– హక్కుల సారధి.. పీడితుల దిక్సూచి
– అంబేద్కర్ ఇజం చెబుతున్నది ఏంటి?
– పాలకులు అవలంబిస్తున్న విధానం సరైనదేనా?
– విగ్రహాలు పెట్టి దండలు వేస్తే లక్ష్యం నెరవేరినట్లేనా?
– దళిత, బహుజనులు ఉద్యమించాల్సి ఉందా..!
– బోధించి.. సమీకరించి..పోరాటం చేయాల్సిన సమయం ఇదేనా..!
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడ్పడే మనుషులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో మహోన్నతుడు అంబేద్కర్. అంబేద్కర్ పేదల పాలిట ఆశాజ్యోతి.. అభాగ్యుల పాలిట భవిష్యత్తు కాంతి. పేద, బడుగు, బలహీనవర్గాల శ్రేయస్సు కోసం, దేశ అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేశారాయన. బాబాసాహెబ్ గా పేరుగాంచిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిసందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక కథనం.
మహనీయులను గుర్తు చేసుకోవడం.. విగ్రహాలు పెట్టుకొని గౌరవించుకోవటం ఎప్పటి నుండో ఉన్న సాంప్రదాయం. దేశంలో అంబేద్కర్ విగ్రహాలు లక్షలాదిగా కనిపిస్తాయి. ఏ ఊరిలో చూసినా ఈ దేశం నడవాల్సిన దారి ఇదేనంటూ అంబేద్కర్ చూపుడువేలు సూటిగా కనిపిస్తుంది. కానీ అక్కడితో సరిపోతుందా? విగ్రహాలు పెట్టి దండలు వేస్తే లక్ష్యం నెరవేరినట్లేనా? అసలు అంబేద్కర్ ను ఎందుకు గుర్తు చేసుకోవాలి? అంబేద్కర్ అవసరం నేటి సమాజానికి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే గాని ఆ మహనీయుని స్ఫూర్తి ఏమిటో అర్థం కాదు. ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి నేడు. ఈరోజు వచ్చిందంటే చాలు దేశమంతటా ఒకటే సందడి కనిపిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం అంటూ సంబరాలు.. కోలహాలం. అన్ని రాజకీయ పార్టీలు ఇదే నామస్మరణలో మునిగి తేలుతాయి. రాజకీయ పార్టీ నేతలు పార్టీ కార్యాలయాల నుండి గల్లీ నుండి ఢిల్లీ వరకు బాబాసాహెబ్ పటాలకు, విగ్రహాలకు దండలు వేయడంలో బిజీబిజీగా ఉంటారు. భక్తిగా దండాలు పెట్టడంలో మునిగి తేలుతారు మంచిదే. కానీ ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత, కోట్లాది ప్రజల విముక్తి ప్రదాత స్ఫూర్తి ప్రదాత. ఈ దేశానికి నిజానికి ఏం కావాలో ఏ విధానాలు అవసరమో దూర దృష్టితో రూపొందించిన దార్శనికుడు. రాజ్యాంగంతో ఈ దేశానికి ఓ మార్గాన్ని చూపిన మేధావి. ఆయనను స్మరించుకోవడం దేశానికి ఇప్పుడున్న పరిస్థితులలో అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా అంబేద్కర్ మాటలు చెప్పుకోవడానికే పరిమితం అవుతున్నారా? లేక ఆయన ఆశయ సాధనకు కూడా మమేకం అవుతున్నారా అనేది అసలు ప్రశ్న. నవభారత నిర్మాణంలో అంబేద్కర్ మార్గమే శరణ్యం. వేల సంఖ్యలో బానిసలుగా బ్రతుకుతున్న కోట్లాది ప్రజల విముక్తిని ఆకాంక్షించాడు. కుల పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని ఆనాడే చెప్పిన అంబేద్కర్.. దేశంలో రావలసిన విప్లవాత్మక మార్పును స్పష్టంగా సూచించాడు. కుల వ్యవస్థను ధ్వంసం కానిది దేశానికి మంచి రోజులు రావన్నాడు. అసలు అంబేద్కర్ ఇజం చెబుతున్నది ఏంటి? వేల ఏళ్లుగా అణిచివేతకు గురైన వర్గాలకు సామాజికంగా ఉన్నత స్థానంలోకి తీసుకువచ్చి సమానత్వం సాధించడం. ఆత్మగౌరవంగా బతకడం.. సమానంగా శ్వాసించడం.. సామాజికంగా.. ఆర్థికంగా.. రాజకీయంగా వివక్షతకు తావులేని అవకాశాలు సాధించడం. మరి ఆ కలలు ఏమయ్యాయి? దేశం ఏ దిశగా పోతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం సహకారం అయ్యిందా అంటే కచ్చితంగా లేదని చెప్పాల్సి ఉంటుంది. బాబాసాహెబ్ కలలు కలలుగానే మిగిలిపోయాయి. దేశంలో కోట్లాదిమంది ప్రజలు ఇంకా అదే కులం పునాదుల మీద నిర్మితమైన సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా అనేక రకాలుగా వివక్షల మధ్య అగచాట్లు పడుతూనే ఉన్నారు.
దశాబ్దాలుగా కేవలం మాటలకే పరిమితమైన రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు జయంతులు వర్ధంతిలు చేస్తున్నాయి. దార్శనికున్ని తమ వాన్ని చేసుకోవడానికి ఆరాటపడుతున్నాయి తప్ప ఆయన ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం ఎప్పుడు చేయడం లేదు. అసలు అంబేద్కర్ ఎజెండా నెరవేరేది ఎప్పుడు. అంబేద్కర్ కు నిజమైన వారసులు ఎవరు? ఆయన ఆశయాలు సాధించే సత్తా ఎవరికి ఉంది. కల్లబొల్లి కబుర్లతో కాలం గడపకుండా ఈ దేశ స్వరూపాన్ని సమూలంగా మార్చే సైతాంతిక ధైర్యం ఎక్కడ ఉంది ఇది తేలాల్సిన సమయం వచ్చింది. అంబేద్కర్ మానవ సమాజం అంతా సమానంగా ఉండాలని పరితపించారు. భారతదేశంలో కుల వ్యవస్థను ధ్వంసం చేయకుండా ఏ వ్యవస్థను రూపొందించలేమని స్పష్టంగా చెప్పారు. ఆధునిక జాతిగా ప్రపంచంలో భారతజాతి ఎదగాలంటే కులం అడ్డుపడుతుంది. కుల వ్యవస్థ సంకెళ్లు తెగిపోకుండా పేదరికం అడ్డుగా ఉంటుంది. ఆర్థికంగా ముందడుగు వేయకుండా ఏ సంకెళ్లు తెగే పరిస్థితి నేటి కాలంలో లేవు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా అన్నింట దళితులు అట్టడుగున ఉన్నారంటే దానికి ఇన్నేళ్లుగా పరిపాలించిన పాలకుల వైఫల్యమే కారణం గా చెప్పవచ్చు. దళితుల ఓట్లతో గద్దెనెక్కుతున్న ప్రభుత్వాలు ఉరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఉరు దాటాక బోడి మల్లన్న అనే లాగా వారిని పూర్తిగా విస్మరిస్తున్నారు. తరతరాలుగా సమాజంలో వేలునుకున్న వివక్షను, వెనుకబాటుతనాన్ని అంతం చేయకుండా దేశాన్ని అభివృద్ధి బాట పట్టించడం అసాధ్యం. ఈ విషయాన్ని గ్రహించిన రాజకీయ పార్టీలు విధానాల సంగతి ఎలా ఉన్నా దళితులను విస్మరించే ధైర్యం ఏ రకంగా చేసే పరిస్థితులలో లేరు. కనీసం మాటల్లోనైనా దళిత నామస్మరణ, అంబేద్కర్ ను గౌరవించుకోవడం చేస్తూ ఉన్నాయి.
