భూం…ఫట్‌

– కాజేసిన రియల్టర్లు
– సేత్వార్‌, ఖాస్రా పహాణీల్లో సర్కార్‌ భూమిగా నమోదు
– రికార్డులు మార్చిన ఇంటి దొంగలు
– హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో జోన్‌ పరిధి నుంచి తొలగింపు
– మాకేం తెలియదు : రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాజకీయ నేతలు.. ప్రభుత్వ పెద్దలు.. రియల్టర్లు.. ఆక్రమణదారులు.. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ధరణి పోర్టల్‌ ఉపయోగపడుతోంది. కంటికి కనిపించిన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ధరణి పోర్టల్‌లో లోపాలను తమకు ఆయుధాలుగా మలుచుకుంటున్నారు. అడ్డంగా భూకబ్జాలకు పాల్పడి కోట్లు వెనకేసుకుంటున్నారు.
రూ.350 కోట్ల విలువ చేసే అటవీ భూములు మాయం..!
సర్కారు భూమా, అటవీ భూమా, సీలింగ్‌ భూములా అనే తేడా లేకుండా కోట్ల విలువ గల భూమైతే చాలు.. రికార్డులు మార్చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చుకోవడమే కాకుండా హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న జోన్‌ కూడా మార్చేసిన ఘనులు వారు. ఆ రకంగా కోట్ల రూపాయల అటవీ భూమిని మాయ చేసి పట్టా భూమిగా మార్చుకున్న వైనం బయటపడింది. అధికారులనే పావులుగా వాడుకుని ఇదంతా చక్కబెట్టడం గమనార్హం. దీనిపై సంబంధింత రెవెన్యూ అధికారులను ఎవరిని అడిగినా ఏమీ తెలియదని దాటవేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందినా.. ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వ భూములకు కాపలా ఉండాల్సిన వారే నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది రైతులు, స్థానికులు, అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ప్రత్యేక కథనం.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 249లో 1026.19 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో కొంత భాగం అటవీశాఖ పరిధిలో ఉండగా, మరి కొంత సర్కారీ భూమిగా నమోదైంది. 1960-61 నుంచి 1964-65 వరకు ఖాస్రా, సేత్వార్‌ పహాణీల్లోనూ ఇది సర్కారు కంచెగా నమోదైంది. దీనిలో కొంత సాగుకు యోగ్యంగా ఉండటంతో స్థానికంగా ఉన్న పేద రైతులు ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. 1980-81 నుంచి 1985-86 వరకు సర్వే నంబర్లు 249, 249/1 మినహా సర్వే నంబర్‌ 249/2 నుంచి 249/17 వరకు ఉన్న 70.24 ఎకరాలు పట్టా భూమిగా మారింది. 249/1 మాత్రం అలాగే వదిలేసి, ఆ తర్వాత వచ్చిన 249/2 నుంచి 249/17 సర్వే నంబర్లలోని భూమి పట్టా భూమిగా మారింది. నిజానికి ఈ భూములు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లోనూ గ్రీన్‌జోన్‌ కింద నమోదై ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు అవకాశం లేదు. కొంత మంది నేతలు, అధికారులు ఓ ప్రణాళిక ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకుని రైతుల నుంచి చాలా తక్కువ ధరకు ఈ భూములను కొట్టేసినట్టు తెలిసింది. ఆ తర్వాత తమకున్న అధికార, ఆర్థిక బలంతో రెవెన్యూ, అటవీశాఖల అధికారులను మేనేజ్‌ చేయడం.. అసలు సర్వే నంబర్‌కు అనేక సబ్‌ డివిజన్లు సృష్టించడం చకచకా చేశారని సమాచారం. గ్రీన్‌జోన్‌ పరిధిలో ఉన్న తమ భూములకు విముక్తి కల్పించాలని కోరుతూ ఆయా శాఖల అధికారులు ఇచ్చిన రిఫరెన్స్‌ లెటర్లతో హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేశారు. ప్రభుత్వంలోని పెద్దలు చెప్పిందే తడవుగా హెచ్‌ఎండీఏ అధికారులు సైతం ఏ మాత్రం ఆలోచించకుండా సదరు సర్వే నంబర్లలోని భూమిని మాస్టర్‌ ప్లాన్‌ నుంచి తొలగించారన్న ఆరోపణలున్నాయి. 249/1లోని భూమి గ్రీన్‌జోన్‌లో ఉంటే ఆ పక్కనే ఆనుకుని ఉన్న వివాదాస్పద సర్వే నంబర్లలోని భూములు మాత్రం ఎలా రెసిడెన్షియల్‌ జోన్‌లోకి మారాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎన్‌ఓసీల జారీపై అనుమానాలెన్నో..?
అటవీ శాఖ తన భూములను నిర్ధారించక ముందే అప్పటి ఇన్‌చార్జి కలెక్టర్‌ ఏకంగా అవి ప్రయివేట్‌ పట్టా భూములుగా నిర్ధారిస్తూ ఎన్‌ఓసీ పత్రం (16/11/2019) జారీ చేశారు. కలెక్టర్‌ ఎన్‌ఓసీ జారీ చేసిన ఏడాది తర్వాత అటవీ శాఖ(799 ఎకరాలు)గా నిర్ధారిస్తూ రిపోర్టు ఇవ్వడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు అప్పటి కలెక్టర్‌ జారీ చేసిన ఒక ఎన్‌ఓసీపై సంతకం లేదు. మరో ఎన్‌ఓసీపై సంతకం ఉండటం గమనార్హం. ఇలా ఒకే భూమికి రెండు ఎన్‌ఓసీలు జారీ అయ్యాయి. అంతే కాదు 2018 ముందు ఆయా రైతుల పేరున ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల్లోనూ ఆ భూములు అమ్మడం కొనడం నిషేధం అని రాసి ఉంది. ధరణి వచ్చిన తర్వాత ఈ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయలేదు. దాంతో కొనుగోలుదారులు ప్లాన్‌ ప్రకారం వీటిని పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలిసింది.
తొలుత పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌
ధరణిలో తమ పేర్లు రికార్డు చేయించుకుని, పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు నుంచి తమ డాక్యుమెంట్‌లను రిలీజ్‌ చేసుకున్నారు. ఆయా భూములన్నీ పట్టా భూములే అయితే వాటిని కొనుగోలు చేసిన వారు డాక్యుమెంట్‌ను సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో పెండింగ్‌ జాబితాలో పెట్టాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు ఆ భూములను అమ్మిన రైతులకు మొత్తం కాకుండా సగం డబ్బులు మాత్రమే చెల్లించారు. దీనిపై సరైన వివరణ ఇచ్చే అధికారులే లేరు. తమ హయాంలో జరిగింది కాదని, ఆ విషయాలు ఏవీ తెలియవన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.