బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి భానుమ‌తి

            నటిగా, గాయనిగా, నర్తకిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా, జ్యోతిష్కురాలుగా, ఇలా వివిధ విభాగాలలో భానుమతి చేసిన కృషి అనితరసాధ్యం… తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా రాణించి, తెలుగు ఖ్యాతిని జాతీయ స్ధాయికి విస్తరింపచేసిన భానుమతి దక్షిణాది నటీమణుల్లో తొలిసారి ‘పద్మశ్రీ’ గౌరవాన్ని అందుకుంది. 1953లో తెలుగులో చండీరాణి చిత్రానికి దర్శకత్వం వహించిన తొలి మహిళగానే కాకుండా ఆ చిత్రాన్ని మూడు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం) తీసి అటువంటి ఫీట్‌ చేసిన మొట్టమొదటి దర్శకురాలిగా ఆమె ఖ్యాతి సంపాదించింది. ఏడు దశాబ్దాలకు పైగా చిత్రరంగంలో భానుమతి తన పలుకుబడిని కొనసాగించిన తీరు అజరామరం. సినీకళామతల్లికి చేసిన సేవలకు గాను భానుమతికి భారత ప్రభుత్వం 1966 లో ‘పద్మశ్రీ’, 2000 వ సంవత్సరం ‘పద్మభూషణ్‌’ పురస్కారాలతో సత్కరించింది. ఇలా వెండి తెరపై చెరగని ముద్ర వేసిన భానుమతి 98వ జయంతి సెప్టెంబర్‌ 7వ తేదీ సందర్భంగా ఆమె బహుముఖ ప్రజ్ఞను స్మరించుకుంటూ నవతెలంగాణ సోపతి పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం. 
భానుమతి 1925వ సంవత్సరం సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత పండితుడు కావడంతో భానుమతి ఆయన వద్దే సంప్రదాయ సంగీతాన్ని, నత్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సమపార్జించింది. ఆ తర్వాత భానుమతి హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యంగా.. తన 13 వ ఏటనే ఇంట్లోని సనాతన కట్టుబాట్లను ఎదిరించి, తండ్రిని ఒప్పించి 1939 లో ‘వరవిక్రయం’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తరువాత వచ్చిన ”కష్ణప్రేమ”, ”స్వర్గసీమ” చిత్రాలు భానుమతి సినీ కెరీర్‌ ను మలుపుతిప్పాయి. ఆ సినిమాలో హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారు ఆమె. చాలా మంది ఆమెకున్న కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజాన్ని అందరు పొగరు అనుకునేవారు. అయినా ఆమె చలించేవారు కారు. భానుమతి అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, నటించిన సినిమాలు వంద వరకే. భానుమతీ రామకష్ణ ”గరుడ గర్వభంగం, తాసీల్దార్‌, స్వర్గసీమ, రత్నమాల, లైలామజ్ఞు, అపూర్వ సహౌదరులు, మల్లీశ్వరి, మంగళ, ప్రేమ, చండీరాణి, చక్రపాణి, విప్రనారాయణ, అగ్గిరాముడు, తెనాలి రామకష్ణ, చింతామణి, నలదమయంతి, వరుడు కావాలి, బాటసారి, బొబ్బిలి యుధ్ధం, వివాహ బంధం, తోడు నీడ, అంతస్తులు, పల్నాటి యుధ్ధం, మట్టిలో మాణిక్యం, గడసరి అత్త సొగసరి కోడలు, మంగమ్మ గారి మనవడు, ముద్దుల మనవరాలు, పెద్దరికం, బామ్మమాట బంగారుబాట పెళ్ళికానుక” తదితర చిత్రాలలో విభిన్న పాత్రలకు జీవం పోసిన ప్రజ్ఞాశాలి.
