– క్యూ3లో రూ.4,104 కోట్ల లాభాలు
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ ఆకర్షణీయ ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 12.25 శాతం వృద్ధితో రూ.4,104.20 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.3,656 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా. క్రితం క్యూ3లో ఆ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 2.84 శాతం తగ్గి రూ.9,148.57 కోట్లుగా ఉన్నప్పటికీ మెరుగైన లాభాలు ప్రకటించడం విశేషం. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 3.34 శాతానికి తగ్గాయి. ఇంతక్రితం ఏడాది ఇదే డిసెంబర్ ముగింపు నాటికి 4.39 శాతంగా జీఎన్‌పీఏ ఉంది. నికర నిరర్ధక ఆస్తులు 0.89 శాతానికి మెరుగయ్యాయి. కెనరా బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 62.93 శాతం వాటా ఉంది. ఈ బ్యాంక్ 2024 డిసెంబర్ ముగింపు నాటికి 9,816 శాఖలు, 9,715 ఏటీఎం కేంద్రాలను కలిగి ఉంది. విదేశాల్లో లండన్, న్యూయార్క్, దుబారు, ఐబియు గిఫ్ట్ సిటీలో ఒక్కో శాఖ చొప్పున నాలుగు శాఖలను కలిగి ఉంది.