ద్వేషం, మత ఉన్మాదం లేని సమాజ నిర్మాణమే భగత్‌సింగ్‌ కోరిక

ద్వేషం, మత ఉన్మాదం లేని సమాజ నిర్మాణమే భగత్‌సింగ్‌ కోరిక– విద్యార్థులు వీరుల చరిత్రలు తెలుసుకోవాలి : ప్రజా గాయకుడు, కవి జయరాజు
– డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో యువ కవి, గాయకుల సమ్మేళనం
నవతెలంగాణ – ముషీరాబాద్‌
ద్వేషం లేని, మత ఉన్మాదం లేని సమాజ నిర్మాణమే భగత్‌ సింగ్‌ కోరిక అని, భగత్‌ సింగ్‌ను చదివితే శాశ్వతంగా జీవించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ మారగలుగుతారని ప్రజా గాయకుడు, కవి జయరాజు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీివైఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో షహీద్‌ భగత్‌సింగ్‌ స్మారక యువజన ఉత్సవాల సందర్భంగా మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యువ కవి, గాయకుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్య పుస్తకాలే కాక వీరుల చరిత్రలు చదవాలని, అన్నింటినీ తెలుసుకోవాలని సూచించారు. గతాన్ని, వర్తమానాన్ని, అందులోనూ ప్రముఖుల త్యాగాలను తెలుసుకోవాలన్నారు. మార్క్స్‌, భగత్‌ సింగ్‌, అంబేద్కర్‌, ఫూలే, బుద్దుడు, పెరియార్‌ ఇలా ప్రతి ఒక్కరి జీవితం మనకు ఒక పాఠమే అన్నారు. మనం కూడా మతం, కులం, మత్తులను విడనాడి జ్ఞానంతో బతికితే మనమూ వందేండ్లు బతకొచ్చు అన్నారు. జైళ్లు, పొలీస్‌లు, లాఠీలు, తూటాలు ఇవన్నీ మనిషిని ఏమీ చేయలేవన్నారు.సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లడుతూ.. భగత్‌ సింగ్‌ సినిమా తెలుగులో రావాలని కోరారు. డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక నినాదం తీసుకొని ఈ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు విజయకుమార్‌ మాట్లాడుతూ.. మతోన్మాదులు చరిత్రను మార్చే పని చేస్తున్నారని.. మనం నిజాన్ని తెలియజేయాలని అన్నారు.
భగత్‌ సింగ్‌ ఆశయ వారసులు ఎర్రజెండా బిడ్డలే అని చెప్పారు. ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటం గురించి యువత తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ నాయకులు మోహన్‌ కృష్ణ, ప్రజానాట్యమండలి నాయకులు రాజు, గాయకులు సైదులు, పద్మ, సిరి, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ అధ్యక్ష కార్యదర్శులు లెనిన్‌, అశోక్‌ రెడ్డి, డీవైఎఫ్‌ఐ అధ్యక్షులు హస్మి బాబు, జావేద్‌ నాయకులు అస్మిత, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.