ఎన్టీఆర్‌ ని మించి క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌
సినీ ఇండిస్టీలో సీనియర్‌ హీరోయిన్‌ భానుమతికి ఏ రేంజ్‌ లో గుర్తింపు వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి పెద్ద వాళ్ళే భానుమతి గురించీ ఎదురు చూసేవారు. అయితే ఈ తరం ప్రేక్షకులు ఈమెను పెద్దగా గుర్తుపట్టరు.. కానీ ముందు తరం ప్రేక్షకులు అయితే వెంటనే గుర్తుపట్టేస్తారు. 1925 సెప్టెంబర్‌ 7న ప్రకాశం జిల్లా ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించింది. తండ్రి స్ఫూర్తి తోనే సాంప్రదాయ సంగీతాన్ని , నృత్యాన్ని నేర్చుకొని అపార సంగీత జ్ఞానాన్ని సంపాదించుకున్న ఈమె 1939లో మొదటిసారిగా వరవిక్రయం అనే సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన విష్ణు ప్రియ, స్వర్గసీమ లాంటి సినిమాలో ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయి. దాంతో ఆమె మళ్ళీ తన కెరియర్‌ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. భానుమతి రామకృష్ణ కేవలం నటి మాత్రమే కాదు సింగర్‌, దర్శకురాలు, నిర్మాత, రచయిత, సంగీత దర్శకురాలు, స్టూడియో యజమానురాలు కూడా.. ఇన్ని రంగాలలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది భానుమతి ముఖ్యంగా అప్పట్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ , ఎస్వీఆర్లతో సమానంగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకుంది. అంతేకాదు ఎన్టీఆర్‌ కంటే ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకుంది.
శివాజీగణేశన్‌ కు అభిమాన నటి
ఉత్తమ భారతీయ సినీ కళాకారుడుగా ఫ్రెంచి ప్రభుత్వపు విశిష్ట పురస్కారం ‘షెవాలియర్‌’ సత్కారాన్ని అందుకున్న తొలి ప్రముఖుడు సత్యజిత్‌ రారు అయితే రెండవ ప్రముఖుడు ప్రసిద్ధ నటుడు శివాజీ గణేశన్‌. (ఆ తర్వాత ఇటీవలే కమల్‌ హసన్‌ కూడా ఆ గౌరవాన్ని పొందారు) శివాజీ గణేశన్‌ చిత్రరంగంలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో భానుమతి నటించిన ‘స్వర్గసీమ’ను దాదాపు 16సార్లు చూసినట్లు ఆమె తన అభిమాన నటి అని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. అలాంటి భానుమతితో నాయకుడుగా నటించే అవకాశం శివాజీ గణేశన్‌ కు ‘కల్వనిన్‌ కాదలి’ అనే తమిళ చిత్రంలో లభించింది. ఆ తర్వాత ”మక్కలై పెట్ర మహరాశి, రంగూన్‌ రాధ, తెనాలి రామన్‌” మొదలైన చిత్రాలలో కలిసి నటించాడు. ‘రంగూన్‌ రాధ’ చిత్ర విజయోత్సవ సభలో ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి సి.ఎన్‌. అన్నాదురై బానుమతి నటనను ప్రశంసిస్తూ ఆమెను ‘నడిప్పుక్కొరు ఇలక్కణం’గా అభివర్ణించగా, అదే ఆ తర్వాత తమిళ నాట భానుమతికి ఓ బిరుదుగా మారింది.
ఎంజిఆర్‌తో నాయికగా..
భానుమతి, ఎంజిఆర్‌ నాయికా నాయకులుగా నటించిన ‘అలీబాబా నా పది తిరుడర్గళ్‌’ 1956లో విడుదల కాగా, అంతకు ముందు 1954లో భానుమతి ఎన్టీఆర్‌ సరసన నటించిన ‘అగ్గిరాముడు’ చిత్రాన్ని ‘మలైకళ్లన్‌’ పేరుతో తమిళంలో పునర్నిర్మించగా ఈ చిత్రంలో ఎంజిఆర్‌కు జంటగా భానుమతి నటించింది. ఈ చిత్రాలేకాక ఆ తర్వాత ఎంజిఆర్‌తో నటించిన దాదాపు అన్ని చిత్రాలూ ఘన విజయం సాధించాయి. ఇలా ఇద్దరు తమిళ అగ్ర హీరోల సరసన విభిన్న తరహా పాత్రలు ధరించి, రాణించిన భానుమతి తమిళ ప్రేక్షక హదయాల్లో ఓ ప్రత్యేక స్ధానాన్ని పొందారు.
