భం..భం..అఘోరా!

Bham..Bham..Aghora!వాణి చాలా కంగారుగా ఉంది! ఇల్లంతా వెతుకుతున్నది. అయినా లాభం లేదు. ఆఫీసుకు తయారవుతున్న మురళి వద్దకు వెళ్లింది.
”ఏమండీ! నానిగాడు కనబడటం లేదు! స్కూలుకి టైము అవుతుంది! ఎక్కడికి వెళ్లాడు!” అని అడిగింది.
”స్కూలుకి డుమ్మా కొట్టాలని ప్లాన్‌ వేసుంటాడు! నేను పట్టుకొస్తానుండు” అంటూ మురళి నానిగాడి రూములోకి వచ్చాడు. అక్కడ నానిగాడు లేడు! వెంటనే బయటికి వచ్చాడు! మిద్దెపైకి వెళ్లి చూశాడు. అక్కడా కనబడ లేదు. మురళికి కూడా కంగారు మొదలైంది! నానిగాడు ఆడుకునే చోట్లలో, దాక్కునే ప్రదేశాల్లో అంతటా వెతికారు. కానీ ఉపయోగం లేదు.
ఇంతలో ఇంటిగేటు ముందు అలికిడైంది. వాణి, మురళీ ఆదుర్దాగా బయటికి వచ్చి చూశారు! మీడియా వ్యాన్లు ఒకటి తర్వాత మరొకటి వస్తున్నాయి! ఆ వ్యాన్లతో మనకేమిటి అను కొని ఇంట్లోకి వచ్చి మళ్లీ నానిగాడిని వెతకటం మొదలెట్టారు. కానీ మీడియా కార్లన్నీ మురళి వాళ్లింటి ముందే ఆగాయి! భార్యా భర్తలు ఆశ్చర్యపోయి చూస్తుండగా అన్ని ఛానళ్ల వాళ్లు వచ్చి, కెమెరాలు వాటి స్టాండ్లు సెట్‌ చేసుకుంటున్నారు.
”మా ఇంటికి ఎందుకొచ్చారు?” అన్నాడు మురళి గొంతు పెగల్చుకుని.
”ముందు మీరు పక్కకి తప్పుకోండి!” అంటూ కెమెరాలు సిద్ధం చేసుకుంటున్నారు మీడియా వారు. ఆంకర్లు కూడా మైకులు చెక్‌ చేసుకుని సిద్ధంగా ఉన్నారు.
”అసలు ఏంటి ఇదంతా! మా ఇంట్లో మీడియాలో చూపేంత ఏం ఉంది?” అడిగింది వాణి ఆందోళనగా.
”మీ ఇంట్లో అఘోరీ బాబా ఉన్నాడంటా!” మాకు సమా చారం వచ్చింది”. అన్నారొకరు.
”అదిగో అఘోరి బాబా వచ్చాడు…! అని ఎవరో అంటుండ గానే మురళి ఇంట్లోంచి ఒక అఘోరి వచ్చాడు. అతనికి పదేండ్లు ఉంటాయి. ఒళ్లంతా బూడిద పూసుకుని ఉన్నాడు. మెడనుండి మోకాళ్ల దాకా పెద్దపెద్ద రుద్రాక్షలతో చేసిన మాలలు వేసు కున్నాడు. నుదిట మొత్తం ఎర్రటి కుంకుమ దిద్దుకున్నాడు. ఒక చేతిలో జపమాల, మరో చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు. కెమెరాల ముందుకు వచ్చి నిలుచున్నాడు. అఘోరిని చూడగానే కెమెరామెన్లు, ఆంకర్లు సాగిలబడి దండాలు పెట్టారు. మురళి, వాణి కూడా భక్తితో నమస్కరించారు. కానీ వారికంతా గందర గోళంగా ఉంది. ఉన్నట్టుండి ఈ అఘోరి తమ ఇంట్లో నుండి ఎలా ఊడిపడ్డాడో అర్థం కావటం లేదు.
”ఏమండీ ఈ అఘోరి మనింటికి ఎప్పుడొచ్చాడు. నాకైతే చెప్పనేలేదు!” భర్త చెవిలో వాణి నిష్టూరమాడింది.
