త్వరలోనే భారత్‌ జోడో యాత్ర 2.0..!

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు పాదయాత్ర చేసిన ఆయన.. ఇప్పుడు రెండో విడతకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ‘యాత్ర 2.0’ మొదలుకానుందని కాంగ్రెస్‌ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌ జోడో యాత్ర నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ హెడ్‌ దిగ్విజరు సింగ్‌.. రెండో విడత యాత్ర కోసం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. గత వారం నుంచి పలువురు పార్టీ కీలక నేతలతో యాత్ర గురించి ఆయన చర్చలు జరుపుతున్నారు. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. యాత్ర 2 ప్రారంభ తేదీ, రూట్‌మ్యాప్‌ మీద ఇంకా చర్చలు జరపాల్సి ఉందని ఏఐసీసీ మెంబర్‌ ఒకరు చెబుతున్నారు. భారత్‌ జోడో యాత్ర 2022 సెప్టెంబర్‌ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమై.. 2023 జనవరి 30న శ్రీనగర్‌తో ముగిసింది. యాత్రను ప్రారంభించడానికి ముందు అహ్మదాబాద్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించారు. దీంతో గాంధీ జన్మస్థలమైన పోర్‌బందర్‌ నుంచి రెండో విడత యాత్ర మొదలుపెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. పోర్‌బందర్‌ నుంచి పలు రాష్ట్రాల గుండా అగర్తలాతో యాత్ర ముగిసేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని భావిస్తోంది.