బాలకష్ణతో బంధం
యన్టీఆర్‌ ‘తాతమ్మకల’లో బాలకృష్ణకు తాతమ్మగా నటించిన భానుమతి ఆ తర్వాత ‘మంగమ్మగారి మనవడు’లో బాలయ్యకి నాన్నమ్మగా నటించింది. బాలకృష్ణకు తొలి సినిమానే కాకుండా కెరీర్‌లో తొలి విజయంగా నిలిచిన ఈ సినిమాలో బానుమతి కీలక పాత్ర పోషించడం విశేషం. అలా నందమూరి కుటుంబంతో భానుమతికి మంచి అనుబంధం ఏర్పడింది. బాలకృష్ణతో ఎస్‌.గోపాల్‌ రెడ్డి నిర్మించిన భారీ జానపదలో కూడా భానుమతి కీలక పాత్ర పోషించింది. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పూర్తి కాలేదు.
భానుమతికి హిందీ చిత్రాలు
భానుమతి హిందీలో ‘రాణి’, షంషేర్‌, నిషాన్‌, మంగళ, చండీరాణి” చిత్రాల్లో నటించారు. మంగళ, నిషాన్‌ చిత్రాలను జెమిని సంస్ధ నిర్మించింది. ఈ చిత్రాలలో గీతాధర్‌, షంషాద్‌ బేగం భానుమతికి గాత్రదానం చేయడం విశషం. మంగళ సినిమా తెలుగు, హిందీ భాషల్లో తయారైంది. అందుకు గాను ఆ రోజుల్లోనే భానుమతి అందుకున్న పారితోషికం లక్ష రూపాయలు. ‘కార్సికన్‌ బ్రదర్స్‌’ అనే నవల ఆధారంగా నిషాన్‌ చిత్రం రూపొందగా, తెలుగులో ‘అపూర్వ సహ్నదరులు’ పేరుతో విడుదలైంది. తెలుగులో ఎంకె రాధా హీరో. హిందీలో రంజన్‌ నాయక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో భానుమతి పలు భాషలు కలిపి పాడిన ‘లడ్డు.. లడ్డు..’ పాట ఆరోజుల్లో ‘స్వర్గసీమ’ లోని ‘పావురమా’ పాటలాగే సూపర్‌ హిట్‌ అయింది. బాంబే టాకీస్‌ బ్యానర్‌ పై వచ్చిన ‘షంషేర్‌’ చిత్రంలో భానుమతి అశోక్‌ కుమార్‌ సరసన నాయికగా నటించింది. ‘శాంసన్‌ అండ్‌ డివైలా’ అనే హాలీవుడ్‌ చిత్రం స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రానికి జ్ఞాన ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రంలో నాయిక పాటలను భానుమతి చేతే పాడించడమా లేక లతామంగేష్కర్‌ పాడడమా అనే విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. అయితే దర్శకుడు భానుమతి పాడితేనే బాగుంటుందని తీర్మానించడంతో ఆ చిత్రంలో తన పాత్రకు పాటలన్నీ తానే పాడింది. భానుమతి మరో నటికి ప్లేబ్యాక్‌ పాడడం కూడా విశేషమే. ‘చండీరాణి’ హిందీ వెర్షన్‌ లో ఓ పాట ఉంది. ఆ చిత్రంలో ఎస్విఆర్‌కు ఉంపుడుగత్తెగా విద్యావతి (నేటి తమిళనాడు ముఖ్యమంత్రి, నాటి ప్రముఖ నటి జయలలిత తల్లిగారైన నటీమణి సంధ్యకు సోదరి) నటించారు. ఆమెపై చిత్రీకరించాల్సిన పాటను మొదట లతా మంగేష్కర్‌ చేత పాడించాలనుకున్నారట. కానీ తప్పనిసరి పరిస్ధితుల్లో ఆ పాటను భానుమతే పాడాల్సి వచ్చింది.