”ష్‌! గట్టిగా మాట్లాడకు అఘోరీ, నాగసాధువులు సూక్ష్మ శరీరాన్ని ధరించి ఎక్కడికైనా వెళ్లగలరు.అలాగే మనింటికి కూడా వచ్చి ఉండవచ్చు!” భార్య చెవిలో గుసగుసలాడాడు మురళి.
”మనింటి నుండి ఇంకా ఎక్కడికైనా వెళతాడా? ఇంకా సూక్ష్మరూపంలో నుండి పూర్తి రూపంలోకి రాలేదు?” చిన్న అఘోరిని చూస్తూ అడిగింది వాణి.
ఏమో నాకేం తెలుసు? ఎక్కువగా మాట్లాడకు ముందు దండం పెట్టుకో! అఘోరికి కోపం వస్తే అంతమై పోతాం!” అన్నాడు మురళి భయం భయంగా చెతులెత్తి మొక్కుతూ.
ఇంక ఆంకర్ల ప్రశ్నల పరంపర మొదలైంది. అన్ని ఛానెళ్లు లైవ్‌ పెట్టాయి.
”స్వామి ఎక్కడి నుండి వచ్చారు!”ఆంకర్‌ ప్రశ్న
”శ్మశానం నుండి!” అఘోరీ జవాబు
”తర్వాత ఎక్కడికి వెళ్తారు?”మరో ఆంకర్‌ ప్రశ్న
”పిచ్చి ప్రశ్న, ఎక్కడికైనా వెళ్తాను!” అఘోరి జవాబు.
”మీ పేరు ఏమిటి స్వామీ?” ఆంకర్‌ ప్రశ్న
”భం! భం! అఘోరా!” అఘోరా జవాబు.
”ఇంతకూ ఎందుకొచ్చారు స్వామీ?”
”మన దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడటానికి”
”సనాతన ధర్మానికి ఏం ప్రమాదం వచ్చింది స్వామీ?
”చాలా పెద్ద ప్రమాదమే వచ్చింది! మొత్తం ధర్మమే డేంజర్లో పడింది! అందుకే వచ్చాము.”
”శ్మశానం ఎందుకెళ్లారు స్వామీ?”
”అదేం ప్రశ్న! అక్కడ కాలిన శవాలు భుజించటానికి వెళతాం!”
”శవం కాలుతుంటే, మీరు ఆ శవాన్ని తింటుంటే, వారి బంధుమిత్రులు మిమ్మల్ని ఏమీ అనరా?” మీ చేతులు, నోరు కాలవా”!
”మూర్ఖురాలా! మేము సూక్ష్మ శరీరం దాల్చి శవాన్ని తింటాం! అందుకే మేం ఎవరికీ కనబడం! మా చేతులు, నోరు కూడా కాలవు!”
అందరూ ఆ ప్రశ్న అడిగిన ముర్ఖురాలి వంక వింతగా చూశారు. దాంతో ఆ మూర్ఖురాలు టపా,టపా చెంపలు వేసు కుంది. ఆ ప్రశ్న విన్నందుకు మిగిలిన వారంతా చెంపలు వేసు కున్నారు. కొందరు గుంజీలు తీశారు
ఇదంతా చూసి, మురళీ, వాణి కూడా చెంపలు వేసుకుని గుంజీలు తీశారు!
”ఈ పట్టణంలో ఎన్ని పెద్దగుళ్లూ, బిల్డింగులూ ఉండగా మీరు ఈ ఇంటికి ఎందుకొచ్చారు స్వామీ?”
”సనాతన ధర్మాన్ని కాపాడటానికి!”
అఘోరి సమాధానం విని కొందరు వాణి, మురళీలను హీనంగా చూశారు.
”సనాతన ధన్మానికి తాము ఏం ద్రోహం చేశామో భార్యా భర్తలకు అర్థం కాలేదు. పైగా తమ నానిగాడికి రోజు సనాతన ధర్మం గొప్ప తనం గురించి చెబుతునే ఉంటిమి గదా!” అనుకున్నారు.
”ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కూడా నిరంతరం సనాతన ధర్మాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు! ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడటానికి అఘోరి కూడా వచ్చారు! ఇందంతా చూస్తుంటే సనాతనధర్మం ఎంత ప్రమాదంలో ఉందో, ప్రేక్షకులు అర్థం చేసుకోండి! మన సనాతన ధర్మాన్ని కాపాడండి! అంటూ ఆంకర్‌ కన్నీళ్లు తుడుచుకున్నాడు!
”సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఏం చేయాలో సెల వివ్వండి స్వామీ!” అన్నాడొక యాంకర్‌ కడుభక్తితో…
”మీరంతా అఘోరీలుగా మారండి!” అన్నాడు అఘోరి.
అందరూ అదిరిపడ్డారు!
”ఏమిటి స్వామి మీరు చెబుతున్నదీ!” అని అడిగారు.
”అవును మీరు కూడా అఘోరీలుగా మారండి! అప్పుడే సనాతన ధర్మం నిలబడుతుంది!” అన్నాడు అఘోరి.
అందరూ కిమ్మనకుండా ఉండిపోయారు.
”స్వామీ మీకు బోలెడు శక్తులు ఉంటాయి గదా! పొద్దుటి నుండీ మా నానిగాడు కనబడటం లేదు! ఎక్కడున్నాడో అంజ నం వేయండి స్వామీ!” అంటూ అఘోరి ముందు మురళీ, వాణి మోకరిల్లారు!
”ఆ అఘోరీనే మీ నానిగాడు”. అంటూ వెనకనుండి విన్పించింది ఒక గొంతు.
మురళి, వాణి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశారు.
నానిగాడి స్కూలు టీచర్‌ లక్ష్మి ఉందక్కడ. లక్ష్మీ టీచర్‌ను చూడగానే అఘోరి అలియాస్‌ నానిగాడు త్రిశూలం కిందపడేసి ఒంటికున్న బూడిద తుడుచుకుంటూ ఇంట్లోకి దౌడుతీశాడు. అఘోరి అలియాస్‌ నానిగాడు ఇంట్లోకి పరుగు పెట్టగానే లైవ్‌ ఆపేసి కెమెరాలు బందు చేశారు.
”అప్పుడు కాదు! ఇప్పుడు పెట్టండి లైవ్‌! పదేండ్ల కుర్రవాడు ఒంటికి బూడిద పూసుకుని వస్తే అఘోరి అయిపోతాడా? అఘోరాకు ఇంత పబ్లిసిటీ ఇస్తారా? ఇంతగా సాగిపడి మొక్క టానికి సిగ్గుగా లేదా? ఆఘోరీలు మనిషి మాంసం తింటుంటే గొప్పగా చూపుతారా? మనిషి మాంసం తినే అఘోరీలు గొప్ప వారు అయినపుడు. మాంసాహారం తినేవారు సనాతన ధర్మాన్ని చెడగొట్టే వారు ఎందుకవుతారు? మనిషి మాంసం తినేవాడు నాగరికత తెలియనివాడు! అలాంటిది మహోన్నత విషయం అన్నట్టు, ఆచరించదగ్గదీ అన్నట్టు చూపుతారా?” తీవ్రంగా ప్రశ్నించింది లక్ష్మి టీచర్‌.
”మా నానిగాడు, అఘోరీ అయ్యాడా! ” ఏడుస్తూ అడిగారు మురళి, వాణి.
”ఇంకా అఘోరి అవలేదు! కానీ, కావాలన్న కోర్కె బలంగా ఏర్పడింది! మీరు ఇంట్లో సనాతన ధర్మం బోధించటం వల్ల, ఇంకా ఈ ఛానళ్లు అఘోరీలను స్టార్లలాగా చూపటం వల్ల, పెద్ద య్యాక డాక్టరై భవిష్యత్‌లో మనుషుల ప్రాణాలు కాపాడాల్సిన వాడికి, మనుషుల్నే పీక్కుతినాలని కోర్కె కలిగిందంటే, దానికి మీరంతా బాధ్యులే! నిన్న నానిగాడి స్కూలు బ్యాగు చెక్‌చేస్తే అందులో చిన్న ఎముకలు కనబడ్డాయి. అఘోరీలు అంటే వాడికిష్టం అని చెప్పుకుంటున్నాడు! ఇప్పటికైనా మీరంతా బాధ్యతతో మెలగండి!” అన్నది లక్ష్మీ టీచర్‌.
– ఉషాకిరణ్‌