భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తికోసం…

For the liberation of landతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.పోరాడితే పోయేదేమీ లేదన్న తెగింపుతో భూమి, భుక్తి,వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం రైతుకూలీ జనం తిరగబడిన అపూర్వ ఘట్టం. చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించిన అద్భుత సందర్భం.ఉక్కు సంకల్పంతో ప్రాణాలను తృణప్రాయంగా భావించి పోరాడిన వీరులు,వీరవనితలెందరో.రాజ్య వ్యవస్థ పట్ల సమాజంలో అసంతృప్తి రగిలినప్పుడు జరిగేవే సామాజిక ఉద్యమాలు. తమ సాంఘిక వ్యవస్థలో ఇతరుల జోక్యం,సంస్కృ‌తిపై ఆధిపత్యం,ఆర్థిక దోపిడీ పెచ్చుమీరిపోయినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది.ఆ తిరుగుబాటే మహా ఉద్యమానికి దారితీస్తుంది.ఇటువంటి పరిస్థితుల్లో జరిగినదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.
రెండో ప్రపంచ యుద్ధానంతరం భారతదేశంలో చెలరేగిన రైతు ఉద్యమాల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చాలా పేరెన్నికగలది.అంతే కాకుండా ఇది యావత్‌ తెలంగాణ సమాజాన్ని కదిపిన సామాజిక ఉద్యమం కూడా. ఈ ఉద్యమం ఫలితంగా భూసంస్కరణలకు సంబంధించిన చట్టాలు రూపొందించడమే కాకుండా తెలంగాణ ప్రాంతపు సామాజిక,వ్యవసాయిక రంగాల్లో స్పష్టమైన మార్పులు జరిగాయి. తెలంగాణ జిల్లాల్లోని రైతాంగం భూస్వామ్య దోపిడీ విధానానికి అధికంగా గురైంది.ఈ భూస్వామ్య వ్యవస్థలో జాగీర్‌దార్లు, దేశముఖ్‌లే అధిక శాతం భూమిని తమ ఆధీనంలో ఉంచుకునేవారు. బలవంతులు,శక్తిమంతులైన జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్‌, పట్వారీల పెత్తనం ఎక్కువగా ఉండేది.వీరినే దొర లేదా ఆసామిగా వ్యవహరించేవారు.ఈ దొరలే భూస్వాములుగా, రుణదాతలుగా, గ్రామాధికారిగా చెలామణి అవుతూ సంప్రదాయిక ప్రత్యేక హక్కులను,సేవలను పొందేవారు. భూస్వాముల దౌర్జన్యానికి,దోపిడీకి వెట్టిచాకిరీ వ్యవస్థ ఒక ప్రతీకగా కనపడేది.వెట్టి చాకిరీలో అధిక సంఖ్యాకులు సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినవారు.అంటరాని కులాలవారు ఉండేవారు.
1927లో రాష్ట్ర అధికారులకు,గ్రామాధికారులకు వెట్టిచాకిరీ చేయడానికిగాను నాటి నిజాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని బట్టి నాటి నిరంకుశపాలనను అంచనా వేయవచ్చు. కాలక్రమంలో ఈ దోపిడీ విధానమే పరోక్షంగా చట్టబద్ద వ్యవస్థగా చెలామణి అయ్యింది.పేద ప్రజలను పీడించడం అనేది ఈ బడా భూస్వాములు తమ జన్మహక్కుగా పరిగణించారు. వెట్టిచాకిరీ నిజాం పరిపాలనా ప్రాంతమంతటా విస్తరించి ఉండేది.పెద్ద భూస్వాములు తమ ఆధీనంలో ఉన్న పేద రైతుకుటుంబాలను తమ భూములను సాగుచేయడానికి,మిగతా కుటుంబ సభ్యులను వివిధ రకాల పనులు చేయడానికి వినియోగించడం తప్పనిసరి చేశారు. తెలంగాణలో నాగు అనే వడ్డీ వ్యాపారం రైతులను కూలీలుగా మార్చింది. ఇన్ని ప్రజా వ్యతిరేక విధానాలను సహించలేని ప్రజలు నిజాం నిరంకుశ పాలనను,భూస్వామ్య వ్యవస్థను అంతం చేయడం,పన్నుల నిరాకరణ,మద్యపాన నిషేధం,వడ్డీ వ్యాపారాన్ని నిర్మూలించాలంటూ సాగించిన ఈ రైతాంగ సాయుధ పోరాటం భారతదేశ రైతాంగ పోరాటాల్లో ఒక మహత్తర విముక్తి పోరాటం. చైనాలో తప్ప ఆసియాలో ఇంత పెద్ద రైతాంగ పోరాటం ఎక్కడా జరగలేదు.
1936 నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రాంతంలో తన కార్యక్రమాలను ప్రారంభించి కాలక్రమంలో తెలంగాణ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించింది.1944-46 మధ్యకాలంలో తెలంగాణ అంతటా కమూనిస్టు పార్టీ కార్యక్రమాలు విస్తరించి ఆంధ్రమహాసభ తీర్మానాలను చేజిక్కించుకొని పెద్ద ఎత్తున రైతు ఉద్యమం ప్రారంభం కావడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పర్చారు. 1946 జూలై 4న లాఠీలు,కొడవళ్లు పట్టుకొని వేలాదిమంది రైతులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి దేశముఖ్‌ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అయితే దేశ్‌ముఖ్‌లు ఏర్పాటు చేసుకున్న కిరాయి గూండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య నేలకొరిగాడు. కొమరయ్య వీర మరణంతో ఉద్యమం ఉధృతమై సాయుధ పోరాటానికి నాంది పలికింది.
1948లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ రెండో సమావేశంలో తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ఒక విప్లవ పోరాటంగా కొనసాగించాలని తీర్మానించారు.రైతులందరినీ సైన్యంగా ఏర్పర్చి గెరిల్లా పోరాటం చేశారు.నిజాం ప్రభుత్వం ఎదుర్కొంటున్న కల్లోల పరిస్థితులను,ప్రజల భయాందోళనలను గుర్తించిన భారత ప్రభుత్వం 1948, సెప్టెంబర్‌ 13న భారత సైన్యాన్ని హైదరాబాద్‌కు పంపించింది. తెలంగాణ ప్రాంతంలో రజాకార్లు కాశీం రజ్వీ సృష్టించిన అరాచకం,దారుణ, మారుణకాండలకు అడ్డుకట్ట వేయడానికి,శాంతి భద్రతలను కాపాడటానికిగాను పోలీస్‌ చర్యను జరిపి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసారు.ఈ చర్య అనంతరం కూడా భారత కమ్యూ నిస్టు పార్టీ సాయుధ రైతాంగ పోరాటాల్ని కొనసాగించాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది.నిజానికి పోలీస్‌ చర్య సర్వసమ్మతం కాకపోయినా అత్యావశ్యక చర్య అయ్యింది. రజాకార్లను అణిచివేసి నిజాం పాలనను అంతం చేసి సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పడంతో తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న రైతు ఉద్యమాన్ని అణిచివేయడంపై కేంద్రం దృష్టి కేంద్రీకరించింది.ఈ చర్యలో భాగంగా భారత సైన్యం కమ్యూనిస్టు దళాలలను అణిచివేయడానికి సకల ప్రయత్నాలు చేసింది.
అంతిమంగా ఐదేండ్లపాటు కొనసాగిన ఈ వీరోచిత రైతాంగ పోరాటంలో వివిధ స్థాయిలకు చెందిన రైతులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.ఈ ఉద్యమం మొట్టమొదటిసారిగా కౌలుదారు,భూమిలేని రైతు కూలీలను ఏకం చేసింది.పేద రైతులు బలం పుంజుకోగలిగారు.ముఖ్యంగా వెట్టిచాకిరికి గురవుతున్న గిరిజన రైతులు వెట్టి నుంచి విముక్తి పొందారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రభావంతో సుమారు పదిలక్షల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పంచారు.తెలంగాణ రైతు ఉద్యమం కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసింది.భూస్వామ్య వ్యవస్థ బలహీనపడి రైతాంగంలో ఐక్యత బలపడింది.రజాకార్లకు వ్యతిరేకంగా పుచ్చపల్లి సుందరయ్య,మాకినేని బసవపున్నయ్య,చండ్ర రాజేశ్వరరావు,దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలో రైతాంగ పోరాటం తీవ్ర రూపం దాల్చింది.1947 సెప్టెంబర్‌ 11న నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.ఈ పోరాట కాలంలో గ్రామరక్షక దళాలు రక్షణ వ్యవస్థగా ఏర్పడ్డాయి.సర్దార్‌ వల్లబారు పటేల్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న రైతాంగ పోరాటాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు.సుమారు నాలుగువేల గ్రామాలను కమ్యూనిస్టులు తమ ఆధీనంలోకి తెచ్చుకొని భూస్వాముల భూములను భూమిలేని పేదలకు రైతుకూలీలకు పంచారు.

– నాదెండ్ల శ్రీనివాస్‌, 9676407140