పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ

నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులతో పాటు పక్కభవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందని మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ అన్నారు. బుధవారం వార్డు నంబర్‌ 12 పరిధిలోని ఆదిత్యనగర్‌లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద నిధులు రూ.20 లక్షల 25 వేలతో ప్రైమరీ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాలకు పక్క భవనం కోసం స్థానిక కౌన్సిలర్‌ పవన్‌ నాయక్‌ కృషి చేయడంతో కలెక్టర్‌ నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఆదిత్యనగర్‌లో ఇప్పటి వరకు అద్దె భవనంలోనే ప్రైమరీ పాఠశాల కొనసాగిందన్నారు. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి రావడంతో అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల నుంచి రూ.20 లక్షల 25 వేలను మంజూరు చేశారన్నారు. ఆ నిధులతో భవన నిర్మాణానికి భూమి పూజ చేశామని, పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని గుత్తేదారుడికి సూచించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం శ్రీలత, కాలనీవాసులు, నాయకులు ఎస్‌కే కలీం, వంశీ, జహీర్‌, విలాస్‌, శీలబాయి పాల్గొన్నారు.