న్యూయార్క్ : అమెరికన్ కాంగ్రెస్ ఆమోదంతో పనిలేకుండా ఇజ్రాయిల్‌కు ట్యాంకుల్లో వాడే మందుగుండు(షెల్స్) ను సరఫరా చెయ్యాలని జో బైడెన్ నిర్ణయించాడు. గాజాలో హమస్ పైన ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధానికి మద్దతుగా 106.5మిలియన్ల విలువచేసే ఆయుధ సామాగ్రిని ఇజ్రాయిల్‌కు సరఫరా చేయటానికి కాంగ్రెస్ ప్రమేయం లేకుండా బైడెన్ అత్యవసర అనుమతిని ఇచ్చారు. ఇజ్రాయిల్‌కు అత్యవసరంగా ట్యాంకు షెల్స్ సరఫరా చేయవలసిన అవసరం ఏర్పడిందన్న విషయాన్ని గమనించాలని అమెరికా విదేశాంగ శాఖ కాంగ్రెస్‌కు తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను పరిరక్షించటానికి మాత్రమే అమెరికా అధ్యక్షుడు అత్యవసర నిర్ణయాలను తీసుకోగలుగుతాడు.
ఇలా ఇజ్రాయిల్‌కు ఆయుధ సరఫరా చేయటానికి అత్యవసర ఆమోదం ఇవ్వటం అంతకు ముందు బైడెన్ ప్రతిపాదిత 106బిల్లియన్ల సప్లిమెంటల్ సెక్యూరిటీ వ్యయాన్ని అమెరికన్ కాంగ్రేస్ తిరస్కరించిన నేపథ్యంలో జరిగింది. అలా తిరస్కరింపబడిన 106బిల్లియన్ల వ్యయ ప్రతిపాదనలో 14.3బిల్లియన్ల విలువైన మద్దతు ఇజ్రాయిల్ కు ఉద్దేశింపబడింది. ఇజ్రాయిల్, ఉక్రెయిన్ రెండు దేశాలకు కలిపి మద్దతు వ్యయాన్ని ఆమోదించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పట్టుపట్టాడు. అందుకు రిపబ్లికన్లు ఒప్పుకోలేదు. ఉక్రెయిన్ కు అప్పటికే 113బిల్లియన్ డాలర్ల సహాయాన్ని అందించామని, రష్యాపైన గెలవటానికి కావలసిన వ్యూహం లేకుండా బైడెన్ ప్రభుత్వం అనవసరంగా యుద్ధాన్ని కొనసాగిస్తోందని రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు. గాజాలో పౌరుల మరణాలను అదుపుచేయాలనే షరతుతో మాత్రమే ఇజ్రాయిల్ కు సైనిక సహాయం అందించాలని కొందరు డెమోక్రాట్లు కోరుతున్నారు.