– పాఠ్య పుస్తకాల్లో దేశం పేరు మార్పు
– విద్యార్థులకు ఇండియా బదులు భారత్ అనే బోధించాలి
– భారత్ ప్రస్తావన విష్ణుపురాణంలోనే ఉన్నది: ఎన్సీఆర్టీ
– ‘హిందూ ఓటముల’ ప్రస్తావన వద్దని సిఫారసు
జీ..20 సమావేశాల్లో ప్రధాని మోడీ ఇండియాకు బదులుగా భారత్ అని బోర్డు పెట్టుకోవడం, రాష్ట్రపతి ఆహ్వానాల్లో సైతం భారత్ అని ముద్రించడంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అదలా ఉండగానే.. ఇపుడు పాఠ్యపుస్తకాల్లోనూ ఇండియాకు బదులుగా భారత్ ను జోప్పించే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తమ అనుకూలగణంతో ఏర్పాటు చేసుకున్న ఎన్సీఆర్టీ కమిటీ హిందూయిజాన్ని విద్యాబోధన రూపంలో బలవంతంగా రుద్దే ప్రయత్నాలకు దిగుతోంది. పాఠ్యపుస్తకాలు మొదలుకుని సమస్త చదువుల్లోనూ చరిత్రను చెరిపే కుట్రలు జరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ: పాఠ్య పుస్తకాల్లో మన దేశం పేరు ఇకపై ‘ఇండియా’ కాదు. ‘భారత్’ అనే ఉంటుంది. ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూలు స్థాయి వరకూ అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలలోనూ దేశం పేరును భారత్ అనే ముద్రిస్తారు. పాఠ్య ప్రణాళికను సవరించేందుకు ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫారసు చేసిందని ఆ సంస్థ ఛైర్మన్ ప్రొఫెసర్ సీఐ ఇస్సాక్ (రిటైర్డ్) తెలిపారు. ఇస్సాక్ ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతవేత్త కూడా. పాఠ్య ప్రణాళికలో ‘హిందూ ఓటముల’పై పెద్దగా దృష్టి సారించకూడదని కూడా కమిటీ సూచించిందని ఇస్సాక్ తెలిపారు. ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏకగ్రీవంగా సిఫారసులు చేసిందని ఆయన చెప్పారు. జీ-20 సదస్సుకు హాజరైన అతిథులను విందుకు ఆహ్వానిస్తూ గత నెల ఐదవ తేదీన కేంద్ర ప్రభుత్వం పంపిన సందేశంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై జరిగిన చర్చకు ఎన్సీఈఆర్టీ కమిటీ సిఫార్సు ఓ కొత్త కోణాన్ని చేర్చింది. జీ-20 అతిథులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపడానికి నాలుగు రోజుల ముందు ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఓ వ్యాఖ్య చేస్తూ ప్రజలు ఇండియాకు బదులు భారత్ అనే పదాన్ని ఉపయోగించాలని సూచించారు. పాఠ్య పుస్తకాల్లో పాఠశాల విద్యార్థులకు ఇండియా బదులు భారత్ అనే పదాన్నే బోధించాలని కమిటీ ప్రత్యేకంగా సిఫారసు చేసిందని ఇస్సాక్ తెలిపారు. ‘భారత్ అనే పేరును విష్ణు పురాణంలో ప్రస్తావించారు. కాళిదాసు కూడా భారత్ అనే మాటను ఉపయోగించారు. అది పురాతన పేరు. తుర్కులు, ఆఫ్ఘన్లు, గ్రీకుల దాడి తర్వాత ఇండియా అనే పేరు వాడారు. సింధు నది ఆధారంగా వారు భారత్‌ను గుర్తించారు. ఆ పదం అనువుగా ఉంటుందని ఆక్రమణదారులు భావించారు. 12వ తరగతి వరకూ మాత్రమే పాఠ్య పుస్తకాల్లో భారత్ అనే పేరును ఉపయోగించాలని నేను గట్టిగా చెప్పాను. ఇతర సభ్యులు దీనికి అంగీకరించారు. ఇది కమిటీ ఏకగ్రీవ అభిప్రాయం’ అని వివరించారు. యుద్ధాలలో హిందూ ఓటములపై ప్రస్తుత పాఠ్య ప్రణాళిక మరీ ఎక్కువ దృష్టి పెట్టిందని కమిటీ అభిప్రాయపడిందని ఇస్సాక్ చెప్పారు. ‘దీనికి భిన్నంగా హిందూ విజయాలను ప్రస్తావించలేదు. మన దేశాన్ని దోచుకున్న తర్వాత మహమ్మద్ ఘోరీ స్వదేశానికి వెళుతుండగా ఆయన్ని గిరిజనులు హతమార్చారు. ఈ విషయాన్ని మన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఎందుకు బోధించవు? ట్రావెన్‌కోర్ రాజ్యం, ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగిన కోలాచల్ యుద్ధం గురించి మన పాఠ్య పుస్తకాల్లో ఎందుకు లేదు? అత్యవసర పరిస్థితి కాలాన్ని గురించి వివరంగా ఎందుకు బోధించరు?’ అని ఆయన ప్రశ్నించారు. దేశ చరిత్రను పురాతన, మధ్య, ఆధునిక కాలాలుగా వర్గీకరించడాన్ని తొలగించాలని కూడా కమిటీ సిఫారసు చేసింది.
ఎవరీ ఇస్సాక్?
ఇస్సాక్ కేంద్ర విద్యా శాఖకు చెందిన భారతీయ చారిత్రక పరిశోధనా మండలిలో సభ్యుడు. కొట్టాయంలోని సీఎంఎస్ కాలేజీలో చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1975లో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఏబీవీపీలో చేరారు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధమున్న భారతీయ విచార కేంద్రం కేరళ రాష్ట్ర విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తు న్నారు. కమిటీ సభ్యుడైన జేఎన్‌యూ ప్రొఫెసర్ వందనా మిశ్రా గతంలో ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శిగా, ఆ సంస్థకు జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.