పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా వైద్య కళాశాలలో జరిగిన ట్రెయినీ వైద్యవిద్యార్థిపై జరిగిన లైంగికదాడి, హత్య ఘటనపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఘోరాతి ఘోరమైన ఈ అమానవీయ ఘటన భారత ప్రజల విజ్ఞతను ప్రశ్నిస్తోంది. అన్ని తరగతుల నుంచి ఏదో రూపంలో నిరసన వ్యక్తమవు తోంది. ఇలాంటి దారుణ మారణ కాండపై ఎవరైనా స్పందించాల్సిందే మరి. అలా స్పందిం చిన ప్రజలందరికీ వందనాలు. అయితే ఇక్కడే కొన్ని ప్రశ్నలకు పౌర సమాజం సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసర ముంది. ఎందుకంటే ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజని, దేశ ప్రజలంతా తెల్లదొరల బానిస సంకెళ్లను తెంచుకుని విముక్తి పొందారని ఎంతో సంబరంగా జెండా పండుగ చేసుకుంటున్నారు. కానీ అదే రోజు కోల్‌కతా నగరంలోని ఆర్‌జికార్ వైద్య కళాశాలలో, చదువుల తల్లి మౌమిత అనే వైద్య విద్యార్ధిని అర్ధరాత్రి పది మంది మానవ మృగాల చేత లైంగికదాడికి గురై, హత్యగావించబడింది. కళాశాలలో జరుగుతున్న అరాచకాలు, డ్రగ్స్ విక్రయాలు యువతకు హాని చేస్తాయని, వాటిని కట్టడి చేయాలని పైఅధికారులకు ఫిర్యాదు చేయటం వల్లనే ఆమెపై ఇంతటి క్రూరత్వం జరిగిందని మీడియా అం దించిన సమాచారం. మన ప్రజాస్వామ్యం మేడిపండని చెప్పుకోడానికి తప్ప చేయడానికి, పాటించడానికి కాదని మనకు తెలిసినంత ఆ లేత మనసుకు తెలియదు కదా పాపం. ‘ఆమె చేసింది కరెక్ట్ కాదంటే ఏమంటారు? అబ్బే, ప్రశ్నించాలండీ, లేకపోతే సమాజం ఏమైపోతుంది? అంటారు. కానీ, నేను నా పిల్లలు జాగ్రత్త. ఏదయినా చూసినా చూడనట్టుండనే నేర్పుతారు ఎక్కువమంది తల్లి దండ్రులు.’ ఆడపిల్లల ను రక్షించుకోవాలంటే నేర్పాల్సింది పిరికితనం కాదు, ధైర్యసాహసాలని ప్రతిఒక్కరికీ అర్థం కావాలి.
మన దేశంలో ఇటువంటి అకృత్యాలు ఎన్నో జరిగాయి. నిర్భయ, కతువా, ఉన్నావో, హత్రాస్, దిశ, ఆయేషామీరా, బిల్కిస్ బానో లాంటి సంఘటనలు ప్రజానీకాన్ని మేల్కొల్పాయి. నిందితులను శిక్షించాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు సరైన జోక్యం చేసుకోకపోవడం వల్ల ‘కోల్‌కతా’ లాంటి ఘటనల్లో కామపిశాచాలు మరింత వికృత రూపాల్లో పెట్రేగాయి. ఇదే మొదలూ కాదు, ఇదే చివరిదీ కాదు. మరీ ఏం చేద్దాం? కానీ మన ఆలోచనల్లోనే లోపం ఉంది. రోగానికి తగిన మందు వేస్తే రోగం తగ్గుతుంది. రోగమొకటైతే మందు ఒకటి వేస్తున్నాం. పై ఘటనలు జరిగిన పలు సందర్భాల్లో, సామాజికవేత్తలు, మహిళాసంఘాలు అనేక అంశాలను గమనించి ప్రజల ముందు, ప్రభుత్వాల ముందుంచాయి. ఆ సమస్యల లోతుల్లోకి ఈ నిరసనకారులు తొంగిచూడరు. నిర్భయ ఘటనలో, దిశా ఘటనలో గమనిస్తే ముద్దాయిలు చదువులేని అల్లరి గ్యాంగు, మురికివాడల్లో పెరిగిన వాతావరణం, చిన్న వయసులో తాగుడుకు బానిసలై మైకంలో ఈ తప్పులు చేసినట్టు, వారు వాంగ్మూలం ఇచ్చినట్టు జైళ్లకెళ్లి వారిని ఇంటర్వ్యూ చేసిన పెద్దలు చెప్పారు. అంటే ఇక్కడ సమాజంలో అసమానత, దారిద్య్రం కూడా ఓ కారణమే. మరో రకం, దేశంలో మతం ముసుగులో దొంగ బాబాలు, మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకునే మహిళలు వారి విషకౌగిళ్లకు బలవ్వడం. డేరా