జైలు నుంచి భాను కిరణ్‌ విడుదల

– మద్దెల చెరువు సూరి హత్య కేసులో జీవిత ఖైదు
– 12 ఏండ్లుగా జైల్లోనే..
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన.. హైదరాబాద్‌లో 2011లో సంచలనం రేపిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ బుధవారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యాడు. సీఐడీ ఆర్మ్స్‌ యాక్ట్‌ కేసులో భాను కిరణ్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సూరి హత్యకేసులో భాను కిరణ్‌ శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తాను దాదాపుగా 12 ఏండ్ల నుంచి శిక్షను అనుభవిస్తున్నానని, బెయిల్‌ మంజూరు చేయాలని భానుకిరణ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన ధర్మాసనం స్థానిక కోర్టులోనే చూసుకోవాలని స్పష్టం చేసింది. దాంతో అతను నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేయగా.. న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. ఇక భాను కిరణ్‌ జీవిత ఖైదుపై విచారణ నవంబరు 11వ తేదీన కోర్టు ముందుకు రానుంది.