ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

శతజయంతి వేడుకల్లో చంద్రబాబు డిమాండ్‌
– ఎన్టీఆర్‌ గొప్ప నాయకుడు :ఏచూరీ
– లెజెండరీ యాక్టర్‌:డి.రాజా

– నీతి, నిజాయితీ గలనాయకుడు ఎన్టీఆర్‌ : గవర్నర్‌ దత్తాత్రేయ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
యుగపురుషుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్య మంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అది వచ్చేవరకూ పోరాడు తూనే ఉంటామని స్పష్టంచేశారు. ఇది ఎన్టీఆర్‌ కోసం కాదనీ, దేశం కోసమని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదనీ, ఒక శక్తి అని చెప్పారు. ఆయన ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోతారని వివరించారు. శనివారం హైదరా బాద్‌లోని కేపీహెచ్‌బీలోని కైత్లాపూ ర్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ముందు, ఎన్టీఆర్‌ తర్వాత తెలుగుజాతి పరిస్థితిని నెమరువేసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌ జయం తిసభలు జరుగుతున్నాయనీ, ఇది ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఇది
చరిత్రలో నిలిచిపోతుందని చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. సినిమాల్లో ఆయన పాత్రలు ఇతరులు ఎవరూ చేయలేరని చెప్పారు. భవిష్యత్‌లోనూ అది జరగదనీ, మళ్లీ ఆయనే పుట్టాలని వివరించారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది గొప్ప చరిత్ర అని అన్నారు. తెలుగుజాతీ కోసమే టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో 100 అడుగుల విగ్రహాం ఏర్పాటు చేయడానికి సంకల్పం చేసినందుకు ఉత్సవాల నిర్వహణ కమిటీని అభినందించారు. అమెరికాలో 20వ భాషగా తెలుగుకు గుర్తింపు రావడం ఎన్టీఆరే కారణమని వివరించారు. రాజమండ్రిలో జరిగే మహానాడు అందరూ రావాలని కోరారు. ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లోని అందరి ఇండ్లల్లో ఎన్టీఆర్‌ ఫోటోలు పెట్టుకుని నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్‌ గొప్ప నాయకుడు
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దేశంలో ఎన్టీఆర్‌ గొప్ప రాజకీయనాయకుడని సీపీఐ(ఎం)జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. 1983లో టీడీపీని అధికారంలోకి తెచ్చన ఘనత ఆయనదని చెప్పారు. అప్పుడు నేను విద్యార్థిగా ఉన్నానని అన్నారు. నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మెన్‌గా ఆయన పనిచేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన చరిత్ర ఉందన్నారు. ఆయన పోరాటాల మూలంగా సర్కారీయ కమిషన్‌ వేశారని గుర్తు చేశారు. నటుడిగానేగాక రాజకీయ నాయకుడిగా ప్రమాణాలతో పనిచేశారని అభిప్రాయ పడ్డారు.
లెజెండరీ యాక్టర్‌:డి.రాజా
ఎన్టీఆర్‌ లెజెండరీ యాక్టర్‌ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా చెప్పారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన నటించిన ‘కర్ణన్‌’ సినిమా చూశానని చెప్పారు. రూ. 2కే కిలో బియ్యం పథకాన్ని తెచ్చిన చరిత్ర అయనదని వివరించారు. ఎంతో శ్రమపడితేగానీ యుగపురుషుడు అనిపించుకోలేరని వ్యాఖ్యానించారు.
నీతి, నిజాయితీ గలనాయకుడు ఎన్టీఆర్‌: గవర్నర్‌ దత్తాత్రేయ
నీతి, నిజాయితీకి మారుపేరు ఎన్టీఆర్‌ అని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ, సమయపాలన ఆయన సొంతమని చెప్పారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని గుర్తు చేశారు. రాజ కీయాల్లో శతృత్వం పనికిరాదన్నారు. భేదాభిప్రాయాలు ఉండటం సహజమేనని చెప్పారు. రాజకీయాలు ప్రజల కోసమేనని ఎన్టీఆర్‌ తరచూ చెప్పేవారని వివరించారు.
ఎన్టీఆర్‌తోనే తెలుగుజాతికి గుర్తింపు:పురంధేశ్వరి
యుగపురుషుడు ఎన్టీఆర్‌తోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాజకీయాల్లో చెరగని ముద్రను వేశారని గుర్తు చేశారు. పరిపాలన వ్యవస్థను ప్రజలకు చేరువ చేశారని చెప్పారు. బియ్యం పథకం, ప్రాజెక్టులను సైతం నిర్మించారని వివరించారు.
రిజర్వేషన్లకు అధ్యుడు ఎన్టీఆర్‌: కాసాని
బీసీలకు రిజర్వేషన్లకు తెచ్చిన మహానాయుడుఎన్టీఆర్‌ అని టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వన్‌ అన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున పార్టీని స్థాపించారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేశాడని చెప్పారు.కేవలం తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తెచ్చాడని వివరించారు.
జీరో కరెష్షన్‌తో ప్రభుత్వాన్ని నడిపారు. చంద్రబాబ విజన్‌, ఎన్టీఆర్‌ దార్శనికత తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిందన్నారు. ఐటీ పార్కులు, అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు చంద్రబాబు తోనే వచ్చాయని వివరించారు. సూర్య,చంద్రులున్నంత కాలం ప్రజలు గుర్తు చేసుకుంటారని చెప్పారు.
బాలయ్య…
వేదికపై అటూ, ఇటూ తిరుగుతూ నందమూరి బాలకృష్ణ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఎన్టీఆర్‌ గురించి అనేక విషయాలు చెప్పారు. ఎన్టీఆర్‌ అందరికి ఆదర్శం. కారణజన్ముడు. సమస్యల పరిష్కారంలో నిలబడ్డాడని ఎన్టీఆర్‌ గురించి చెప్పారు.
ఇలా..
ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు భారీ జనం హాజరయ్యారు. ప్రత్యేక కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లోని కేపిహెచ్‌బీ కైత్లాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయా రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు వచ్చారు. భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఇరువైపులా ఎన్టీఆర్‌ కటౌట్లు కనిపించాయి. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన జయుసుధ, జయప్రద, ప్రభ తదితర హిరోయిన్లకు సన్మానం చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న బిరుదు ఇవ్వాలని మురళీమోహన్‌ డిమాండ్‌ చేశారు.
శక పురుషుడు పుస్తకాన్ని బండారు దత్తాత్రేయ, జైఎన్టీఆర్‌ వెబ్‌సైట్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడిన వారిలో సినీ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేశ్‌, రాంచరణ్‌, సుమంత్‌, నాగచైతన్య, ఆర్‌.నారాయణమూర్తి, జయప్రద, జయసుధ, ప్రభ, అడివి శేషు, శ్రీవీణ, అనిల్‌ రావిపూడి, విశ్వక్‌సేన్‌, అశ్వనీదత్‌, బోయపాటి శ్రీను తదితరులు ఉన్నారు. ఇకపోతే ప్రముఖ మళయాళ నటుడు మోహన్‌లాల్‌ పంపిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు.