బైడెన్‌ తడబాట్లు

– జెలెన్‌స్కీను ‘ప్రెసిడెంట్‌ పుతిన్‌’గా పరిచయం
– కమలా హారిస్‌ను ‘వైస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌’గా..
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీస్తున్న సమయంలో ఇప్పటికే తన జ్ఞాపకశక్తి, వయస్సుపై అనేక అనుమానాలు ఎదుర్కొటుంటున్న అధ్యక్షులు, డెమ్రెకాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ మరోసారి వరసగా తడబాట్లుకు గురయ్యారు.తనపై అనుమానాలను మరింతగా పెంచుకుంటున్నారు. గురువారం ఒకే రోజున ఉక్రెయిన్‌ అధ్యక్షులు జెలెన్‌స్కీను ‘ప్రెసిడెంట్‌ పుతిన్‌’గా పరిచయం చేయడం, తరువాత మరొక కార్యక్రమంలో అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహారిస్‌ను వైస్‌ప్రెసిడెంట్‌ ట్రంప్‌గా పేర్కొనడంతో బైడెన్‌పై సందేహాలు మరితంగా బలపడ్డాయి. ఈ నెల 11న వాషింగ్టన్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశ ముగింపు కార్యక్రమం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఉక్రెయిన్‌ అధ్యక్షులు జెలెన్‌స్కీను ‘ప్రెసిడెంట్‌ పుతిన్‌’గా పరిచయం చేయడంతో అక్కడ ఉన్న వారంతా నోరెళ్లబెట్టారు. తరువాత జరిగిన న్యూస్‌ కాన్ఫెరెన్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహారిస్‌ను ‘వైస్‌ప్రెసిడెంట్‌ ట్రంప్‌’గా బైడెన్‌ పేర్కొన్నారు. దీంతో బైడెన్‌ అభ్యర్థిత్వంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని మరో ముగ్గురు డెమోక్రాటిక్‌ చట్ట సభ్యులు డిమాండ్‌ చేశారు.