భారత్‌ న్యాయ యాత్ర

Bharat Nyaya Yatra– 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6,200 కిలో మీటర్లు
– మణిపూర్‌ టూ ముంబయి
– జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్‌ పాదయాత్ర
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి యాత్ర చేపట్టనున్నారు. ఈసారి ‘భారత్‌ న్యాయ యాత్ర’ పేరిట ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ నుంచి ప్రారంభించి పశ్చిమ తీరం వరకూ యాత్ర సాగనుంది. జనవరి 14న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. మార్చి 20న ముంబయిలో ముగియనుంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా 6,200 కిలో మీటర్లు సాగనున్న ఈ యాత్రను రాహుల్‌ గాంధీ వినూత్న తరహాలో నిర్వహించనున్నారు. బస్‌ ద్వారా, అక్కడక్కడా కాలినడకన రాహుల్‌ భారత్‌ న్యాయ యాత్ర సాగనుంది. ఇది రాజకీయ యాత్ర కాదని, రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదని ఏఐసీసీ ఆర్గనైజేషన్‌ ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌, కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ తెలిపారు. దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం ఈ యాత్ర సాగుతుందని అన్నారు. డిసెంబర్‌ 21 న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం రాహుల్‌ గాంధీ రెండో దశ యాత్ర జరుగుతుందని తెలిపారు. మణిపూర్‌ ప్రజల గాయాలను నయం చేసే ప్రక్రియలో భాగంగా ఈ యాత్ర ప్రారంభించాలని ఆయన అన్నారు.
మొదటి దశలో రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 12 రాష్ట్రాలను కవర్‌ చేస్తూ దాదాపు 4,500 కిలోమీటర్లు ప్రయాణించగా, ఈసారి 14 రాష్ట్రాలను కవర్‌ చేస్తూ 6,200 కిలోమీటర్లు ప్రయాణించనున్నారని తెలిపారు. యాత్ర మణిపూర్‌, నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో సాగనుందన్నారు. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ ఆర్థిక అసమానతలు, మతోన్మాదం, నియంతత్వం వంటి అంశాలను లేవనెత్తగా, న్యాయ యాత్ర దేశ ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై దృష్టిసారిస్తుందని తెలిపారు.భారత్‌ జోడో యాత్రతో ఐక్యత, ప్రేమ, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేసిన రాహుల్‌ గాంధీ ఈ యాత్ర ద్వారా దేశ ప్రజలకు న్యాయం కోరుతారని అన్నారు. ఈ యాత్రలో ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా) పార్టీలు కూడా పాల్గొంటాయా అనే ప్రశ్నకు వేణుగోపాల్‌ సమాధానమిస్తూ, తుది వివరాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఆ యాత్రలో పాల్గొన్నారని గుర్తు చేశారు.