భరోసెమంద్‌

Bharosemandసబ్సే భరోసెమంద్‌ నామ్‌, ఒక టూత్‌ పేస్టు గురించో లేక ఒక మందు గురించో రేడియోలో చెప్పేవాళ్లు నాం అంటే పేరని తెలుసుగాని ఈ భరోసెమంద్‌ ఏమిటో తెలీక మా నాన్ననడిగితే చెప్పాడు నమ్మకమైన అన్న అర్థమని. వ్యాపార ప్రకటనల్లో బాగా వాడే ఈ భరోసెమంద్‌ అన్న పదం రేడియోలు పోయాక అంతగా గుర్తు చేసుకోలేదు. కానీ, నేటి రాజకీయ వ్యాపార ప్రకటనల్లో అటునుండి, ఇటునుండి ఆ భరోస అన్న పదాన్ని వాడి అవతల పడేస్తున్నారు. అసలు ఈ భరోసా అన్న పదం ఉర్దూ పదం, అయినా మరాఠి, హింది, తెలుగు మొదలైన భాషల్లో తానూ ఇమిడిపోయింది. అందుకే ఆ పదమంటే నాకు భరోసా. మార్కెట్లో పోటీ బాగా ఉన్నప్పుడు ఈ నమ్మకమనే పదాన్ని వాడి అంతే భరోసగా కొనుగోలుదార్ల జేబులకు చిల్లులు వేస్తున్నారు. ప్రకటనల ద్వారా టీవీల్లో, రేడియోలో, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో చెవులు చిల్లులు పడేలా, కండ్లకు కాట్లు వేస్తూ సాగుతాయి ఈ ప్రకటనలు. అంతా వ్యాపారమైన ఈరోజుల్లో ఎవరిని నమ్మాలి?అన్న ప్రశ్న అలాగే నిలిచిపోతోంది, సమాధానం లేకుండా.
ఆ…. అయినా నేటి జీవితాల్లో దేనికీ భరోసా లేదండి అనే వాళ్లను రోజూ చూస్తుంటాము. అంటే దేనికీ గ్యారెంటీ లేదండీ అన్నదే దాని అర్థం. ఈ గ్యారెంటీలు వారెంటీలు మనకు వ్యాపారంలో బాగా కనిపిస్తాయి. అవన్నీ భరోసాకు ఇంగ్లీషు పదాలేనని గుర్తుంచుకోవాలి. భాష ఏదైనా భావం ముఖ్యం కాబట్టి, జీవితంలో రకరకాల భాషలను చూస్తాం కాబట్టి మనమీద మనకు భరోసా ఒక్కోసారి పెరుగుతుంది కూడా. అలాగని అందరినీ అన్నింటినీ నమ్ముతామా అంటే మాత్రం సమాధానం వేరుగా ఉంటుంది. కొందరు మాటల్లో, కొందరు చేతల్లో ఈ భరోసాను చూపుతారన్న విషయం అందరికీ తెలుసు. అసలు మాటకు చేతకూ పొంతన ఉండదని అనడం ఎంత వీజీనో రెండూ ఒకేలా ఉండడం అరుదే కాదు, మనకు ఆశ్చర్యం తెప్పిస్తుంది కూడా. రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు మాది గ్యారెంటీ అని చెప్పి అధికారంలోకి వచ్చినోళ్లు పీఠమెక్కిన వెంటనే నిరంకుశ చక్రవర్తిలాగా ప్రవర్తించొచ్చు. సమ్మెలు చేయకూడదు, ధర్నాలు చేయకూడదు, మమ్మల్ని అడిగితే చేసేస్తాము అలాగని విపరీత మనస్తత్వంతో ఉండొద్దంటారు. అసలు విపరీతం నియంతవైన నువ్వా, ప్రజాస్వామికంగా పోరాడుతున్న మేమా అని కార్మికులు, ఉద్యోగులు నినదించిన రోజులను మరచిపోకూడదు. విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ఇచ్చినట్టు ఈ నాయకులకు కూడా అప్పుడప్పుడూ సెలవులిస్తారు ప్రజలు. ఆ సెలవులను ఎలా ఉపయోగించుకోవాలి, ప్రజలు మమ్మల్ని నమ్మాలంటే ఏమి చేయాలి, వాళ్లకు భరోసా ఎలా కలిగించాలి అన్నది అసలు ప్రశ్న.
అవతలవారిని తిట్టడం, నిత్యం వాళ్లు ఇవి చేయలేదు, అవి చేయలేదు అని ప్రశ్నించడం, ప్రకటించడం తమపై మళ్లీ భరోసా తెచ్చే టెక్నిక్‌నే కానీ అది ఎప్పుడూ పనిచేయదు. ఎందుకంటే అంతకు ముందరి చరిత్రను అవతలి వాళ్లూ సమయానుకూలంగా తెలియజేస్తూనే ఉంటారు. ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదన్నా, బుల్లెట్‌ దిగిందా లేదా అన్నట్టు డైలాగులు వేస్తూ ఉంటారు, సమాధానాలు చెబుతూ ఉంటారు. నా వైపు ఒక వేలు చూపితే మిగతా వేళ్లు నిన్ను చూపిస్తాయి చూసుకో అనొచ్చు కూడా. అలాగని ఇతరులను చూపడం మాత్రం ఆపరు, ఆపలేరు. లెక్కల్లోని ప్లస్సు మైనస్సు సూత్రాలను తెలిసో, తెలియకో రాజకీయులందరూ పాటిస్తుంటారు. తమ మైనస్సులను కప్పిపుచ్చుకోవడానికి అవతలివారి మైనస్సులను బాగా వాడుకుంటారు. అలా చేయడం వల్ల తమలో ఉన్న మైనస్సులు పెరుగుతూనే ఉంటున్నాయి కాని నిజమైన ప్లస్సులు పెరగడం లేదన్నది సత్యం.
ఇంకో రకం వాళ్లుంటారు, వాళ్లకెప్పుడూ ప్రజలపై భరోసా ఉండదు, వాళ్ల నమ్మకమంతా ఇ.వి.ఎంల పైనేనని ఇతర రాజకీయులు చెప్పగా వింటున్నాము. ప్రజలు కూడా ఇవన్నీ చూస్తున్నారు. ఈమధ్య మెగాస్టార్‌ ఒక మాటన్నారు అదేమంటే తాను మొదట రచ్చ గెలిచి తరువాతే ఇంట గెలిచానని సగర్వంగా చెప్పుకున్నారు. ఆయనలాగా శ్రమచేసే మనస్తత్వం ఉండాలే కాని ఎన్నో పనులు చేయొచ్చు. ఎన్నేళ్ల నుండో దాచుకున్న భావాలను అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు. అందుకేనేమో రాజకీయాలకంటే తన కళనే నమ్ముకున్నాడాయన. ఆయన భరోసా తన నటన, తన స్టెప్పులు, తన హాస్యం, తన స్టంట్లు. కట్‌ చేసి రాజకీయుల దగ్గరికొస్తే అదే చూస్తాము, వాళ్లు రాజకీయాలను మాత్రమే నమ్ముకున్నారు. అదే వారి భరోసా. ఇరవైనాలుగు గటలూ తాముకూడా తమ నటన, తమ మాటలనే అస్త్రాలపై మాత్రమే నమ్మకాన్ని పెట్టుకొని జీవితాలు సాగిస్తున్నారు.
అసలివన్నీ కాదు కాని పార్టీ పేరులోనే భరోసా అన్న పదం తగిలించి ప్రజా భరోసా, జన భరోసా అన్న పేర్లున్న పార్టీలు ముందు ముందు రావచ్చునేమో. ముందే ఎ.ఐ అంటే కృత్రిమ తెలివితో తమ మెదళ్లకు పనులు చెప్పడం ఆపేస్తున్న జనాలకు దానిపై మరీ భరోస ఎక్కువైందనిపిస్తుంది. అసలు మనుషుల మెదళ్లు చురుకుగా పనిచేయడం వల్లే ఇన్నిన్ని విజయాలు సాధిస్తున్నారన్న విషయం పక్కన పెట్టి ఈ కృత్రిమ మేధస్సును అవసరమైనంత వరకే వాడుకుంటే మంచిదని ప్రజలగురించి ఆలోచించే వాళ్లు చెబుతున్నారు. లేదంటే రోబో సినిమాలో మాదిరి ఈ కృత్రిమ తెలివి ముందు అసలైన తెలివి పనిచేయకపోవచ్చు. ముందు తమ తెలివిపై భరోసా పెట్టుకోవడం ఉత్తమం.
ప్రజలు అంటే ఇక్కడ అన్నిరకాల, తరగతుల ప్రజలు తమ భరోసాను మారుస్తూ ఉంటారు. మంచిదే కాని కొన్ని అపోహలకు, ఎప్పటికప్పుడు క్షణికమైన ఆవేశాలకు తెలియకుండానే గురౌతుంటారు, మోసపోతుంటారు. నింపాదిగా ఆలోచించి నిజంగా ప్రజలకు, దేశానికి భరోసానిచ్చే పక్షాలను పైకి తెచ్చే పని వాళ్లే చేయాలి. స్వాతంత్య్ర సంగ్రామంతో పాటు అన్నింటా పాల్గొనే వారిని నమ్మాలని చదువుకున్న వాళ్లు అందరికీ చెప్పాలి. ప్రజల మధ్య విభజన రేఖల్ని గీసి ఆ ముసుగులో తమ పనులు చేసుకుపోయేవారిని నమ్మడం, వారిపై భరోసా కలిగి ఉండడం ఎంత తప్పో గ్రహించాలి. ఊరకే పథకాలకు భరోసా, యోజన, స్రవంతి, విజన్‌ లాంటి మాటల్ని తగిలించి తమ మిత్రులకు మాత్రమే వాటిని అందించే వారిని ఓ కంట కనిపెట్టి నిజమైన ప్రజా నాయకులను ఎన్నుకోవడమే భవిష్యత్తుకు భరోసా.
– జంధ్యాల రఘుబాబు, 9849753298