భేటి బచావో భేటి పడావో

నవతెలంగాణ – మల్హర్ రావు
ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ రాధిక, మిషన్ శక్తి ఇంచార్జి కోఆర్డినేటర్ జి.అనూష అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, మిషన్ శక్తి ఇంచార్జి అనూష హాజరై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా భేటి బచావో, భేటి పడావో నినాదంతో బాలబాలికలు ఎదుర్కొంటున్న లింగ బేదాలపై ప్రజలకు అవగాహన పెంపొందించి, బాలికలకు చట్టపరమైన హక్కులను నాణ్యమైన విద్య, వైద్యం, పోషకాహారాన్ని అందించేలా చూడాలన్నారు. 18 సంవత్సరాలు నిండకుండా అమ్మాయిలకు, 21 సంవత్సరాలు నిండకుండా అబ్బాయిలకు వివాహం చేయకూడదన్నారు. బాల్య వివాహాలు నిరోధక చట్టం 2006 ప్రకారం, చట్టరీత్యా నేరమని తెలిపారు. అలాగే 1098,14567 అనే టోల్ ఫ్రీ నెంబర్ల గురించి వివరించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి 181 టోల్ ఫ్రీ నెంబర్ ను మహిళలు ఆపద సమయంలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్  సూపర్ వైజర్ సరస్వతి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావు, మోహిమోద్దీన్, సురేష్, ఉపాధ్యాయులు, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.