిన ధీరుడు సర్ధార్ భగత్‌సింగ్. ఆ మహావీరుని 117వ జయంతి నేడు. ఇంక్వి లాబ్ జిందాబాద్ నినాదంతో స్వేచ్ఛాకాంక్షని రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలొదిలిన త్యాగధనుడు. భగత్‌సింగ్ పేరు వింటేచాలు రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపింది. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచి పోయిన వీరుడాయన. రెపరెపలాడే విప్లవపతాక. కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు 1907, సెప్టెంబరు 27న భగత్‌సింగ్ జన్మించారు.13 ఏళ్ల వయసులో సహాయ నిరాకరణోద్యమం భగత్ సింగ్ పై విపరీత ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్య్ర పోరాటంలో ఆయన మొదటిసారి పాల్గొన్నారు. ప్రభుత్వ పుస్తకాలను,దుస్తులను తగులబెట్టారు.1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ దురంతం భగత్‌సింగ్ స్వాతంత్యకాంక్షను మరింత రగిలించింది.అయితే గాంధీ అహింసా మార్గంకంటే హింసకు హింసే సమాధానమని నమ్మారు. గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటం రాజీ ధోరణిలో సాగుతోందని, అది మంచిది కాదని చెప్పిన తొలివ్యక్తి భగత్‌సింగ్. గాంధేయవాదంపై భగత్‌సింగ్‌కు నమ్మకం లేదు. గాంధేయవాద రాజకీయాల వల్ల స్వార్థ పరులు పుట్టుకొస్తూనే ఉంటారని ఆయన అభిప్రాయం. అదే సమయంలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశంలో సైమన్ గోబ్యాక్ ఉద్యమం జరుగుతున్న సమయంలో లాహోర్‌లో లాలా లజపతి రారు బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు.అప్పుడు బ్రిటీష్‌వారి దాడిలో పంజాబ్ కేసరి నేలకొరిగారు.దీంతో భగత్‌సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురులలో ఆగ్రహాన్ని నింపింది. చెమర్చిన కళ్లతోనే సాండర్స్ అంతు చూశారు. కసితీరా కాల్చి చంపారు.ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 1929లో అసెంబ్లీపై బాంబులు విసి రారు. ఆ సంఘటనలో ఎవరూ గాయ పడక పోయినా ఆ ముగ్గురు లొంగి పోయారు. దేశం నుంచి బహిష్క రణకు గురయ్యారు. అనంతరం వారిపై బ్రిటిష్ ప్రభుత్వం సాండర్స్ హత్యా నేరం మోపింది. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు నేరాన్ని ఒప్పుకున్నారు. కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. భగత్‌సింగ్ జైలులో ఉన్న సమయంలోనే అనేక రచనలు రాశారు.23 ఏళ్ల వయస్సులో జీవితం విలువ ఏం తెలుస్తుంది. ప్రాణాలంటే అంత లెక్కలేని తనం? అంతా కుర్ర ఆవేశం? అతను ఒక తీవ్రవాది కూడా! ఇలా రకరకాలుగా భగత్‌సింగ్ గురించిన అపోహలు నాడు ప్రచారంలో ఉన్నాయి. భగత్‌సింగ్ వ్యక్తిత్వాన్ని ఆయన భావాలు, దృక్పథం సమాజాన్ని ఆయన అర్థం చేసుకున్న విధానం జీవితం పట్ల, ప్రాణాల పట్ల ఆయనకున్న అభిప్రాయాలు ఏమిటో వారి మిత్రుడు శివవర్మ రాసిన సంస్మృతు లులో వ్యక్తీకృతమవుతాయి. బ్రిటీష్ పాలకుల్ని వెళ్లగొట్టడం మాత్రమే కాదు, ఆ తర్వాత దేశంలో చోటుచేసుకునే దోపిడీలను నిర్మూలిం చాలని చాటిన వ్యక్తి భగత్‌సింగ్.ఆయన అసాధారణ రాజకీయ సైద్ధాంతిక అవగాహన ఉన్న వ్యక్తిగా వారి రచనలు స్పష్టం చేస్తాయి.శాస్త్రీయ దృక్ప థాన్నే పంథాగా మార్చుకున్న మానవతావాది. సమాజాన్ని అమితంగా ప్రేమించిన సౌహార్థ హృదయుడు.
జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలో యావజ్జీవ శిక్ష విధిస్తారని భావించిన సుఖ్‌దేవ్ నాలుగు గోడల మధ్య బతకడం కన్నా ఆత్మహత్య చేసుకుని చావడం నయమంటూ రాసిన లేఖకు, ఆత్మహత్య ఆలోచన ప్రగతి నిరోధక చర్య. పిరికి చర్య కూడా! మనం నవ్వుతూ ఉరితాడును కౌగిలించుకుంటున్నాం అంటే ప్రాణాలపై ఆశలేదని కాదు మన దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయం అని అర్థం. ఒకవేళ మన జీవితమంతా జైలు గోడల మధ్య సాగాల్సి వచ్చినా, ఇక్కడి నుంచే మన పోరాట మార్గాన్ని కొనసాగిస్తామని భగత్‌సింగ్ సమాధానమి చ్చారు. జైల్లోని రాజకీయ ఖైదీల హక్కుల కోసం 114 రోజులు నిరాహార దీక్ష చేసి, నిర్బంధంలోనూ పోరాటస్ఫూర్తిని రగిలించాడు. ప్రేమ అంటే జంతు ప్రవృత్తితో కూడిన వ్యామోహం కాదు. నైతిక విలువలు, సంస్కృతిపై ఆధారపడ్డ గొప్ప అనుభూతి.అది ఎన్నడూ మనిషిని దిగజార్చదు. ప్రతి మనిషి తప్పనిసరిగా లోతైన ప్రేమ భావనలు కలిగుండాలి అంటూ ఓ లేఖలో రాశారు భగత్ సింగ్.రెండు పదుల వయసులోనే ప్రేమను నిర్వచించిన భగత్‌సింగ్ మానసిక పరిణితి ఎంతగొప్పదో ఆ మాటల్లోనే అవగతమవుతోంది. తల్లిదండ్రులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరుతుంటే భగత్‌సింగ్ దానిక్కూడా ఒప్పుకోలేదు.