గాయనిగా..
నటిగానే కాకుండా గాయనిగానూ భానుమతి బాణీ విలక్షణమైనది… ఆమె గానం నిజంగానే తెలుగువారి మనసుల్లో మల్లెల మాలలు ఊగించి.. వెన్నెల డోలల్లో తేలియాడించింది… భానుమతి గాత్రంలో జాలువారిన గానం వింటూ వుంటే ఎంత హాయి!.. వయసు పెరిగినా భానుమతి గాత్రంలో ఏ మాత్రం తొణుకు బెణుకూ కనిపించలేదు… తరాలు మారినా, తన గానంలోని మాధుర్యం ఏమి తరగలేదని నిరూపిస్తూ భానుమతి నటిగా, గాయనిగా కొనసాగింది. మాతభాష తెలుగులోనే కాదు, ఏ భాషలోనైనా, అభినయంతో పాటు గానంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. నవతరం నటీమణులతో పోటీపడటంలోనే కాకుండా… గాయనీమణులకూ దీటుగా పాటలు పాడింది. ఎస్‌.వరలక్ష్మి, పి.లీల, పి.సుశీల, లతామంగేష్కర్‌ లను భానుమతి విశేషంగా అభిమానించేది. గాయనిగా భానుమతి ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్‌ నిశితంగా గమనిస్తూ, తదనుగుణంగా వ్యవహరించేది. అందువల్లే ‘పత్తుమాద బంధం’ అనే తమిళ చిత్రంలో ఓ ఆంగ్ల గీతాన్ని ‘ఉషాఉతప్‌’ తో కలిసి సమర్ధంగా పాడి శ్రోతల ప్రశంసలను పొందింది. అలాగే ‘తోడు నీడ’లో ఆమె పాడిన ఆంగ్ల గీతం ‘వెన్‌ ఐ వాజ్‌ జస్ట్‌ ఎ లిటిల్‌ గర్ల్‌.. ఐ ఆస్క్డ్‌ మై మదర్‌.. విల్‌ ఐ బి ప్రెటీ, విల్‌ ఐ బి రిచ్‌’ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
దర్శకురాలిగా..
భానుమతి తన సినీ కెరీర్‌ లో దాదాపు పదిహేను తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించింది. 1953 లో చండీరాణి, 1967 లో గృహలక్ష్మి,1972 లో అంతా మన మంచికే, 1973 లో విచిత్ర వివాహం, 1974 లో అమ్మాయిపెళ్ళి, 1975 లో ఇప్పడియుమ్‌ ఒరు పెన్‌ (తమిళం), 1976 లో వాంగ సంభందీ వాంగ (తమిళం), 1977 లో మనవడి కోసం, 1980 లో రచయిత్రి, ఒకనాటి రాత్రి, 1982 లో భక్త ధృవ మార్కండేయ-2,1992 లో భక్త ధృవ మార్కండేయ-1, పెరియమ్మ (తమిళం) 1993లో అసాధ్యురాలు చిత్రాలు ఉన్నాయి.
నిర్మాతగా..
రామకష్ణలాంటి భర్త దొరకడంతో, కొడకు భరణిపేరుతో రామకృష్ణ దర్శకత్వంలో చిత్రనిర్మాణం ఆరంభించి ‘రత్నమాల’, ‘లైలామజ్ను’, ‘ప్రేమ’, ‘చండీరాణి’, ‘చక్రపాణి’, ‘విప్రనారాయణ’, ‘చింతామణి’, ‘వరుడుకావాలి’, ‘బాటసారి’, ‘వివాహబంధం’, ‘గృహలక్ష్మి’, ‘అంతా మనమంచికే’, ‘విచిత్ర వివాహం’, ‘అమ్మాయిపెళ్లి’, ‘మనవడికోసం’ ‘రచయిత్రి’, ‘ఒకనాటి రాత్రి’ ‘భక్త ధ్రువ-మార్కండేయ’ మొదలైన చిత్రాలు నిర్మించారు. విశేషం ఏమిటంటే, ‘చండీరాణి’ని మూడు భాషల్లో నిర్మించారు. భానుమతే డైరెక్టు చేశారు. అలా తెలుగులో మొదటి దర్శకురాలుగా పేరు తెచ్చుకున్నారు.
