భారత్‌, బంగ్లా పోరు..ఉప్పల్‌ స్టేడియంలో!

భారత్‌, బంగ్లా పోరు..ఉప్పల్‌ స్టేడియంలో!– టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్‌
– బీసీసీఐ స్వదేశీ సీజన్‌ షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలుగు క్రికెట్‌ అభిమానులకు మరో తీపి కబురు. టెస్టు మ్యాచ్‌, ఐపీఎల్‌ వినోదం ఆస్వాదించిన క్రికెట్‌ ప్రియులు ఈ ఏడాది మరో ధనాధన్‌ ధమాకా అందుకోనున్నారు!. భారత్‌, బంగ్లాదేశ్‌ టీ20 మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వేదిక కానుంది. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం 2024-25 స్వదేశీ సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత స్వదేశీ సీజన్‌ ఆరంభం కానుంది. భారత పర్యటనకు రానున్న బంగ్లాదేశ్‌ ఇక్కడ రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ టెస్టులకు చెన్నై, కాన్పూర్‌ వేదిక కానున్నాయి. సెప్టెంబర్‌ 19-23 వరకు చెన్నై టెస్టు, సెప్టెంబర్‌ 27-అక్టోబర్‌ 1 వరకు కాన్పూర్‌ టెస్టు జరుగనున్నాయి. టీ20 సిరీస్‌కు వరుసగా ధర్మశాల, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్టోబర్‌ 12న హైదరాబాద్‌లో భారత్‌, బంగ్లాదేశ్‌ చివరి టీ20 మ్యాచ్‌లో ఢకొీట్టనున్నాయి. ఇక అక్టోబర్‌లో భారత్‌కు రానున్న న్యూజిలాండ్‌ మూడు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది. బెంగళూర్‌, పుణె, ముంబయి కివీస్‌తో మూడు టెస్టులకు వేదికలుగా నిలువనున్నాయి. 2025లో ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. ఇక్కడ ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. చెన్నై, కోల్‌కత, రాజ్‌కోట్‌, పుణె, ముంబయిలు టీ20 సిరీస్‌లో ఐదు మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. మూడు వన్డేలకు వరుసగా నాగ్‌పూర్‌, కటక్‌, అహ్మదాబాద్‌లు వేదికగా నిలువనున్నాయి.