భగత్‌సింగ్‌ను ఉరితీయడానికి రెండు గంటల ముందు కూడా లెనిన్ రివల్యూషనరీ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాడు.ఆ సమయంలో భగత్‌సింగ్‌తో దేశానికి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా? అని అడిగితే సామ్రాజ్యవాదం తగ్గి విప్లవం కొనసాగాలని పిలుపునిచ్చాడు. 12 గంటల ముందే ఉరితీస్తున్నారని తెలియగానే లెనిన్ రివల్యూషనరీ పుస్తకంలో ఒక్క అధ్యాయం కూడా పూర్తి చేయడానికి నన్ను అనుమ తించరా? అని అడిగాడు. ఆయనకు ఆ పుస్తకం పట్ల ఎంత ప్రేమ ఉందో ఈ మాటతో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన కోరిక వారు తీర్చలేదు. ఉరితీయడానికి వేదికపై నిలబడుకుని ఉన్నప్పుడు దేవుడిని తలచుకోమంటే ‘ప్రజలకు కష్టాలు ఇస్తున్నందుకు నేను దేవుడిని చాలా సార్లు తిట్టుకున్నాను. అలాంటిది ఇప్పుడెలా దేవుడిని స్మరిస్తాను’ అని అన్నాడు. భగత్‌సింగ్ భారతీయ సమాజంలో పెరుగుతున్న మతతత్వ స్వభావాన్ని విమర్శించడమే కాకుండా, స్వాతంత్య్ర పోరాట సంవత్సరాల్లో అస్పృశ్యత, కులం తీవ్రమైన సమస్యపై కూడా రాశాడు. పదహారేండ్ల వయస్సులో జూన్ 1928లో అతను అంటరానితనం సమస్య అనే శీర్షికతో ఒక వ్యాసం రాశాడు. అంటరానివారిని హిందూ, ముస్లిం మిష నరీ సంస్థల మధ్య విభజించాలని 1923నాటి కాంగ్రెస్ సమావేశంలో మహమ్మద్ అలీ జిన్నా చేసిన ప్రతిపాదన నేపథ్యంలో ఈ వ్యాసం వచ్చింది.ఈ వ్యాసంలో, భగత్‌సింగ్ మొత్తం 30కోట్ల జనాభాలో ఆరుకోట్ల మందిని అంటరానివారిగా ఎలా పరిగణిస్తున్నారో, వారి స్పర్శ ఇతర మానవులను, ఆలయాలను, బావులలోని నీటిని ఎలా కలుషితం చేస్తుందో ఆయన ఎత్తి చూపారు. ఇరవయ్యో శతాబ్దంలోనూ ఇలాంటి వైఖరులు కొనసాగడం నిజంగా సిగ్గుచేటు.
ఒకవైపు భారతీయ ప్రజానీకం ఆధ్యాత్మికతలో చిక్కుకుపోతుంటే, మరోవైపు ఐరోపాలోని భౌతికవాద సమాజాలు శతాబ్దాలుగా విప్ల వాత్మకంగా మారుతున్నాయి. ఫ్రెంచ్, అమెరికన్ విప్లవాల సమయంలో సమానత్వం ఇప్పటికే ప్రకటించ బడింది. రష్యా కూడా ఇటీవల అన్ని రకాల అసమానతలను రూపుమాపడానికి విప్లవాన్ని చూసింది. అణగారిన సమాజానికి చెందిన తమతోటి పౌరులను సమానంగా చూడని వ్యక్తులకు రాజకీయ హక్కులను డిమాండ్ చేసే హక్కులేదని కూడా భగత్‌సింగ్ ఉద్ఘాటించారు.
కుక్కలు వంటింట్లో తిరగడం ఇబ్బంది కాదని, దళితుడు గుడిలోకి లేదా బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించడం అంతా అపరిశుభ్రంగా మార్చే కులహిందూ సమాజాన్ని ఆయన విమర్శించారు. ఈ ఆచారం అమానుషం, ఈ సామాజిక వ్యవస్థలో దళితులను జంతువులకంటే తక్కువ స్థాయికి పరిగణిస్తారు. ముస్లింలు, సిక్కులు, క్రిస్టి యన్ మత సమూహాలు దళితులను తరచుగా సమానులుగా, వారి కమ్యూనిటీలలో కుల హిందు వులను కించపరచడం ప్రారంభించాయి. దళితులను ఇతరుల రాజకీయాలకు వాడుకోవద్దని, సంఘటితం కావాలని సూచించారు. 23 మార్చి 1931రాత్రి 7.30గంటలకి తన స్నేహి తులయిన విప్లవ యోధులు సుఖ్‌దేవ్, రాజ్‌గురులను నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వారి ముగ్గురినీ వరుసగా నిల్చో బెట్టి ఉరితీసింది.ఉరికొయ్య ముందు నిల్చుని కూడా ఆ ముగ్గురూ ఏ మాత్రం భయపడలేదు. ఉరికొయ్యని ముద్దాడే ముందు చివరిసారి ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్.ఆ ధైర్యమే ప్రవాహంలా మారి నేటితరాలకు చేరింది.
– నాదెండ్ల శ్రీనివాస్, 9676407140