సంగీత దర్శకురాలిగా..
భానుమతి 1952 లో ప్రేమ (కథ), 1954 లో చక్రపాణి, 1956 లో అత్తగారి కథలు ఆమె రచనలు. చింతామణి చిత్రాలకు సంగీత దర్శకురాలిగా వ్యవహరించారు.
జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో అనుభవం
జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో భానుమతికి మంచి అనుభవం ఉందన్న సంగతి కొద్ది మందికే తెలుసు.1950 ప్రాంతాల్లోనే ఆమె నాడీ గ్రందాల మీద పరిశోధన చేసారంటే ఈనాడు చాలామంది నమ్మలేరు. కానీ అది సత్యం. ఎమ్జీ ఆర్‌ కు రాజపరిపాలనాయోగం ఉందని ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఇరవై ఏళ్ల ముందే షూటింగ్‌ విరామ సమయంలో చేతి రేఖలు చూచి చెప్పిన సాముద్రిక వేత్త భానుమతి. ఆ సంగతి ఆమె మరచి పోయినా, తాను ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్జీ ఆర్‌ ఆమెకు గుర్తు చేసారట. అంతేకాకుండా భానుమతి శ్రీ విద్యోపాసకురాలనీ బాలా, నవాక్షరీ మంత్రాలను శృంగేరి శంకరాచార్యులూ మహా తపస్వులూ అయిన అభినవ విద్యాతీర్థస్వామి వారి నుంచి ఉపదేశం పొంది నిత్యమూ లలితా సహస్ర నామాలతో శ్రీ చక్రాన్ని అర్చించి సప్తశతీ పారాయణ చేసేవారు.
భానుమతి రచనలు
”అత్తగారి కధలు” ఈ రచనకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘నాలో నేను’ రచనకు జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ గ్రంధంగా ఎంపికయ్యి ‘స్వర్ణకమలం’ పురస్కారం పొందింది. ఆ తర్వాత ఆ గ్రంధం మ్యూజింగ్స్‌ పేరుతో, ఆంగ్లంలోకి అనువదితమైంది అత్తగారూ, నక్సలైట్లూ, భానుమతి కథానికలు తో పాటు చందమామ పత్రికలో పాపాయిల కోసం ‘ఓ బుజ్జిగీతం’ రాసింది.
తోటి నటులను అభిమానించే భానుమతి
భానుమతికి స్వాతిశయం ఎక్కువనీ, ఇతరుల ప్రతిభను ఆమె ప్రశంసించడం చాలా అరుదనీ చాలా మంది అనుకుంటారు. కానీ, అది నిజంకాదు. ఆమె కాంచనమాల, పుష్పవల్లి నటనను విశేషంగా అభిమానించేది. ఎవిఎం నిర్మించిన ‘అన్నై’ చిత్రంలో షావుకారు జానకితో ‘ఢ అంటే ఢ’ అనదగ్గ పాత్రల్లో ఇద్దరూ పోటీపడి నటించారు. భానుమతి నిర్మించిన ‘బాటసారి’ చిత్రంలో షావుకారు జానకి కథానాయకుడు అక్కినేని భార్యగా అద్బుతంగా నటించారని కితాబు ఇచ్చి, జానకి తను ధరించే పాత్ర ఎటువంటిదైనా ఆ పాత్రకు జీవం పోసి, గొప్పగా మెప్పించగల నటిగా నేనెప్పుడూ జానకిని అభిమానిస్తానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం. ఎవిఎం ‘బామ్మమాట బంగారుబాట’కు మూలమైన తమిళ చిత్రంలో ప్రముఖ హాస్యనటి మనోరమ నటించగా, తెలుగు వెర్షన్‌ లో ఆ పాత్రలో భానుమతి నటించినా, తను మనోరమ స్ధాయిలో నటించలేకపోయానంటూ ఆ భావాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. ‘తెలుగులో కూడా మనోరమే చేసి ఉంటే బావుండేది’ అని భానుమతి అన్నమాట గురించి విన్న మరోరమకు ‘భానుమతి అంతటి నటీమణి అలా అనడమా’ అని ఆమె విశాల హృదయానికి, ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారట! విజయా సంస్థ నిర్మించిన ‘మిస్సమ్మ’ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే ఎంపిక చేసుకున్నారు. అయితే కారణాంతరాల వల్ల ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంఘటన గురించి భానుమతి ప్రస్తావిస్తూ, ”నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది” అని సంతోషించారట.
