అసెంబ్లీ ఆవరణలో గాంధీ, అంబేద్కర్‌కు భట్టి నివాళి

అసెంబ్లీ ఆవరణలో గాంధీ, అంబేద్కర్‌కు భట్టి నివాళినతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మగాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు నివాళి అర్పించారు. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఆయన జాతీయ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం గాంధీభవన్‌లో మహాత్మగాంధీ విగ్రహానికి నివాలర్పించారు. ఆ తర్వాత గన్‌పౌండ్రీలోని అమరువీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళలుర్పించారు.
సోనియాను ఎన్నో సార్లు అవమానించారు కేసీఆర్‌పై మహేష్‌కుమార్‌గౌడ్‌ విమర్శ
తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన సోనియాగాంధీని మాజీ సీఎం కేసీఆర్‌ ఎన్నో సార్లు అవమానించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. ఎందరో మహనీయుల త్యాగాలతో తెలంగాణ సిద్దించిందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఆయన జాతీయ జెండావిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. అందుకే బీఆర్‌ఎస్‌ను జనాలు ఓడించారని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించి ఆమెకు బహుమతిగా ఇచ్చారని తెలిపారు. ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందో వాళ్ళ గుర్తుగా అమర వీరుల స్థూపాన్ని తెలంగాణ చిహ్నాంలో ఉంచుతామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే అది శ్రీనివాస్‌, రోహిత్‌ చౌదరీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, గీతారెడ్డితోపాటు పలువురు సీనియర్‌ నాయకులు ఉన్నారు. అంతకు ముందు సేవాదల్‌ ఆధ్వర్యంలో సేవాదల్‌ మార్చ్‌ నిర్వహించారు.