ప్రారంభమైన భారత్‌ గౌరవ్‌ రైల్‌

– ప్రయాణీకులకు స్వాగతం పలికిన జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మొదటి భారత్‌ గౌరవ్‌ రైలు శనివారం ప్రారంభమైంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ ప్రయాణీకులను సంప్రదాయబద్ధంగా సాదర ఆహ్వానం పలికి, స్వాగత కిట్‌లను అందచేశారు. ఈ సందర్భంగా రైలును, రైల్వేస్టేషన్‌ను సుందరంగా ముస్తాబు చేశారు. రైలు ప్రారంభానికి ముందు సంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌తో పాటు కాజీపేట, ఖమ్మం రైల్వే స్టేషన్లలోని ప్రయాణీకులకూ సాదర స్వాగతం లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అన్ని స్టాపింగ్‌ స్టేషన్లలో వంద శాతం యాత్రీకులతో రైలు నిండిపోయింది. ఐఆర్‌సిటిసి చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజనీ హసిజా తదితరులు ప్రయాణీకులకు స్వాగతం పలికారు. ”పుణ్య క్షేత్ర యాత్ర: పూరి – కాశి – అయోధ్య” పేరుతో ఈ పర్యాటక రైలును ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సిటిసి) నిర్వహిస్తున్నది. రైలు, రోడ్డు రవాణాతో సహా, వసతి సౌకర్యం, క్యాటరింగ్‌ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, మద్యాహ్నం, రాత్రి భోజనం సమకూరుస్తారు. ఈ పర్యటనలో పూరీ, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలను 8 రాత్రులు / 9 పగలు వ్యవధిలో సందర్శించడం జరుగుతుంది. రైలు ప్రయాణీకుల డిమాండ్లకు అనుగుణంగా ఏసీ, నాన్‌-ఏసీ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జాన్‌ప్రసాద్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ అభరు కుమార్‌ గుప్తా, జిజిఎం ఐఆర్‌సిటిసి పి రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.