పైప్‌ లీకేజీతో ‘భగీరథ’ నీరు వృథా

– కలుషితమవుతున్న తాగునీరు
– మరమ్మతులు చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు
నవతెలంగాణ-కొందుర్గు
ఎండాకాలం సమయంలో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకవైపు తాగునీరు సప్లై చేసే మిషన్‌ భగీరథ వాటర్‌ పైప్‌ లైన్‌ లీకేజీతో తాగునీరంతా వృథాగా పోతుంది. నీటి కటకటతో ప్రజలు అల్లాడుతున్నారు. కానీ సంబంధిత అధికారులు పైప్‌ లీకేజీలను మరమ్మతులు చేయడంలో విఫలమవుతున్నారు. కలుషితమైన నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని తాగిన ప్రజలకు అనారో గ్యానికి గురయ్యే అవకాశం ఉంది. రెండు నెలలుగా ఈ మిషన్‌ భగీరథ వాటర్‌ లీకేజీ అవుతుందని సంబంధిత అధికారులకు సమాచారమిచ్చినా నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారనీ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌ భగీరథ అధికారుల పైన సర్వత్రా విమర్శలు తలేత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్లితే కొందుర్గు మండలానికి వచ్చే మిషన్‌ భగీరథ వాటర్‌ పైప్‌ లైన్‌రెండు నెలలుగా లీకేజీ అవుతుంది. రాంచేంద్రాపూర్‌ మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకు నుంచి కొందుర్గుకు వచ్చే దారిలో రాంచేంద్రాపూర్‌ మిషన్‌ భగీరథ ట్యాంకు నుంచి కిలోమీటర్‌ దూరంలో షాద్‌నగర్‌ నుంచి పరిగి వైపు వెళ్లే మెయిన్‌ రోడ్డుకు పక్కనే ఇంక్రిడెబుల్‌ ఇండియా వెంచర్‌ గేట్‌ ఎదురుగా వాటర్‌ లీకేజీ అవుతుంది. గతంలో మిషన్‌ భగీరథ ఏఈ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తాగునీటి లీకేజీ సమస్యను పరిష్కరించాలని కొందుర్గు గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.