బాబా ఆశ్రమ స్థలంలో వందకు పైగా అమ్మాయిల అస్తిపంజరాలు దొరికాయంటే మన దేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం గొప్పగా చెప్పుకునే సాంప్రదాయాల ముసుగులో జరిగే ఈ ఘోరాల పట్ల సమాజం ఏమేరకు స్పందించింది? ‘అయ్యో బాబాలను ఏమైనా అంటే పాపం కదా’ అనేది ఇంకోవాదన తెరమీదకి వస్తోంది. మన పాల కుల విధానాలు, వారి రాజకీయ అవసరాల కోసం యువతను డ్రగ్స్ మాఫియాలుగా, గుండాలుగా, తాగుడుకు బానిసలను చేసి వాడుకుంటున్న తీరు చూస్తూనే ఉన్నారు కదా! ఎన్నికల్లో బిర్యానీ ప్యాకెట్లు, లిక్కర్ సీసాలు చేతికిచ్చి వారిని పెడతోవ పట్టించ డం వారిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ల డమా? లేదంటే అద:పాతళంలోకి తొక్కెయడమా? ఆదా యం కోసం మద్యాన్ని గల్లీగల్లీకి సరఫరా చేస్తున్నది ప్రభుత్వ పెద్దలు కాదా? దీని వెనుక గల పర్యవసనాల్ని పట్టించుకునేదెవరు? ప్రశ్నించాల్సిం దెవరు?
ఇవాళ కోల్‌కతా ఘటనలో, గతంలో అనేక సందర్భాలలో, ముద్దాయిలకు అండగా నిలిచింది అక్కడి పాలకులే. అంతేకాదు మన న్యాయవ్యవస్థ, చట్టాలు ఏవిధంగా పని చేస్తున్నాయో చూస్తే, మహిళల రక్షణ కోసం ఎందరో సంఘ సంస్కర్తలు, మహిళా సంఘాలు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలు చాలా సందర్భాలలో నిరుపయోగమ వుతున్నాయి. ముద్దాయిలకు శిక్ష పడేదాకా పోరాడటంలో పౌర సమాజం బాధితులకు అండగా నిలవడం లేదు. రాజకీయ నాయకులు, వారి అనుయాయుల బెదిరింపులకు భయపడి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు. అవన్నీ చూస్తూ ఊరుకోవడం వల్లనే ఘోరాలు చేసినవాళ్లు తలెగరేసి తిరుగుతున్నారు. ఉదాహరణకు, అయేషామీరా కేసులో ఆ తల్లి ఆక్రందనలు ఎంతమంది పట్టించుకున్నారు? ఇంతమంది త్యాగాలతో సాధించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవడం, వారిని రక్షించు కోవడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. మన స్వంత సంపద, డబ్బు, బంగారం, ఇండ్లు, భూములు ఏవిధంగా భద్రంగా దాచుకుంటామో, చట్టాలను కూడా నిరంతరం గమనిస్తూ అమలు జరిపించు కోవాలి. అవి అమలు జరగనియెడల బాధితులే కాదు, ప్రజలంతా స్పందించాలి, అవసర మైన చోట ఉద్యమించాలి.
కేవలం ఒక ఘటన జరగ్గానే ఆందోళన చేసి, ఆ తర్వాత మర్చిపోతే ఉపయోగం లేదు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని అంటారు. నిండు నూరేండ్లు బతికి అనుభవిం చాల్సిన జీవితం మట్టిపాలైనాక, ఇంక ఆత్మకు శాంతి ఎట్లా ఉంటుంది? ఘోషిస్తుంది తప్ప. బాధితుల ఆత్మ శాంతించాలంటే, మరొక అమ్మాయిని బలి కానివ్వబోమని నినదించాలి. ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. సరిగ్గా ఆలోచిస్తే, అందరూ ఐక్యంగా కదిలితే మన బిడ్డలు రక్షించపబడతారు. అంతేకాని ఆడపిల్లను ఆస్తిలాగా లాకర్లో పెట్టో, ఇంట్లో బంధించో కాపాడలేము. ఎందుకంటే వాళ్లు మన తోటి మనుషులు, వస్తువులు కాదు గదా దాచిపెట్టడానికి. పిల్లలకు నేర్పాల్సింది కన్నీరు కార్చటం కాదు, కన్నెర్రజేయటం. కాళికామాతను ఆరాదించే దేశంలో పుట్టాము. ఒక్కొక్కరు ఒక కాళికగా మారితేనే మహిషాసురులను మర్దించ గలం, మనల్ని మనం రక్షించుకోగలం.
– బి.హైమావతి, 9490098023