నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
సామాజిక న్యాయం కోసం, సమసమాజ నిర్మాణం కోసం, స్త్రీ విద్య కోసం అహర్నిశలు కృషిచేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే, భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే దంపతుల సేవల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మాలి మహా సంఘం క్రియాశీల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించిన తీర్మానాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతిబాపూలే వర్ధంతి జయంతులను అధికారికంగా జరపడం ప్రారంభించి నిర్వహిస్తూ వచ్చిందని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కేవలం జ్యోతిబా ఫూలే జయంతిని మాత్రమే అధికారికంగా నిర్వహించి వర్ధంతిని నిర్వహించడం నిలిపివేసిందని అన్నారు. ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి నవంబర్ 28న జరిగే ఫూలే వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. అలాగే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి జనవరి 3 ను అధికారికంగా నిర్వహించాలని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 250 గ్రామాల్లో నివసిస్తున్న మాలి కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించి టికెట్లు కేటాయించి వాళ్ళ గెలుపుకు కృషిచేసి మాలీలకు రాజకీయ స్థానం కల్పించాలని కోరారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో మాలి కులస్తులు తమ కులం పేరును మాలి అని చెప్పి మాతృభాష మరాఠీ అని రాయించాలని అప్పుడే ఉమ్మడి జిల్లాలో మాలీల సంఖ్యాబలం తెలిసి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మాలీల సామాజిక సమస్యకు పరిష్కార మార్గాలను చూపుతాయని అన్నారు. ఈ సమావేశంలో మాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ గురునులే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునులే, మాలి పటేళ్ల సంఘం జిల్లా అధ్యక్షులు రాగి గంగారం జిల్లా అధ్యక్షులు విజయ్ వాడగురే, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసు షెండే, రామ్ కిషన్ షిండే, కౌడు వాసాకే, దీపక్ మొహూర్లే, కిషన్ పెట్కులే పాల్గొన్నారు.