– పొలిటికో
ఇజ్రాయిల్ సైనిక ప్రవర్తనను తాను ప్రభావితం చేయలేని స్థితిలో ఉన్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోపంగా అన్నట్టు పేరు తెలియని ఇద్దరు వైట్ హౌస్ అధికారులను ఉటంకిస్తూ పొలిటికో బుధవారం రాసింది. బైడెన్, అతని సహాయకులు గాజాలో ఇజ్రాయిల్ యుద్ధంతో ”పదేపదే విసుగు చెందారు” అని, ముఖ్యంగా పాలస్తీనా పౌరులలో పెద్ద సంఖ్యలో మరణించిన వారి సంఖ్య వారిని కలవరపెడుతోందని పొలిటికో పేర్కొంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా సలహాను పట్టించుకోవటంలేదని రాసింది. ”నెతన్యాహుపై అతని ప్రభావం తగ్గిపోవడంతో, అధ్యక్షుడి కోపం పెరిగింది” అని పొలిటికో చెబుతోంది. బైడెన్, నెతన్యాహు మధ్య నడుస్తున్న ఫోన్ సంభాషణలు ”అరుపుల మ్యాచ్‌లుగా మారాయి” అని పేరులేని అధికారులను పొలిటికో ఉదహరించింది.
మధ్యప్రాచ్యంలో ”ప్రాంతీయ యుద్ధాన్ని” బైడెన్ నిరోధించలేడనే విషయం అర్థమౌతోందని ఆ పత్రిక తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ భూతల దాడులు ప్రారంభించిన ఒక రోజు తర్వాత ఈ నివేదిక వెలువడింది. తీవ్రమైన వైమానిక దాడులతో కూడిన ఆపరేషన్, హిజ్బుల్లాచే క్రాస్-బోర్డర్ రాకెట్, మోర్టార్ దాడులను ఆపడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. బుధవారం ఇరాన్ ఇజ్రాయిల్‌పై దాదాపు 200 క్షిపణులను ప్రయోగించింది. ఇది గాజా, లెబనాన్‌లలో ఇజ్రాయిల్ చేస్తున్న మారణహోమాన్ని, అలాగే హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రుల్లాతో సహా సీనియర్ ”పాలస్తీనా ప్రతిఘటన” వ్యక్తుల హత్యలకు ప్రతిస్పందన అని ఇరాన్ నొక్కి చెప్పింది.
ఇరాన్, హమాస్, హిజ్బుల్లాలపై ప్రతీకారం తీర్చుకునేటప్పుడు సంయమనం పాటించాలని కోరుతూ, తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయిల్‌కు ఉందని అమెరికా మద్దతు పలికింది. ఇజ్రాయిల్ సైన్యం పౌరులపై విచక్షణారహితంగా దాడులు చేసిందని ఐక్యరాజ్య సమితి పదేపదే ఆరోపించిన తర్వాత కూడా, ఇజ్రాయిల్‌కు ఆయుధాలను సరఫరా చేయడాన్ని ఆపాలని పాలస్తీనా అనుకూల సమూహాలు, అమెరికాలో కొంతమంది డెమోక్రాట్ల నుంచి వచ్చిన పిలుపులను బైడెన్ తిరస్కరించాడు. ఇంతలో ఇజ్రాయిల్, గాజా మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హిజ్బుల్లాతో కాల్పుల విరమణ చేయాలని ఇజ్రాయిల్‌ని బహిరంగంగా కోరినప్పటికీ, లెబనాన్‌లో ఇజ్రాయిల్ సైనిక దాడులను అమెరికా రహస్యంగా ఆమోదించిందని పొలిటికో ప్రారంభంలో రాసింది. అయితే, బుధవారం తరువాత రాసిన దానిలో ఇజ్రాయిల్ తన దాడుల తీరు గురించి అమెరికాకు ముందుగా తెలపకపోవటంతో అమెరికా అధ్యక్షుడికి కోపం వచ్చిందని పొలిటికో పేర్కొంది.
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులకు తాను మద్దతు ఇవ్వబోనని బైడెన్ బుధవారం విలేకరులతో అన్నాడు. ఇజ్రాయిల్ దాని ప్రణాళికాబద్ధమైన ప్రతీకార స్వభావాన్ని లేదా పరిధిని బహిర్గతం చేయలేదు. అయితే మాజీ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్‌తో సహా కొంతమంది అతివాదులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మధ్యప్రాచ్యంలో అమెరికా వైఖరిని రష్యా తీవ్రంగా విమర్శించింది. ”సంక్షోభాలను పరిష్కరించడంలో అమెరికా అసమర్థతను” ఇది తెలియజేస్తుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో మాట్లాడుతూ చెప్పింది.