అవగాహన లేమితోనే భట్టి నిందారోపణలు

– ప్రభుత్వాస్పత్రుల్లో నడిచే దారి వెంట కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని గమనించాలి : విలేకర్ల సమావేశంలో గుత్తా
నవతెలంగాణ-నల్లగొండ
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు ఆయన అవగాహన లేమికి నిదర్శనమని, ఆయనకు మధిర నియోజకవర్గం తప్ప రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు, నదులు, వాగులు, వంకలు ఉన్నాయో తెలియదని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాను, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఏమీ చేయలేదన్న భట్టి విక్రమార్క విమర్శలపై శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశంలో గుత్తా మాట్లాడారు. రేవంత్‌రెడ్డి, బండి సంజరు పాదయాత్రలు చేసి అలసిపోయారని, భట్టికి కూడా అలుపు తప్ప మరేమీ మిగలదన్నారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 600 గ్రామాలకు తాగునీటి వసతితోపాటు హైదరాబాదులో భట్టి నివాసానికి అందుతున్న కృష్ణాజలాలు కూడా తాను మంజూరు చేయించిన ఏఎంఆర్పీ ఎత్తిపోతల పథకం పుణ్యమేనని భట్టి గ్రహించాలన్నారు. ఆయన పాదయాత్ర చేస్తున్న రోడ్లు కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసినవేనని, జడ్చర్ల-కల్వకుర్తి, సిరివెంచ-సాగర్‌ రహదారుల విస్తరణ కూడా తన కృషితోనే జరిగాయన్నారు. కాంగ్రెస్‌ అసంపూర్తిగా వదిలేసిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి డిండి ప్రాజెక్టు కింద రెండు పంటలకు నిరందిస్తున్నామని, తమ కృషితో వచ్చిన రోడ్ల పైన, సాగు కాబడిన పంటల వెంట భట్టి పాదయాత్ర సాగుతుందన్నారు. నడిచే దారిలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం, తాను చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే చూసీ చూడనట్టుగా భట్టి రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్‌ మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల చేపట్టి రిజర్వాయర్లు, కాలువల నిర్మాణంకు ఇప్పటికే రూ.2,221 కోట్లతో పనులు జరిపించారన్నారు. కాంగ్రెస్‌ మాత్రం ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు పెట్టి స్టేలు తెచ్చి పనులకు అడ్డం పడిందన్నారు. కాంగ్రెస్‌ అసంపూర్తిగా వదిలేసిన కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌ పనులను కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందని చెప్పారు. జిల్లాలో కాంగ్రెస్‌ పాలనలో నామామాత్రంగా మిగిలిన ఎస్సారెస్పీ రెండో దశ కాలువలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలందిస్తున్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు.