తాను రాయడం కన్నా తన శిష్యులే బాగా రాయాలి అని తపించే ఉత్తమ సాహితీ గురువు భైతి దుర్గయ్య. వత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ప్రవత్తిగా ఎందరో భావితరం రచయితలను తీర్చిదిద్దుతున్న ఉత్తమ ఉపాధ్యాయుడు ఆయన. ‘దుర్గమ్ బైతి’ కలం పేరుతో సాహితీ సజన చేస్తున్న ఈ సిద్దిపేట అక్షర శిఖరం కలం నుంచి వెలువడిన రెండవ బాలల కథా సంపుటి ఈ ‘నక్షత్ర కోట’. 14 కథలతో కట్టిన ఈ కథాతారల కోటలోని ప్రతి కథ సామాజిక అంశాలను ప్రతిబింబిస్తుంది.
ప్రస్తుత విద్యా విధానంలోని పాఠ్యాంశ నియమాలు, పిల్లల చదువుల్లో డొల్లతనం రావడానికి కారణం అంటూనే, పూర్వపు బడుల్లో సిలబస్, పరీక్షలు ప్రాతిపదిక లేకుండా ప్రాథమిక దశలోనే విద్యార్థులకు సంపూర్ణ అక్షరజ్ఞానం వచ్చేదన్న విషయాన్ని ‘రాములు సారు బడి’ కథలో చెప్పారు. ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే తగువును మూడో వ్యక్తి ఎలా ఉపయోగించుకొని లాభపడతాడో తెలుపుతూ ఐకమత్యంలోని లాభాన్ని విడమర్చి చెప్పిన మంచి కథ ‘అసలైన నీటి దొంగలు’.
అసలైన పుణ్యకార్యం ఏమిటో చెట్టు సాయంగా చెప్పబడిన కథతో పాటు, సభ్య సమాజంలోని సమస్యలను అంతం చేయడానికి అధ్యాపకులు ఎంతగా ఉపయోగపడతారో చాటిన ‘మాస్టారు ఇచ్చిన ప్రేరణ’ కథ, పాలకులు అనేవారు నిరాడంబరంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సేవకులుగా ఉండాలనే గొప్ప సందేశం అందించిన ‘మారాజు మహాత్ముడు’ కథ నేటి పాలకులకు కనువిప్పు కలిగిస్తాయి. విద్యార్థుల్లో విధిగా ఉండాల్సిన సామాజిక సేవా గుణం గురించి వివరించిన మిల్కీ లక్కీ కథతో పాటు, దాన గుణంకు కావాల్సింది ధనం కాదని చాటి చెప్పిన గొప్ప కథ ‘మీకు నచ్చిన గొప్ప మనిషి’. చదవడానికి నేటితరం పిల్లలకు కాస్త అసహజంగా అనిపించిన పర్యావరణం ప్రాధాన్యత తెలపాలనే తపనతో రాసిన కథ ‘కోతి రాయబారం’. రచయిత కొన్ని స్వీయ అనుభవాలను, అనుభూతులను కథలుగా మలచిన అపూర్వ గురుదక్షిణ, కోడూరు బడి కొలువులగడి, మొదలైనవి.
ప్రతి కథ సామాజిక విషయానికి ముడిపెట్టి రాసిందే ..! కథలన్నీ విసుగు లేకుండా చదివిస్తాయి కానీ కథలతో పాటు పిల్లలు ఇష్టంగా కోరుకునే బొమ్మలు లేకపోవడం కాస్త నిరాసక్తి కలిగించిన, కథలోని విడవకుండా చదివించే లక్షణం బొమ్మలు లేని లోటు మరిపిస్తుంది. నిడివిలో చిన్నది అయినా నీతిలో బోలెడు పెద్దది.
డా|| అమ్మిన శ్రీనివాసరాజు, 77298 83223.