బుధవారం నాటికి ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య 1000వ రోజులో నూతన దశలో ప్రవేశించింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంతుపట్టడం లేదు. రష్యాలోని కురుస్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ మిలిటరీ అమెరికా, బ్రిటన్ అందచేసిన మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకే క్షిపణులను ప్రయోగించింది. దానికి ప్రతిగా తమ మీద రష్యా ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్లు జెలెన్‌స్కీ యంత్రాంగం గురువారం నాడు ఆరోపించింది. తాను ఎన్నికైతే అధికారం స్వీకరించిన 24 గంటల్లోనే ఉక్రెయిన్-రష్యా పోరును నిలిపివేస్తానని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.తాము అందచేసిన క్షిపణులను రష్యా భూభాగం మీద ప్రయోగించవచ్చని జోబైడెన్ ప్రకటించి వేయించిన తరువాత కూడా ఆ పెద్దమనిషి ట్రంప్ మౌన ముద్ర దాల్చటం అనేక అనుమానాలకు తావిస్తున్నది.తన అనుచరులతో బైడెన్ చర్యను విమర్శించటం తప్ప బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేస్తాననే మాట ట్రంప్ నోటి నుంచి వెలువడలేదు. ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనలో చిత్తశుద్ది ఉందని ఇతర నాటో దేశాలు భావిస్తే వాటిలో కొన్ని బైడెన్‌కు మద్దతు ఇచ్చేవి కాదు. బైడెన్ అధికారం ఇంకా రెండునెలల పాటు కొనసాగుతుంది.ఈ లోగా ఇంకెన్ని పిచ్చిపనులు చేస్తాడో తెలియదు. అమెరికా, ఐరోపా దేశాలు ఇచ్చిన దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ప్రతిగా రష్యా దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నదన్న సంకేతాలతో అమెరికా, కొన్ని నాటో దేశాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నట్లు, తమ పౌరులు రక్షణ కోసం అవసరమైతే కలుగుల్లో దూరి తలదాచుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే రష్యా వైపు నుంచి వెంటనే ఎలాంటి దాడులు జరగకపోవటంతో తమ రాయబార కార్యాలయం అక్కడి నుంచే పనిచేస్తుందని అమెరికా ప్రకటించింది.
జో బైడెన్ ఆకస్మికంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనే చర్చ జరుగుతోంది.యుద్ధాన్ని నిలిపివేస్తానన్న ట్రంప్ ప్రకటనను వమ్ము చేసేందుకే అన్నది ఒకటి.ఉక్రెయిన్‌కు అందచేసిన నిధులు చెల్లించనవసరం లేదని కూడా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం తమ ఖజానాను ఖాళీ చేస్తోందని రిపబ్లికన్లు చెప్పారు. అదే సమయంలో ఈ సంక్షోభం నుంచి అమెరికా ఆయుధ కార్పొరేట్లు భారీ మొత్తాల్లో లాభాలు పిండుకున్నాయి. రానున్న రోజుల్లో కూడా అదే కొనసాగించవచ్చనే ఆయుధ లాబీ మంత్రాంగం బైడెన్ నిర్ణయం-ట్రంప్ మౌనం వెనుక ఉందని చెప్పవచ్చు. భవిష్యత్‌లో జరుగుతాయని భావిస్తున్న శాంతి చర్చలలో ఉక్రెయిన్‌కు బలం చేకూర్చేందుకే ఇదనే వాదనను మరికొందరు ముందుకు తీసుకువచ్చారు. తమ షరతులను ఆమోదించకుండా చర్చల ప్రసక్తే లేదని గతంలోనే పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అవసరమైతే రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ ప్రాంతాలను వదులు కుంటే రాజీకుదరవచ్చని ట్రంప్ చెప్పాడు. దానికి సామ్రాజ్యవాదులు అంగీకరిస్తారన్న భ్రమలు పెట్టుకోనవసరం లేదు. రష్యా తరఫున పోరాడేందుకు పదివేల మంది ఉత్తర కొరియా సైనికులు రంగంలోకి దిగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పటం ఒకసాకు తప్ప మరొకటి కాదు.నిజానికి ఈ అంశంపై ఆరోపణలు తప్ప నిర్ధారణ లేదు.
దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి అంగీకరించేది లేదని గతంలో నాటో కూటమి దేశాలు ప్రకటించిన దానికి బైడెన్ నిర్ణయం విరుద్ధం. ఇలా జరిగితే ఇతర దేశాలు ప్రత్యక్షంగా దాడిలో పాల్గ్గొన్నట్లుగా భావించి తమ శత్రువులుగానే పరిగణిస్తామని, అవసరమైతే అణ్వాయుధాలను కూడా ప్రయోగించేందుకు వెనుకాడబోమని కూడా గతంలోనే రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నాటో కూటమి దేశాలు గతంలో గీసుకున్న గీతను తామే ఉల్లంఘించి సంక్షోభాన్ని మరింతగా ఎగదోసేందుకు పూనుకోవటం తప్ప మరొకటి కాదు. ఈ పరిణామ పర్యవసానాలకు అమెరికా, దాని అడుగుజాడల్లో నడిచే దేశాలదే బాధ్యత అవుతుంది. అమెరికా చర్యపై ఐరోపా దేశాలలో మిశ్రమ వైఖరి వెల్లడైంది. నాటోలోని టర్కీతో పాటు మరికొన్ని దేశాలు వ్యతిరేకించాయి. బ్రిటన్, ఫ్రాన్సు వంటి దేశాలు సమర్ధించటమే గాక తాము అందచేసిన ఆధునిక ఆయుధాలను ప్రయోగించేందుకు అనుమతించాయి. సంక్షోభాన్ని మరింత విస్తరించేందుకు ప్రాతిపదిక వేశాయి. ఇది ఒక్క ఐరోపాకే కాదు, యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగించే పరిణామం.