దేశంలో మెజార్టీ దళితులకు సొంత ఇల్లు లేదు. 92 శాతానికి పైగా కటిక దారిద్యంలో మగ్గుతున్నారు. శిశు మరణాలలో ఎస్సీ కులానికి చెందిన పిల్లలు 85 శాతం పైగా ఉన్నారు. కేంద్ర అధికారిక లెక్కల ప్రకారం దారిద్రరేఖకు దిగువన ఉన్న జనాభాలో దాదాపు సగం మంది దళితులు ఉన్నారు. సగటున మానవాభివృద్ధి సూచి అన్నింటిలో వారిది అట్టడుగు స్థానమే. ఎస్సీలపై రోజుకు వందలాది దాడులు జరుగుతున్నాయి. ఇవి సర్కారు గణాంకాలు చెప్పిన మాటలే. ప్రతిరోజు ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి కదా. దళితులు ఈ దేశ ప్రధాన స్రవంతిగా ఎదిగి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి. ఈ దేశ మూలవాసులు దేశంలో మెజార్టీ ప్రజలు దేశం లో అపార సంపద సృష్టించిన కోట్లాది దళిత బహుజనులు ఇప్పుడు ఇలాంటి దుస్థితిలో ఉండటానికి ఎన్నో కారణాలు. ప్రభుత్వాలు దశాబ్ద ల కాలంగా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యాన్ని అవలంబించాయి. దాన్ని తలకెత్తుకున్న ఉదారవాద ఆర్థిక విధానంతో దళితుల జీవితాలు చిన్నబిన్నమయ్యాయి. సామాజిక దోపిడీ, ఆర్థిక దోపిడీ కలగలిపి మరింత అట్టడుగు కు అనగదొక్కా బడ్డారు. అంబేద్కర్ మహాశయుని వల్ల వచ్చిన రిజర్వేషన్లు కొంతమేర విద్యా, ఉద్యోగాలలో మార్పు తెచ్చినప్పటికీ సమస్యకు మూల కారణాలు చెక్కుచెదరలేదు. ప్రభుత్వ రంగం కుదించకపోవడంతో ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు కాక ఉపాధి అవకాశాలు దిగజారాయి. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ నియామకాలు రావడంతో దళితుల కోసం రాజ్యాంగం నిర్దేశించిన కోట ఉనికి నామమాత్రంగా మారింది. ప్రభుత్వ నిధులతో నడిచే వ్యవస్థలోనే రిజర్వేషన్లు అమలు అస్తవ్యస్తంగా ఉంటే, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు కానీ పరిస్థితి. సామాజిక వివక్ష ఖచ్చితంగా నీరసించాల్సిందే, అది ఎన్ని రూపాలలో ఉన్న రూపుమాపాల్సిందే. వివక్షను నెట్టివేసి గౌరవపదమైన జీవనం కోసం గుండె ధైర్యం ఇవ్వాల్సిన ఆసరా, బాధ్యత పాలకుల పైనే ఉంటుంది. ఇంతకాలం ఈ వివక్షను పాలకులంతా నిర్లక్ష్యం చేశారు. దళితులను ఓటు బ్యాంకుగా చూస్తూ తాము పీఠం ఎక్కడానికి వాడుకుంటున్నారే తప్ప దళితుల కోసం అంటూ చేసింది ఏమీ లేదు.ఇలాంటి పరిస్థితుల నుండి విముక్తి కలగాలంటే నిర్మాణాత్మక విధానాలు, పథకాలు, అమలు జరగాల్సిన అవసరం ఉంది. అందుకోసం బాబా సాహెబ్ ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్కరు బోధించు, సమీకరించు, పోరాడు నినాధాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాల్సి ఉంది.