కుటుంబం
కృష్ణప్రేమ షూటింగ్‌ లో తొలిసారిగా ఆ చిత్రానికి పనిచేస్తున్న అసోసియేట్‌ డైరక్టర్‌ రామకృష్ణతో ప్రేమలో పడ్డ భానుమతి పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేసింది. అయితే వీరి పెళ్ళికి భానుమతి తండ్రి అంగీకరించలేదు. తండ్రి ఈ పెళ్ళిని వ్యతిరేకించడంతో మనస్తాపానికి గురైన భానుమతి గౌరీదేవి పటం ముందు అన్నం తినడం మానేసి మౌనంగా కూర్చొని రోదించిన విషయం చాలా మందికి తెలియదు. తాను అనుకున్నది సాదించుకోవడం భానుమతికి తెలిసినంతంగా మరెవరికి తెయదు. పదిహేను రోజులకే భానుమతి దీక్ష పలించి, 1943వ సంవత్సరం ఆగష్టు 8వ తేదీన రామకృష్ణారావును వివాహం చేసుకుంది. అలా ఒక్కటైన వీరికి ఏకైక కుమారుడు భరణి జన్మించాడు. భానుమతి కుమారుడి పేరు మీదనే ‘భరణి’ సంస్థను స్థాపించి అనేక అపూర్వ చిత్రాలను నిర్మించారు.
పురస్కారాలు
భానుమతి తెలుగులో వచ్చిన ‘అంతస్తులు, పల్నాటి యుద్ధం’, తమిళం లో వచ్చిన ‘అన్నై’ సినిమాలకు మూడు జాతీయ అవార్డులు అందుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై భానుమతి ని ”నడిప్పుకు ఇళక్కనం” బిరుదును ఇచ్చి గౌరవించాడు.
1956లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము
1966లో భానుమతి వ్రాసిన ”అత్తగారి కథలు” అనే హాస్యకథల సంపుటికిగాను ”పద్మశ్రీ” పురస్కారంతో భారత ప్రభుత్వము సత్కరించింది. ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ‘డాక్టరేటు కళా ప్రపూర్ణ’ ఇచ్చి సత్కరించింది.
1984లో ‘కలైమామణి’ బిరుదుతో తమిళనాడు లోని ఐయ్యల్‌ నాటక మన్రము సత్కరించింది.
1984లో ‘బహుకళా ధీరతి శ్రీమతి” అను బిరుదుతో లయన్స్‌ క్లబ్బు సత్కరించింది.
1984లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
1986లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను ఇచ్చింది.
1986లో ఉత్తమ దర్శకురాలిగా నంది అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.
2000 లో భారత ప్రభుత్వం సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించి ”పద్మవిభూషణ్‌” పురస్కారాన్ని అందచేసింది.
2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా భానుమతి పేరున భారత ప్రభుత్వం తపాలాబిళ్ళను విడుదల చేసింది.

-పొన్నం రవిచంద్ర, 9440077499